Home Telangana టెస్రాక్ట్ భూ కేటాయింపుపై క్లారిటీ

టెస్రాక్ట్ భూ కేటాయింపుపై క్లారిటీ


ఆరోపణల్లో వాస్తవం లేదన్న సర్కార్
కేటీఆర్ ఆరోపణలకు శ్రీధర్‌బాబు కౌంటర్

టెస్రాక్ట్ సంస్థకు భూ కేటాయింపులపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి సోదరులకు ఆ సంస్థతో ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు. సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా ఆరోపణలు చేయడం సరికాదని విమర్శించారు.

32 దరఖాస్తుల్లో టెస్రాక్ట్ ఒకటే

భూ కేటాయింపులు పూర్తిగా నిబంధనల ప్రకారమే జరిగాయని మంత్రి తెలిపారు. మొత్తం 32 సంస్థలు దరఖాస్తు చేసుకోగా వాటిలో టెస్రాక్ట్ కూడా ఒకటని చెప్పారు. బోర్డు నిర్ణయించిన ధర కంటే రూపాయి కూడా తక్కువకు భూమి ఇవ్వలేదన్నారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ఎకరాకు రూ.90 లక్షలు ఉంటే తమ ప్రభుత్వం రూ.1.50 కోట్లకు కేటాయించిందని వివరించారు.

రూ.200 కోట్ల సంస్థ అన్నది తప్పు

ఐదు ఎకరాల్లో రూ.34 కోట్ల పెట్టుబడితో ఏర్పాటయ్యే సంస్థను రూ.200 కోట్ల సంస్థగా కేటీఆర్ పేర్కొనడం ఆశ్చర్యంగా ఉందన్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలో భూములను తక్కువ ధరలకు ఎందుకు కేటాయించారో కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

పరిశ్రమలను అడ్డుకోవడమే లక్ష్యమా?

పరిశ్రమలు రాష్ట్రానికి రాకుండా అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే కేటీఆర్ ఆరోపణలు చేస్తున్నారని శ్రీధర్‌బాబు విమర్శించారు. తన శాఖలో జరిగే ప్రతి నిర్ణయం తనకు తెలుసని స్పష్టం చేశారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై ఆధారాలు లేకుండా మాట్లాడటం మానుకోవాలని సూచించారు.

 

#Testrackt #TestracktLandAllocation #KTR #SridharBabu #RevanthReddy #TelanganaPolitics #LandAllocation #TelanganaGovernment #KTRAllegations #TelanganaIndustries #BRS #Congress #TelanganaNews #PoliticalNews #HyderabadNews