ఆదిలాబాద్ ఎంపీకి అనూహ్య మంత్రి యోగం.
కాలర్ ఎగరేసిన ఎంపీలు కూనిరాగం.
ఎస్టీ నేతకు కేబినెట్ బెర్త్ పై హైకమాండ్ యోచన.
హస్తినకు క్యూకడుతున్న సీనియర్లు.
అనూహ్యంగా లక్కీ ఛాన్స్ తెలంగాణ బీజేపీ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరతీసింది. కేంద్ర కేబినెట్‌లో తెలంగాణకు మరో అవకాశం దక్కితే ఎవరికి ఇవ్వాలన్న అంశంపై అధిష్ఠానం ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు సమాచారం. సాధారణంగా వేగంగా నిర్ణయాలు తీసుకునే ప్రధాని నరేంద్ర మోదీకి ఈసారి మాత్రం రాజకీయ సమీకరణాలు కీలకంగా మారినట్టు తెలుస్తోంది. ఎవరికి పదవి ఇస్తే ఎవరు అసంతృప్తికి గురవుతారు? ఎవరిని పక్కన పెడితే ఎలాంటి సంకేతాలు వెళ్తాయి? అన్న అంశాలపై కసరత్తు జరుగుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో సీనియర్ల మధ్య పోటీ, అంతర్గత విభేదాలు హైకమాండ్‌కు తలనొప్పిగా మారిన పరిస్థితిలో అనూహ్యంగా మరో ఎంపీ పేరు తెరపైకి వచ్చింది.
గడ్డం నగేశ్ వైపు చూపు?
ఆదిలాబాద్ ఎంపీ గడ్డం నగేశ్‌కు కేంద్ర మంత్రి పదవి దాదాపు ఖరారైనట్టు అత్యంత విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే వారం జరగనున్న కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో ఆయనకు చోటు కల్పించే అవకాశాలు ఉన్నట్టు ఢిల్లీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా గిరిజన సామాజిక వర్గానికి చెందిన ఎంపీ కావడం నగేశ్‌కు కలిసొచ్చే అంశంగా కనిపిస్తోంది. తెలంగాణకు ప్రాతినిధ్యం పెంచడంతో పాటు గిరిజన వర్గానికి రాజకీయ ప్రాధాన్యం కల్పించినట్టు సంకేతం ఇచ్చే అవకాశం కూడా ఉంటుందని బీజేపీ వర్గాల్లో అంచనా. ఇదే జరిగితే సీనియర్ల పోటీని పక్కన పెట్టి హైకమాండ్ అనూహ్య ఎంపిక చేసినట్టవుతుంది. అయితే ఈ సమాచారం అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.
సీనియర్ల ఆశల మధ్య కొత్త పేరు
తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి పదవిపై ఇప్పటికే ఈటల రాజేందర్, డీకే అరుణ, ధర్మపురి అర్వింద్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ముగ్గురూ తమ రాజకీయ అనుభవం, పార్టీకి చేసిన సేవల ఆధారంగా మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నట్టు ప్రచారం ఉంది. ఇలాంటి సమయంలో గడ్డం నగేశ్ పేరు ముందుకు రావడం తెలంగాణ బీజేపీలో ఆసక్తిని పెంచుతోంది. కొత్తగా నగేశ్‌ను కేబినెట్‌లోకి తీసుకుంటారా? ప్రస్తుత మంత్రుల్లో ఎవరినైనా తప్పిస్తారా? లేక విస్తరణలో అదనపు బెర్త్ ఇస్తారా? అన్నది ఇప్పుడు కీలక ప్రశ్నగా మారింది. సీనియర్ల మధ్య పోటీకి దూరంగా ఉండేలా గిరిజన ఎంపీకి అవకాశం ఇవ్వడం ద్వారా అధిష్ఠానం ఒకేసారి పలు రాజకీయ సమీకరణాలను సమతుల్యం చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. వచ్చే వారం జరిగే కేబినెట్ పునర్వ్యవస్థీకరణతో ఈ ఉత్కంఠకు తెరపడనుంది. గోల్డెన్ ఛాన్స్ కొట్టబోయే ఆ ఎంపీ గడ్డం నగేశేనా? అన్నది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
#GaddamNagesh #AdilabadMP #TelanganaBJP #BJP #TelanganaPolitics #UnionCabinet #CabinetExpansion #CabinetReshuffle #NarendraModi #BJPHighCommand #EtelaRajender #DKAruna #DharmapuriArvind #TribalLeader #STLeader #TelanganaMPs #TelanganaPoliticalNews #BJPPolitics #UnionMinister #PoliticalNews











