Home Telangana ఆ వ్యాఖ్యలను భావితరాలు క్షమించవు రాహుల్‌పై కిషన్‌రెడ్డి విమర్శలు

ఆ వ్యాఖ్యలను భావితరాలు క్షమించవు రాహుల్‌పై కిషన్‌రెడ్డి విమర్శలు



కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు చేశారు. తప్పు చేసిన పిల్లలను పెద్దలు మందలించి సరైన మార్గంలో నడిపించాలని, కానీ వారిని ప్రోత్సహించేలా మాట్లాడటం బాధ్యతారాహిత్యమని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై, ఆయన తల్లిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వారిని సమర్థించడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఇదే పరిస్థితి రాహుల్ గాంధీ కుటుంబ సభ్యుల విషయంలో ఎదురైతే కూడా ఇలాంటి వైఖరినే అవలంబిస్తారా అని ప్రశ్నించారు. ప్రధానమంత్రి మోదీ మాత్రం తీవ్ర వ్యాఖ్యలు ఎదురైనా సంయమనంతో స్పందించారని, చిన్నారులు తప్పు చేస్తే వారిని సరిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజంపైనే ఉందని హుందాగా చెప్పారని గుర్తు చేశారు. ఆ సూచనను స్వీకరించి ఓ విద్యార్థిని స్వచ్ఛందంగా క్షమాపణ చెప్పడం భారతీయ సంస్కృతికి నిదర్శనమని అన్నారు.

భారతీయ విలువలు క్షమాగుణం, పెద్దల పట్ల గౌరవం, బాధ్యతాయుతమైన ప్రవర్తనను నేర్పిస్తాయని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. తప్పును గుర్తించి క్షమాపణ చెప్పిన యువతను అభినందించాల్సింది పోయి వారిని రెచ్చగొట్టేలా మాట్లాడటం సరికాదన్నారు. ప్రతిపక్ష నేతగా దేశ యువతకు ఆదర్శంగా నిలవాల్సిన రాహుల్ గాంధీ వ్యక్తిత్వం, క్రమశిక్షణ, బాధ్యతను ప్రతిబింబించేలా వ్యవహరించడం లేదని విమర్శించారు. తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం అసభ్య భాషను సమర్థించే నాయకత్వాన్ని దేశ ప్రజలు అంగీకరించరని అన్నారు. అలాంటి రాజకీయ ధోరణిని నేటి తరం తిరస్కరిస్తోందని, భవిష్యత్ తరాలు కూడా క్షమించవని వ్యాఖ్యానించారు. దేశ ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తూ సంయమనంతో వ్యవహరించే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి యువత మద్దతుగా నిలుస్తోందని, రానున్న రోజుల్లో కూడా అదే విశ్వాసం కొనసాగుతుందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

 

#KishanReddy #RahulGandhi #NarendraModi #BJP #Congress #PoliticalControversy #IndianPolitics #ModiRemarks #BJPvsCongress #TelanganaPolitics #PoliticalNews #CongressCriticism #NationalPolitics #IndiaNews