బంగారు నగరిలో నకిలీ బంగారం దందా బట్టబయలు

Fake Gold Scam in Proddatur

బంగారం అంటే ప్రొద్దుటూరోళ్లకు పిచ్చి కాదు… ప్రాణం! “కొంచెం తక్కువకే ఇస్తా” అన్నోడు దేవుడిలా కనిపిస్తాడు… చివరికి చేతిలో పడేది బంగారం కాదు, బండరాయి! రాయలసీమలో పైస పైస కూడబెట్టి దాచిన సొమ్ము… ఒక్క ఆశతో క్షణాల్లో గాలిలో కలిసిపోతుంది.ప్రొద్దుటూరులో బంగారం అంటే నగ కాదు… నమ్మకం. ఆడబిడ్డ పెళ్లి నుంచి ఆపద సమయం దాకా అండగా నిలిచేది అదే. అలాంటి చోట “మార్కెట్ రేటుకంటే చవకగా బంగారం” అన్న మాట వినిపిస్తే చాలూ… కళ్ల ముందు లాభాల లెక్కలు తిరుగుతాయి. “ఇంత తక్కువకే దొరుకుతుందంటే ఇదే ఛాన్స్” అనుకుంటారు. కట్ చేస్తే… చేతిలో మెరిసేది బంగారం కాదు, నకిలీ కడ్డీ. జేబులో ఉండాల్సిన పైసల్ మాత్రం పోయనాయ్! రాయలసీమలో చెమటోడ్చి సంపాదించిన సొమ్మును ఒక్క మాటతో కాజేసే మాయగాళ్లు రోజురోజుకూ కొత్త ఎత్తులు వేస్తున్నారు. “చవక” అనే ఒక్క ఎరకు ఆశపడితే చాలు… కష్టార్జితం క్షణాల్లో కరిగిపోతుంది. లాభం కోసం వెళ్లిన అడుగు, నష్టానికి దారి తీస్తుంది. బంగారం కొనాలంటే ముందు బేరం కాదు… బుద్ధి ఉండాలి. లేకపోతే చివరికి “బంగారం వస్తుందనుకున్నాం… పైసల్ పోయనాయ్!” అని తల పట్టుకోవడం తప్ప మిగిలేది ఏమీ ఉండదు.


తక్కువ ధర మాయాజాలం

ప్రొద్దుటూరులో తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తానంటూ అమాయకుడిని నమ్మించి రూ.6.50 లక్షలు కాజేసిన నకిలీ బంగారం మోసగాడిని పోలీసులు అరెస్టు చేశారు. బంగారం పేరుతో నకిలీ కడ్డీ ఇచ్చి భారీ మోసానికి పాల్పడిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. నిందితుడి వద్ద నుంచి 100 గ్రాముల నకిలీ బంగారు కడ్డీతో పాటు ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మార్కెట్ ధర కంటే తక్కువ అంటూ నమ్మకం

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తిరుపతి జిల్లా పుత్తూరుకు చెందిన కన్నయ్య, ప్రొద్దుటూరుకు చెందిన రవికుమార్‌ను సంప్రదించాడు. మార్కెట్ ధర కంటే చాలా తక్కువకే బంగారం ఇప్పిస్తానని చెప్పి అతనిలో నమ్మకం కలిగించాడు. లాభం వస్తుందనే ఆశతో రవికుమార్ రూ.6 లక్షల 50 వేల నగదును కన్నయ్యకు అందజేశాడు. అనంతరం బంగారం పేరుతో ఒక కడ్డీని అతనికి ఇచ్చాడు.

పరీక్షలో బయటపడిన నిజం

కడ్డీపై అనుమానం వచ్చిన రవికుమార్ దానిని పరీక్షించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అది నిజమైన బంగారం కాదని, పూర్తిగా నకిలీ కడ్డీ అని తేలింది. మోసపోయానని గ్రహించిన బాధితుడు వెంటనే ప్రొద్దుటూరు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు.

వేగంగా స్పందించిన పోలీసులు

ఫిర్యాదు అందుకున్న పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక ఆధారాలు సేకరించి నిందితుడు కన్నయ్యను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 100 గ్రాముల నకిలీ బంగారు కడ్డీతో పాటు ఒక ల్యాప్‌టాప్, ఒక సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

ప్రజలకు పోలీసుల హెచ్చరిక

నిందితుడిని అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ మోసానికి సంబంధించి మరిన్ని వివరాలపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. మార్కెట్ ధర కంటే చాలా తక్కువకు బంగారం ఇప్పిస్తామని చెప్పే వ్యక్తులను గుడ్డిగా నమ్మవద్దని పోలీసులు హెచ్చరించారు. బంగారం కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా ధృవీకరించిన నగల దుకాణాలు, అధికారిక విక్రేతల ద్వారానే లావాదేవీలు జరపాలని సూచించారు. ఆకర్షణీయమైన ఆఫర్ల పేరుతో జరిగే మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉంటే ఇలాంటి ఘటనలను సులభంగా నివారించవచ్చని పోలీసులు స్పష్టం చేశారు.

మహేష్ పోసా
ప్రొద్దుటూరు
+917337378783