Home AP చేనేతలకు ఆర్థిక భరోసా నేతన్నలకు ఏడాదికి రూ.25 వేలు

చేనేతలకు ఆర్థిక భరోసా నేతన్నలకు ఏడాదికి రూ.25 వేలు



రాష్ట్రంలోని అర్హులైన ప్రతి చేనేతకు ‘నేతన్న సేవలో’ పథకం వర్తింపజేస్తామని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత ప్రకటించారు. చేనేతలకు ప్రతి ఏడాది రూ.25 వేల ఆర్థిక సాయం అందించే ఈ పథకాన్ని ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఆగస్టు 5 సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తామని, అర్హులైన నేతన్నలు గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సచివాలయంలో జిల్లా చేనేత శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ, ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా చేనేతల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. చేనేతల గౌరవప్రదమైన జీవనమే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని పేర్కొన్నారు. ఇప్పటికే 50 ఏళ్లు పైబడిన చేనేతలకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్, మగ్గం నేతలకు 200 యూనిట్లు, మరమగ్గం నేతలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, త్రిఫ్ట్ ఫండ్, ముద్రా రుణాల వంటి పథకాలు అమలులో ఉన్నాయని వివరించారు.

చీరాలలో ఘనంగా ప్రారంభం

ఆగస్టు 7న చీరాలలో జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు మంత్రి సవిత తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ‘నేతన్న సేవలో’ పథకాన్ని ప్రారంభిస్తారని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రంలో చేనేత దినోత్సవ వేడుకలు నిర్వహించాలని, ర్యాలీలు, చేనేత వస్త్రాల ప్రాధాన్యంపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అర్హులైన ప్రతి నేతన్నకు పథకం ప్రయోజనం చేరేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. దరఖాస్తుల పరిశీలనలో ఎలాంటి పొరపాట్లు, విమర్శలకు అవకాశం లేకుండా పారదర్శకంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. ఆగస్టు 6 ఉదయానికి అన్ని జిల్లాల నుంచి లబ్ధిదారుల పూర్తి వివరాలు అందించాలని అధికారులను ఆదేశిస్తూ, చేనేత కుటుంబాల ఆర్థిక బలోపేతమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి సవిత పేర్కొన్నారు.

#NethannaSevalo #Weavers #HandloomWeavers #AndhraPradesh #APGovernment #WeaverWelfare #HandloomScheme #25000Aid #FinancialAssistance #NationalHandloomDay #HandloomDay2026 #MinisterSavita #ChandrababuNaidu #Chirala #HandloomIndustry #WeaverFamilies #APSchemes #APNews