నరసరావుపేట: ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జీని ఖండిస్తూ పల్నాడు జిల్లా నరసరావుపేటలో డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో శుక్రవారం బంద్ నిర్వహించారు. డీవైఎఫ్ఐ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంజనేయరాజు ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన చేశారు. విద్యార్థులకు మద్దతుగా కేంద్ర విద్య శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, నీట్ పేపర్ లీక్ చేసినవారిని కఠినంగా శిక్షించాలని, విద్యావ్యవస్థను పటిష్టం చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆంజనేయరాజు మాట్లాడుతూ, ఢిల్లీలో ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీ చార్జి చేయడాన్ని, బాష్పవాయువు ప్రయోగించడాన్ని ఖండించారు. ఆందోళన చేసేవారిని దేశద్రోహులు, చైనా ఏజంట్లు అనడం అన్యాయం అన్నారు. నీట్ పరీక్ష పేపర్లు లీకైనందున కేంద్ర విద్య శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులు, నిరుద్యోగులపై లాఠీచార్జీ చేయడం ఏమిటని ప్రశ్నించారు. నేరస్తులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ప్రదర్శనలో ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి సుబ్బారావు, ఎస్ఎఫ్ఐ పల్నాడు జిల్లా కార్యదర్శి కోట శాయి కుమార్, పట్టణ కార్యదర్శి ఆనంద్, డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ విద్యార్థులు, యువత పాల్గొన్నారు.
#Narasaraopet #Palnadu #StudentProtest #DelhiProtest #LathiCharge #DYFI #SFI #AISF #AIYF #NEETPaperLeak #DharmendraPradhan #AndhraPradeshNews











