Home National_news చక్కెర ధరలపై కేజ్రీవాల్ ఫైర్ షుగర్ రేట్స్ పెంపుపై ఆప్ దాడి

చక్కెర ధరలపై కేజ్రీవాల్ ఫైర్ షుగర్ రేట్స్ పెంపుపై ఆప్ దాడి



దేశంలో చక్కెర ధరలు భారీగా పెరగడంపై ఆమ్ ఆద్మీ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా టార్గెట్ చేసింది. ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వ విధానాలే ప్రస్తుత పరిస్థితికి కారణమని ఆరోపించారు. ఎథనాల్ తయారీ కోసం చెరకును మళ్లించడం వల్ల చక్కెర ఉత్పత్తి తగ్గిపోయిందని, ఫలితంగా కేవలం 17 రోజుల్లోనే కిలో చక్కెర ధర రూ.20 పెరిగిందని ఆయన అన్నారు. వీడియో సందేశంలో కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. గతంలో కిలో చక్కెర రూ.46గా ఉంటే ఇప్పుడు రూ.65కు చేరిందని పేర్కొన్నారు. ఎథనాల్‌ను పెట్రోల్‌లో కలపడం ద్వారా చమురు దిగుమతులపై ఖర్చయ్యే విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేయవచ్చని ప్రభుత్వం చెప్పిందని ఆయన గుర్తుచేశారు. అయితే ఇప్పుడు చక్కెర కొరత కారణంగా అదే దేశం దిగుమతుల వైపు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని కేజ్రీవాల్ విమర్శించారు.

ఎథనాల్ విధానమే కారణమా?

చెరకు ఉత్పత్తిలో కొంత భాగాన్ని ఎథనాల్ తయారీకి మళ్లించడం వల్ల దేశంలో చక్కెర లభ్యత తగ్గిందని కేజ్రీవాల్ ఆరోపించారు. ఆయన వాదన ప్రకారం చెరకు ఎథనాల్ వైపు మళ్లడంతో చక్కెర ఉత్పత్తి తగ్గి, మార్కెట్లో సరఫరా కొరత ఏర్పడింది. అదే సమయంలో డిమాండ్ కొనసాగడంతో ధరలు వేగంగా పెరిగాయని చెప్పారు. ఎథనాల్ కలిపిన పెట్రోల్ వల్ల వాహనాల మైలేజీ తగ్గుతోందని, కొన్ని వాహనాలపై ప్రభావం పడుతోందని కూడా ఆయన ఆరోపించారు. అంటే ఒకవైపు పెట్రోల్‌లో ఎథనాల్ కలపడం వల్ల వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని, మరోవైపు చెరకు వినియోగం మారడంతో చక్కెర ధరలు పెరుగుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. వాహనదారుడి జేబుపై ఒక భారం.. వంటింటిపై మరో భారం పడుతోందన్నదే ఆప్ ప్రధాన విమర్శగా నిలిచింది.

ఎగుమతి నుంచి దిగుమతి?

కేజ్రీవాల్ మరో కీలక ప్రశ్నను కేంద్రం ముందు ఉంచారు. ఒకప్పుడు భారత్ చక్కెరను ఇతర దేశాలకు ఎగుమతి చేసేదని, ఇప్పుడు చక్కెరను దిగుమతి చేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. ఎథనాల్ ద్వారా విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేయాలని తీసుకున్న నిర్ణయం చివరకు చక్కెర దిగుమతులకు అదే విదేశీ మారకద్రవ్యాన్ని ఖర్చు చేసే పరిస్థితికి దారితీసిందని ఆయన ఆరోపించారు. ఇదిలా ఉంటే చక్కెర ధరల నియంత్రణ కోసం కేంద్రం ఇప్పటికే 10 లక్షల టన్నుల ముడి చక్కెరను సుంకం లేకుండా దిగుమతి చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. భారీగా చక్కెర వినియోగించే సంస్థలకు నిల్వ పరిమితులు కూడా విధించింది. దీంతో ఇప్పుడు E20 ఎథనాల్ విధానం, చక్కెర ధరలు, చెరకు వినియోగం, దిగుమతులపై రాజకీయ చర్చ మరింత వేడెక్కింది. కేంద్రం తీసుకున్న ఇంధన విధానం ప్రజల వాహన ఖర్చుతో పాటు వంటింటి ఖర్చుపైనా ప్రభావం చూపుతోందన్న కేజ్రీవాల్ విమర్శలు రాజకీయంగా కొత్త చర్చకు తెరతీశాయి.

 

#ArvindKejriwal #SugarPrices #SugarPriceHike #AAP #EthanolPolicy #E20 #SugarProduction #SugarImports #Sugarcane #CentralGovernment #SugarShortage #FuelPolicy #IndiaEconomy #AamAadmiParty #IndiaNews