ఓవైపు సభ్యత్వం మరోవైపు చర్చలు.
ఆర్ఎస్ఎస్ చీఫ్‌కు బొద్దింకలు కౌంటర్.
లాంగ్ టర్మ్ ప్లాన్ ఆవిష్కరించిన దిప్కే.
జంతర్‌మంతర్‌లో నిరసన విజయవంతంగా ముగిసిన తర్వాత కాక్రోచ్ జనతా పార్టీ తన కార్యకలాపాలను దేశవ్యాప్తంగా విస్తరించనున్నట్లు ప్రకటించింది. ఛత్రపతి సంభాజీనగర్‌లో జరిగిన రెండురోజుల కోర్ కమిటీ సమావేశం ముగిసిన అనంతరం సభ్యత్వ నమోదు కార్యక్రమం, ‘క్యా బోల్తీ పబ్లిక్’ పేరుతో ప్రజల అభిప్రాయాల సేకరణ, క్రౌడ్‌ఫండింగ్ కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. తాము రాజకీయ పార్టీ కాదని, సామాజిక సంస్థగానే కొనసాగుతామని స్పష్టం చేసింది. ఏ రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వబోమని, వ్యతిరేకించబోమని తెలిపింది. అయితే ప్రజా సమస్యలపై రాజకీయ వ్యవస్థను జవాబుదారిగా నిలబెట్టడమే తమ లక్ష్యమని పేర్కొంది. విద్యా సంస్కరణలతో పాటు ఎన్నికల సంస్కరణలు, న్యాయవ్యవస్థ జవాబుదారీతనం, మీడియా బాధ్యత వంటి అంశాలపై ఉద్యమాన్ని విస్తరించనున్నట్లు వెల్లడించింది. దేశాన్ని ఐదు జోన్లుగా విభజించి కొత్త జాతీయ వర్కింగ్ కమిటీని ప్రకటించింది. వచ్చే ఆరు నెలల్లో రాష్ట్రాలు, లోక్‌సభ నియోజకవర్గాలు, నగర స్థాయిలో సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
మోహన్ భగవత్‌పై సీజేపీ విమర్శలు
సీజేపీ కన్వీనర్ అభిజీత్ దిప్కే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు చేశారు. జెన్ జెడ్ యువతతో ఇప్పుడు మాట్లాడటం చాలా ఆలస్యమైందని వ్యాఖ్యానించారు. జూలై 20న విద్యార్థులపై లాఠీచార్జ్ జరిగినప్పుడు భగవత్ స్పందించి ఉంటే బాగుండేదని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాలతో విద్యార్థులపై దాడులు జరిగాయని ఆరోపిస్తూ అప్పుడే క్షమాపణ చెప్పించాలని డిమాండ్ చేయాల్సిందని పేర్కొన్నారు. జంతర్‌మంతర్ ఉద్యమం తర్వాతే యువత గొంతును ఆర్ఎస్ఎస్ గుర్తించాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. అయినప్పటికీ జెన్ జెడ్‌తో చర్చకు ముందుకు రావడం స్వాగతించదగ్గ పరిణామమేనని చెప్పారు.
విద్య నుంచి మీడియా వరకు లక్ష్యం
సీజేపీ తన భవిష్యత్ కార్యాచరణలో విద్యను ప్రాథమిక హక్కుగా కాపాడాలని ప్రధాన లక్ష్యంగా ప్రకటించింది. విద్య వ్యాపారంగా మారకూడదని స్పష్టం చేసింది. ఎన్నికల సంఘం పనితీరుపై ప్రజల్లో పెరుగుతున్న అనుమానాలు, న్యాయవ్యవస్థపై వస్తున్న విమర్శలు, మీడియా పక్షపాత ధోరణిపై కూడా ప్రశ్నలు లేవనెత్తుతామని తెలిపింది. ప్రజల సమస్యలను పక్కనపెట్టి అధికార పార్టీల ప్రచారానికే ప్రాధాన్యం ఇస్తే మీడియాపై విశ్వాసం మరింత తగ్గుతుందని హెచ్చరించింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యలు వచ్చినా వెనక్కి తగ్గబోమని, రాజ్యాంగం కల్పించిన హక్కుల ఆధారంగా ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా కొనసాగిస్తామని సీజేపీ స్పష్టం చేసింది.
#CockroachJanataParty #CJP #AbhijeetDipke #GenZMovement #YouthProtest #JantarMantar #EducationReform #ElectionReform #SocialMovement #MohanBhagwat #RSS #YouthPolitics #PublicOpinion #PoliticalAccountability #IndianPolitics #StudentMovement #Democracy #MediaResponsibility #IndiaNews #LatestNews











