రూ.30,436 కోట్లతో పనులకు ఊపు.
పోలవరం ప్రాజెక్టు తొలి దశ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సవరించిన అంచనా వ్యయం రూ.30,436.95 కోట్లుగా కేంద్ర జలశక్తి శాఖ వెల్లడించింది. తొలి దశలో 41.15 మీటర్ల వరకు ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు తెలిపింది. గత ఐదేళ్లలో పోలవరం కోసం కేంద్రం రూ.12,620.53 కోట్ల నిధులు విడుదల చేసినట్లు పేర్కొంది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా రూ.5,512.40 కోట్లు కేటాయించినట్లు వెల్లడించింది. రాజ్యసభలో బీజేపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ ఈ వివరాలను లిఖితపూర్వకంగా వెల్లడించింది.
పనుల్లో గణనీయమైన పురోగతి
స్పిల్‌వే నిర్మాణంలో 96.87 శాతం మట్టి పనులు, 98.84 శాతం కాంక్రీట్ పనులు, 92.9 శాతం స్టీల్ పనులు పూర్తయ్యాయని కేంద్రం తెలిపింది. ఎర్త్‌కమ్ రాక్‌ఫిల్ డ్యామ్ కాంక్రీట్ పనులు 81.99 శాతం, ప్రధాన కాలువల తవ్వకం 98.96 శాతం పూర్తైనట్లు వివరించింది. మరోవైపు 17,892 నిర్వాసిత కుటుంబాలను తరలించగా, ఆర్అండ్ఆర్ పరిహారం కింద రూ.1,373.01 కోట్లు పంపిణీ చేసినట్లు పేర్కొంది. పునరావాస పనులకు అదనంగా రూ.1,581.08 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపింది. తొలి దశను మార్చి 2026 నాటికి పూర్తి చేయాలన్న లక్ష్యం ఉన్నప్పటికీ, అవసరమైతే మరో ఏడాది గడువు పొడిగించే అవకాశం ఉందని కేంద్రం స్పష్టం చేసింది.
#PolavaramProject #PolavaramPhase1 #PolavaramDam #AndhraPradesh #APGovernment #CentralGovernment #MinistryOfJalShakti #PolavaramIrrigationProject #IrrigationProjects #APDevelopment #GodavariRiver #PolavaramFunding #PolavaramLatestNews #APInfrastructure #RRCompensation #WaterResources #PolavaramConstruction











