ఎన్రోల్మెంట్పై బీసీఐ బ్రేక్
హైదరాబాద్‌లోని ప్రతిష్ఠాత్మక నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా 2026 బ్యాచ్‌కు సంబంధించి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది. 2026లో నల్సార్ నుంచి న్యాయ విద్య పూర్తి చేసిన ఏ విద్యార్థినీ తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అడ్వొకేట్‌గా నమోదు చేయకూడదని అన్ని రాష్ట్ర బార్ కౌన్సిళ్లకు బీసీఐ ఆదేశాలు జారీ చేసింది. దీంతో వందలాది న్యాయ విద్యార్థుల భవిష్యత్తుపై ఒక్కసారిగా ఉత్కంఠ నెలకొంది.
చీఫ్ జస్టిస్ ఆహ్వానంతో వివాదం
నల్సార్ యూనివర్సిటీ రాబోయే స్నాతకోత్సవానికి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించాలన్న ప్రతిపాదనపై విద్యార్థుల్లో ఒక వర్గం అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ అంశం క్రమంగా విద్యార్థుల నిరసనగా మారింది. ఆ ప్రచారాన్ని ఎవరు ప్రారంభించారు, ఎవరు సమన్వయం చేశారు అనే విషయాలపై ఇప్పుడు బీసీఐ దృష్టి పెట్టింది. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిరసనకారులపై పోలీసులు చర్యలు తీసుకున్నారన్న అంశంపై సుప్రీంకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా జస్టిస్ సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యలు విద్యార్థుల ఆగ్రహానికి కారణమైనట్లు తెలుస్తోంది. ఆ వ్యాఖ్యల నేపథ్యంలోనే చీఫ్ జస్టిస్‌ను స్నాతకోత్సవానికి ఆహ్వానించడంపై విద్యార్థుల్లో కొందరు వ్యతిరేక ప్రచారం ప్రారంభించినట్లు బీసీఐ పేర్కొంది.
విద్యార్థుల వివరాలు కోరిన బీసీఐ
ఈ వ్యవహారంపై నల్సార్ యూనివర్సిటీ నుంచి పూర్తి వివరాలు ఇవ్వాలని బీసీఐ చైర్పర్సన్ మనన్ కుమార్ మిశ్రా కోరారు. ముఖ్యంగా ఈ ప్రచారాన్ని ప్రారంభించినవారు, దాన్ని సమన్వయం చేసిన ప్రధాన వ్యక్తులు ఎవరో గుర్తించి వివరాలు సమర్పించాలని ఆదేశించారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు 2026 బ్యాచ్ విద్యార్థుల అడ్వొకేట్ ఎన్రోల్మెంట్ నిలిపివేయాలని నిర్ణయించారు. న్యాయ విద్య పూర్తయిన తర్వాత కోర్టుల్లో ప్రాక్టీస్ ప్రారంభించేందుకు అడ్వొకేట్‌గా ఎన్రోల్ కావడం కీలకం. ఇప్పుడు మొత్తం 2026 బ్యాచ్‌పై ఆ ప్రక్రియ నిలిచిపోవడంతో విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది. విద్యార్థుల నిరసనపై బీసీఐ తీసుకున్న ఈ కఠిన నిర్ణయం న్యాయ విద్యా వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది.
#NALSAR #NALSAR2026 #NALSARStudents #BarCouncilOfIndia #BCI #BCIEnrollment #AdvocateEnrollment #NALSARControversy #NALSARUniversity #LawStudents #LegalEducation #ChiefJusticeSuryaKant #MananKumarMishra #Hyderabad #LegalNews











