డీవియేషన్ ఎక్కడ జరిగింది?
వైసీపీ తీరుపై చంద్రబాబు ఆగ్రహం.
మెగా డీఎస్సీ నియామకాలపై వస్తున్న విమర్శలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీ వేదికగా గట్టి కౌంటర్ ఇచ్చారు. నియామక ప్రక్రియలో ఎక్కడా డీవియేషన్ జరగలేదని, మొత్తం ప్రక్రియను ఆన్లైన్లోనే నిర్వహించామని స్పష్టం చేశారు. 15,941 ఉపాధ్యాయ పోస్టులను కేవలం 148 రోజుల్లో పారదర్శకంగా భర్తీ చేశామని తెలిపారు. టెట్, డీఎస్సీ నోటిఫికేషన్ల నుంచి రిజర్వేషన్లు, పరీక్షలు, ఫలితాల వరకు ప్రతి దశలో నిబంధనలు పాటించామని చెప్పారు. 13 సబ్జెక్టుల్లో 42 వేల ప్రశ్నలను సిద్ధం చేసి, 154 కేంద్రాల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించామని వివరించారు. మెరిట్ కమ్ రోస్టర్ విధానంలోనే ఎంపికలు జరిగాయని చంద్రబాబు స్పష్టం చేశారు.
వైసీపీకి అసెంబ్లీ సవాల్
డీఎస్సీపై వైసీపీ చేస్తున్న విమర్శలను చంద్రబాబు తీవ్రంగా తప్పుబట్టారు. రోడ్డుపై హిట్ అండ్ రన్ తరహాలో ఆరోపణలు చేయడం కాకుండా ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలని సవాల్ విసిరారు. రెండున్నరేళ్లుగా అసెంబ్లీకి రాని పార్టీని తన రాజకీయ జీవితంలో చూడలేదని వ్యాఖ్యానించారు. అసెంబ్లీకి రాకుండా బయట నిరసనలు చేయడం, జీతాలు, ప్రివిలేజీలు తీసుకోవడంపై ప్రశ్నలు సంధించారు. డీఎస్సీ నియామకాలపై కుట్రలు పనిచేయవని ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు భరోసా ఇచ్చారు. ఒడిశా కూలీలు, 90 ఏళ్ల జగన్ జెన్జీలతో ఫేక్ ప్రదర్శనలు నిర్వహిస్తున్నారని ఆరోపిస్తూ వైసీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
విద్య రంగంపై టీడీపీ మార్క్
విద్యారంగంలో తమ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలను కూడా చంద్రబాబు వివరించారు. 2019–24 మధ్య ఉపాధ్యాయ నియామకాలు చేపట్టలేదని విమర్శించారు. టీడీపీ, ఎన్డీయే హయాంలో ఇప్పటివరకు 14 డీఎస్సీల్లో 11 డీఎస్సీల ద్వారా నియామకాలు చేపట్టామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు తల్లికి వందనం వంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. గతంలో ప్రభుత్వ పాఠశాలల నుంచి దూరమైన విద్యార్థుల్లో లక్ష మందికిపైగా తిరిగి ప్రభుత్వ బడులకు వచ్చారని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో పోటీ పరీక్షలకు శిక్షణ, ఉపాధ్యాయుల బదిలీల్లో పారదర్శకత వంటి చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. డీఎస్సీపై ఆరోపణలకు సమాధానం చెప్పేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కుట్రలు చేసే పార్టీలకు కాకుండా ప్రజలకు తమ ప్రభుత్వం జవాబుదారీగా ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు.
#ChandrababuNaidu #MegaDSC #DSC2025 #APDSC #TeacherRecruitment #AndhraPradesh #APAssembly #YSRCP #TDP #DSCAppointments #RecruitmentTransparency #NTRGovernment #EducationReforms #TET #TeacherJobs











