Home AP జగన్‌ వస్తేనే గిరిజనులకు న్యాయం

జగన్‌ వస్తేనే గిరిజనులకు న్యాయం


ఆదివాసీ దినోత్సవంలో వైసీపీ పిలుపు.

ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో గిరిజన విభాగం ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. గిరిజన సంప్రదాయ నృత్యాలు, పాటలతో వేడుకలు ప్రారంభమయ్యాయి. గిరిజన సమరయోధులకు నాయకులు పుష్పాంజలి ఘటించారు. కార్యక్రమానికి ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గిరిజనుల హక్కులు, ఆత్మగౌరవం, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని నాయకులు పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్‌ను మరోసారి ముఖ్యమంత్రిని చేయడానికి గిరిజనులు ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. గిరిజనుల విద్య, వైద్యం కోసం జగన్ పాలనలో ప్రత్యేక చర్యలు తీసుకున్నామని లేళ్ల అప్పిరెడ్డి తెలిపారు.

జగన్‌ పాలనలోనే మేలు జరిగిందని వాదన

వైఎస్సార్సీపీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు గుండా సురేంద్ర మాట్లాడుతూ జగన్‌ పాలనలో గిరిజన సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. 157 తండాలు, గూడేలను పంచాయతీలుగా మార్చి స్థానిక పాలనలో భాగస్వామ్యం కల్పించామని చెప్పారు. సుమారు 1.70 లక్షల మందికి 3.20 లక్షల ఎకరాల ఆర్‌వోఎఫ్‌ఆర్ పట్టాలు, 25,300 మందికి 38,200 ఎకరాల డీకేటీ పట్టాలు ఇచ్చామని పేర్కొన్నారు. పాడేరులో రూ.500 కోట్లతో మెడికల్ కాలేజీ, కురుపాంలో రూ.153 కోట్లతో ఇంజినీరింగ్ కాలేజీ, సాలూరులో 561 ఎకరాల్లో ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని వివరించారు. ఐదు ఐటీడీఏల పరిధిలో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. జగన్ ప్రభుత్వ ఐదేళ్ల కాలంలో డీబీటీ, నాన్‌-డీబీటీ ద్వారా సుమారు రూ.19,471 కోట్లను గిరిజనుల ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని వైసీపీ నాయకులు విమర్శించారు. జీవో నంబర్‌ 3, గిరిజన మంత్రివర్గ ప్రాతినిధ్యం, టీఏసీ, మైదాన ప్రాంత గిరిజనుల సమస్యలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యలకు పరిష్కారం రావాలంటే జగన్‌ను మళ్లీ సీఎంగా చేయాలని గిరిజన నాయకులు తీర్మానించారు.

 

#YSJaganMohanReddy #YSRCP #TribalWelfare #AdivasiDay #WorldTribalDay #AndhraPradeshPolitics #TribalRights #TribalDevelopment #YSRCPTribalCell #LellaAppireddy #GundaSurendra #TribalEducation #TribalHealthcare #ROFRPattas #DKTPattas #TribalUniversity #PaderuMedicalCollege #APTribalWelfare #AndhraPradeshNews #YSJagan