విజయవాడలో టీచర్ల ఆత్మగౌరవ ర్యాలీ
మెగా డీఎస్సీ-2025 నియామకాలపై జరుగుతున్న ఆరోపణలకు వ్యతిరేకంగా వేలాది మంది నూతన ఉపాధ్యాయులు విజయవాడలో ఆత్మగౌరవ ప్రదర్శన నిర్వహించారు. సంవత్సరాలుగా ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తూ, ఉపాధ్యాయ వృత్తిపై గౌరవంతో శిక్షణ పొందిన అభ్యర్థులు రాత్రింబవళ్లు కష్టపడి డీఎస్సీ పరీక్షకు సిద్ధమయ్యామని తెలిపారు. రోజుకు 16 గంటల వరకు చదివి పరీక్షలో ప్రతిభ కనబరిచి ఉద్యోగాలు సాధించామని పలువురు ఉపాధ్యాయులు చెప్పారు. తమ నియామకాలపై తప్పుడు ఆరోపణలు చేయడం వల్ల తీవ్రంగా బాధపడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. డీఎస్సీ-2025 నియామక ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరిగిందని చెబుతూ, తమ ప్రతిభను రాజకీయ వివాదాల్లోకి లాగొద్దని విజ్ఞప్తి చేశారు.
అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం
ర్యాలీ అనంతరం ఉపాధ్యాయులు విజయవాడలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. హారిజాంటల్ రిజర్వేషన్‌పై కనీస అవగాహన లేకుండా నియామకాలపై ఆరోపణలు చేయడం సరికాదని మహిళా ఉపాధ్యాయులు మండిపడ్డారు. ఎన్నో ఏళ్లుగా ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూ కుటుంబాలను నెట్టుకొస్తూనే చదువుకున్నామని, తినీ తినక కష్టపడి సాధించిన ఉద్యోగాలపై విష ప్రచారం చేయడం తగదన్నారు. 16 వేల మందికి పైగా టీచర్ల వెనుక 16 వేల కుటుంబాల భవిష్యత్తు ఉందని స్పష్టం చేశారు. తమ ఉద్యోగాలను అవమానించే వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మా కష్టాన్ని రాజకీయాలకు వాడొద్దు
డీఎస్సీ-2025పై వైసీపీ చేస్తున్న ఆరోపణలను ఉపాధ్యాయులు తీవ్రంగా ఖండించారు. గత ప్రభుత్వ హయాంలో డీఎస్సీ నియామకాలు జరగలేదని, ఒక్క ఉపాధ్యాయ పోస్టు కూడా భర్తీ చేయలేదని వారు ఆరోపించారు. కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ నిర్వహించి 16 వేలకు పైగా టీచర్ పోస్టులు భర్తీ చేసిందని పేర్కొన్నారు. తాము ప్రతిభతో ఉద్యోగాలు సాధించామని, తమపై ఫేక్ ప్రచారం చేయడం ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనన్నారు. “పదే పదే ఆరోపణలు చేస్తే అవి నిజం కావు. మా కష్టం, ప్రతిభను రాజకీయాలకు బలిచేయొద్దు” అంటూ ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఆందోళనలతో డీఎస్సీ నియామకాలపై రాజకీయ వివాదం మరింత ముదిరింది.
#MegaDSC2025 #APDSC2025 #TeachersProtest #Vijayawada #AndhraPradeshTeachers #TeacherRecruitment #DSC2025 #DSCRecruitment #APEducation #TeacherJobs #TeachersRally #AtmaGouravaRally #AndhraPradeshNews #APPolitics #EducationNews











