ఎస్ఐఆర్ వివాదానికి తెర పడిందన్న చంద్రబాబు .
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ఎస్ఐఆర్, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజిన్పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఏకగ్రీవ వివరణతో అన్ని అపోహలకు తెరపడిందని ఆయన పేర్కొన్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు ఎస్.ఎస్. సంధు, వివేక్ జోషి కలిసి తీసుకున్న నిర్ణయాలు సంస్థాగత నిబంధనలకు అనుగుణంగా జరిగాయని స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం వంటి రాజ్యాంగ సంస్థల సమగ్రత, విశ్వసనీయతపై ప్రజల్లో నమ్మకాన్ని ఈ వివరణ మరింత బలపరిచిందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
రాజకీయ ప్రయోజనాల కోసం విమర్శలు వద్దు
ఎన్నికల ప్రక్రియపై తప్పుడు అనుమానాలు సృష్టించడం ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుందని సీఎం అన్నారు. తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం భారత్ ప్రజాస్వామ్య వ్యవస్థపై, ఎన్నికల ప్రక్రియపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న నమ్మకాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు చేయడం తీవ్రంగా విచారకరమని ఆయన వ్యాఖ్యానించారు. ఎస్ఐఆర్కు సంబంధించిన నిర్ణయాలన్నీ సంప్రదాయబద్ధమైన సంస్థాగత విధానాలను అనుసరించి సమష్టిగా తీసుకున్నవేనని చంద్రబాబు స్పష్టం చేశారు.
ప్రజల తీర్పును గౌరవించాలి
ప్రజాస్వామ్యంలో ఎన్నికల ఫలితాలు ప్రజల తీర్పును ప్రతిబింబిస్తాయని చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. విజయం వచ్చినప్పుడు ఎలా స్వీకరిస్తామో, ఓటమి ఎదురైనప్పుడు కూడా అదే స్థాయిలో హుందాతనంతో వ్యవహరించడం నాయకత్వ లక్షణమని అన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని నాయకులు కలిసి ప్రజల్లో ఎన్నికల వ్యవస్థపై విశ్వాసాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉందని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య ప్రక్రియపై నమ్మకాన్ని బలపరచడం ప్రతి రాజకీయ నాయకుడి సామూహిక బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.
#ChandrababuNaidu #SIR #SpecialIntensiveRevision #ElectionCommission #ECI #GyaneshKumar #SukhbirSinghSandhu #VivekJoshi #VoterList #ElectoralRoll #ElectionProcess #AndhraPradesh #TDP #SIRControversy #ElectionNews











