శీను ఫ్యామిలీ సిండి”కేటు” గాళ్ళంటున్న జనార్దన్.
ఒంగోలు కూటమిలో హై ఓల్టేజ్ వార్.
ఒంగోలులో జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డికి, టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌కు మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఈ రోజు ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యింది. దామచర్ల ఎమ్మెల్యేగా గెలిచిన రోజు నుంచి రగిలిపోతున్న బాలినేని సమయం కోసం ఎదురు చూశారు. ఈ రోజు అవకాశం దొరకడంతో దామచర్లపై విరుచుకుపడ్డారు. స్థానిక ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో కూటమి నేతలు కలిసి పనిచేయాలని ఒకవైపు టీడీపీ-జనసేన అధిష్టానాలు సూచనలిస్తుంటే దానిని ఏ మాత్రం పట్టించుకోకుండా బాలినేని రెచ్చిపోయారు. దామచర్ల దందాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయిందంటూ బాలినేని చేసిన కామెంట్స్.. ఒంగోలులో దుమారం రేపాయి. ఒంగోలులోని సగం లిక్కర్ల షాపులు దామచర్లవేనని, లిక్కర్, ఇసుక సిండికేట్లలో దామచర్ల పాత్ర ఉందంటూ బాలినేని చేసిన ఆరోపణలతో కూటమి విభేదాలు పరాకాష్టకు చేరాయి. బాలినేని వ్యవహారశైలిపై మొదట్నుంచి అసంతృప్తిగా ఉన్న దామచర్ల ఏ మాత్రం తగ్గకుండా ఎదురుదాడి మొదలుపెట్టారు. బాలినేనితోపాటు ఆయన తనయుడు ఒంగోలులో చేసిన దందాల గురించి ఎవరిని అడిగినా చెబుతారంటూ దామచర్ల బాంబు పేల్చడంతో ఈ మాటల యుద్ధం కొత్త మలుపు తిరిగింది. ఈ పరిస్థితిని చూస్తుంటే.. ఒంగోలు కూటమి పంచాయితీ ఇప్పట్లో తేలేటట్టు కన్పించడం లేదు. మరోవైపు వైసీపీ ఈ అంశాలను తమకు అనుకూలంగా మలచుకునేందుకు పావులు కదుపుతోంది.
ఒంగోలు రాజకీయాల్లో మళ్లీ మంటలు రేగాయి. ఒకప్పుడు ప్రత్యర్థులుగా తలపడిన బాలినేని శ్రీనివాసరెడ్డి, దామచర్ల జనార్దన్ మధ్య మాటల యుద్ధం ఇప్పుడు రాజకీయ కాకను మరింత పెంచుతోంది. పార్టీలు మారాయి.. పొత్తులు మారాయి.. రాజకీయ సమీకరణాలు మారాయి.. కానీ ఒంగోలు గడ్డపై పాత పగల మంటలు మాత్రం ఇంకా చల్లారలేదన్నట్టుగా తాజా పరిణామాలు కనిపిస్తున్నాయి. ఒకరిపై ఒకరు చేసిన ఆరోపణలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. దామచర్లను టార్గెట్ చేస్తూ బాలినేని చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారితే.. అంతే ఘాటుగా దామచర్ల ఇచ్చిన కౌంటర్ మరింత చర్చకు దారితీసింది. అవినీతి ఆరోపణల నుంచి బార్ షాపులు, ఇసుక, భూముల వ్యవహారాల వరకు వివాదం విస్తరించింది. మరోవైపు గత ప్రభుత్వ హయాంలో నమోదైన కేసులు, రాజకీయ కక్షల అంశాలను దామచర్ల తెరపైకి తెచ్చారు. కూటమిలో ఉన్నందుకే ఇప్పటివరకు మౌనంగా ఉన్నామని ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తి రేపుతున్నాయి. నిన్నటి ప్రత్యర్థులు నేడు ఒకే రాజకీయ వేదికపై ఉన్నా.. మాటల మంటలు మాత్రం తగ్గలేదు. దీంతో ఈ ఇద్దరి మధ్య ఫైట్ ఎటు దారితీస్తుంది? ఆరోపణలు ఇంకెంత దూరం వెళ్తాయి? ఒంగోలు రాజకీయాల్లో ఈ వివాదం ఎలాంటి కొత్త మలుపులు తీసుకురాబోతోంది? అన్నదే ఇప్పుడు హాట్‌టాపిక్. మొత్తంగా బాలినేని వర్సెస్ దామచర్ల పోరు ఒంగోలు రాజకీయాల్లో కాక రేపుతోంది.
బాలినేని వర్సెస్ దామచర్ల.. భగ్గుమన్న రాజకీయం
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. ఒకప్పుడు రాజకీయ ప్రత్యర్థులుగా తలపడిన నేతలు ఇప్పుడు ఒకే కూటమి రాజకీయ సమీకరణంలో కనిపిస్తున్నా.. పాత రాజకీయ పగలు మాత్రం ఇంకా చల్లారలేదన్న సంకేతాలు తాజా విమర్శలతో బయటపడ్డాయి. దామచర్ల జనార్దన్ తీరుపై బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఒంగోలులో ఎమ్మెల్యే వ్యవహారశైలి “నేనే రాజు.. నేనే మంత్రి” అన్నట్టుగా ఉందని ఆరోపించారు. దామచర్ల తీరుతో సొంత పార్టీకి చెందిన టీడీపీ నేతలు కూడా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఒంగోలులో దామచర్ల అరాచకాలు పెరిగిపోయాయని బాలినేని ఆరోపించారు.
బార్ల నుంచి ఇసుక వరకు ఆరోపణలు
దామచర్ల అవినీతిపై ఎవరో కరపత్రాలు విడుదల చేశారని, దాని వెనుక తన పాత్ర ఉందంటూ ఆరోపణలు చేస్తున్నారని బాలినేని చెప్పారు. తన అనుచరులపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. తప్పు చేయని తనవాళ్లను కాపాడుకోకపోతే రాజకీయాల్లో ఉండటానికి అర్థమేంటని ప్రశ్నించారు. ఒంగోలులోని బార్ షాపుల్లో సగం దామచర్లకు సంబంధించినవేనని బాలినేని ఆరోపించారు. ఈ అంశంపై సమగ్ర విచారణ జరిగితే వాస్తవాలు బయటపడతాయని అన్నారు. డ్వాక్రా రుణాల వ్యవహారంలో ఎమ్మెల్యే పీఏ కనుసన్నల్లో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. దామచర్ల అనుచరులు ఇసుక డంప్‌ల ద్వారా లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని విమర్శించారు.
ప్రజలకు ఇబ్బంది వస్తే నా దగ్గరకు రండి
రాజుపాలెం ప్రాంతంలో వందల ఎకరాల భూములను ఆక్రమించి రొయ్యల చెరువులు ఏర్పాటు చేశారని బాలినేని ఆరోపించారు. ఒంగోలులో దామచర్ల కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ వ్యవహారాలపై విచారణ జరిపిస్తే నిజాలు వెలుగులోకి వస్తాయని వ్యాఖ్యానించారు. దామచర్లతో ఒంగోలు ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినా తన వద్దకు రావాలని బాలినేని పిలుపునిచ్చారు. ప్రజలకు న్యాయం జరిగేలా తాను దగ్గరుండి పోరాడతానని చెప్పారు. ఈ వ్యాఖ్యలు ఒంగోలు రాజకీయాల్లో మరింత చర్చకు దారితీశాయి.
బాలినేనికి దామచర్ల కౌంటర్… కూటమిలో ఉన్నారు కాబట్టే మౌనం
బాలినేని వ్యాఖ్యలకు దామచర్ల జనార్దన్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. తనపై బాలినేని అనుచరుడు మురళి కరపత్రాలు వేశారని, పోలీసుల విచారణలో ఆయనే వేసినట్లు తేలిందని దామచర్ల పేర్కొన్నారు. బాలినేనిపై కరపత్రాలు ముద్రిస్తే వాటిని భద్రపెట్టేందుకు పుస్తకాలు కూడా సరిపోవని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బాలినేని కూటమిలో ఉన్నారని ఇప్పటివరకు మౌనంగా ఉన్నామని దామచర్ల అన్నారు. కూటమిలో విభేదాలు సృష్టించేలా బాలినేని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. “ఆయన కూటమిలో ఉన్నారు కాబట్టే మౌనంగా ఉన్నాం.. లేకపోతే వ్యవహారం మరోలా ఉండేది” అన్న రీతిలో దామచర్ల వ్యాఖ్యలు చేశారు.
తండ్రీకొడుకులను లోపల వేసేవాళ్లం
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తమపై 79 కేసులు పెట్టించారని దామచర్ల ఆరోపించారు. బాలినేని పార్టీ మారినంత మాత్రాన గత వ్యవహారాలు మరిచిపోలేమన్న సంకేతం ఇచ్చారు. గతంలో తమపై జరిగిన రాజకీయ వేధింపులను ఇప్పుడు గుర్తు చేస్తూ తీవ్ర స్థాయిలో స్పందించారు. బాలినేని పార్టీ మారడంతో పరిస్థితి మారిందని దామచర్ల వ్యాఖ్యానించారు. ఆయన పార్టీ మారకపోయి ఉంటే తండ్రీకొడుకులను జైలుకు పంపే పరిస్థితి వచ్చేదని అన్నారు. గత ప్రభుత్వంలో జరిగినట్లుగా రౌడీయిజం చేస్తామంటే కుదరదని హెచ్చరించారు.
బార్ సిండికేట్‌పై ఎదురుదాడి
బాలినేని చేసిన బార్ షాపుల ఆరోపణలకు దామచర్ల కూడా ఘాటుగా స్పందించారు. గతంలో బార్ షాపులను సిండికేట్ చేసి తండ్రీకొడుకులు కోట్ల రూపాయలు వసూలు చేశారని ఆరోపించారు. తాను చేసిన అక్రమాలపై ప్రమాణం చేసేందుకు బాలినేని కాణిపాకం రావడానికి సిద్ధమా అని సవాల్ విసిరారు. తాను ఎలాంటి వ్యక్తినో ఒంగోలు ప్రజలకు తెలుసని దామచర్ల అన్నారు. అందుకే తనకు 34 వేల ఓట్ల మెజారిటీ ఇచ్చారని పేర్కొన్నారు. తలకిందులుగా తపస్సు చేసినా బాలినేనికి అంతటి మెజారిటీ రాదని ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలతో ఇద్దరు నేతల మధ్య రాజకీయ విభేదాలు మరింత బహిర్గతమయ్యాయి.
ప్రభుత్వ భూములపైనా ఆరోపణలు
బాలినేని కుటుంబానికి సంబంధించిన భూములపై కూడా దామచర్ల ఆరోపణలు చేశారు. ప్రభుత్వ భూముల్లో బాలినేని వియ్యంకుడికి విల్లాలు ఉన్నాయని ఆరోపించారు. ఆ భూమిని వెంగముక్కలపాలెం ప్రజలకు కమ్యూనిటీ హాల్ కోసం కేటాయిస్తామని చెప్పారు. ఒంగోలు తాజా రాజకీయ పరిణామాల్లో అసలు ఆసక్తికర అంశం ఇదే. రాజకీయంగా ఒకే కూటమి పరిధిలో ఉన్న నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. పార్టీలు మారవచ్చు.. రాజకీయ పొత్తులు మారవచ్చు.. కానీ పాత ప్రత్యర్థిత్వం, స్థానిక ఆధిపత్య పోరు అంత తేలిగ్గా ముగియదన్న సందేశం తాజా మాటల యుద్ధం ఇస్తోంది.
#BalineniSrinivasaReddy #DamacharlaJanardhan #OngolePolitics #OngolePoliticalWar #AndhraPradeshPolitics #APPolitics #TDP #JanaSenaParty #TDPJanaSenaAlliance #BalineniVsDamacharla #OngoleMLA #PoliticalAllegations #LiquorSyndicate #SandSyndicate #APPoliticalNews #OngoleNews #YSRCP #ChandrababuNaidu #CoalitionPolitics











