ప్రపంచ ప్రజాస్వామ్య హైదరాబాద్ వేదిక!
70 దేశాలు.. వెయ్యి మందికి పైగా ప్రతినిధులు.
ప్రపంచ రాజకీయ, సామాజిక, ఆర్థిక విధానాలపై చర్చలకు హైదరాబాద్‌ను అంతర్జాతీయ వేదికగా తీర్చిదిద్దే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం భారత్ సమ్మిట్–2026 నిర్వహిస్తోంది. ఈ నెల 13, 14 తేదీల్లో హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో భారత్ సమ్మిట్–2 జరగనుంది. 70కి పైగా దేశాల నుంచి 1,000 మందికి పైగా ప్రజాప్రతినిధులు, విధాన నిర్ణేతలు, మేధావులు, వివిధ రంగాల ప్రముఖులు పాల్గొననున్నారు. దావోస్ తరహాలో ప్రపంచ విధాన చర్చలకు హైదరాబాద్ గుర్తింపు పొందాలని ప్రభుత్వం ఆకాంక్షిస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. నోవాటెల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న హింస, విద్వేష రాజకీయాలు, విభజన ధోరణుల నేపథ్యంలో ప్రజాస్వామ్య పరిరక్షణ, అహింస, అలీన విధానం, మిశ్రమ ఆర్థిక విధానాలే సమ్మిట్ ప్రధాన అజెండా అని వెల్లడించారు. మహాత్మా గాంధీ అహింసా సిద్ధాంతం, జవహర్లాల్ నెహ్రూ అలీన విధానం నేటి ప్రపంచానికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలు అగ్రరాజ్యాల ప్రభావానికి లోనుకాకుండా తమ స్వతంత్ర అస్తిత్వాన్ని కాపాడుకోవాలని నెహ్రూ ఆశించారని గుర్తుచేశారు.
ప్రతిపక్షాలకు గౌరవం.. ఓటు హక్కుకు రక్షణ
ప్రజాస్వామ్యంలో అధికార పక్షంతో పాటు ప్రతిపక్షం కూడా కీలకమని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రతిపక్షాలను రాజకీయ ప్రత్యర్థులుగా చూడాలే తప్ప శత్రువులుగా పరిగణించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలను రాజకీయంగా అంతం చేయాలనే ధోరణులు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని రాజకీయ పార్టీల నాయకులను భారత్ సమ్మిట్‌కు ఆహ్వానిస్తున్నామని తెలిపారు. ఎస్ఐఆర్ ప్రక్రియ పేరుతో అర్హులైన పౌరుల ఓటు హక్కును తొలగించే ప్రయత్నాలను కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందన్నారు. కాంగ్రెస్ కార్యకర్తల కోసమే కాకుండా ఓటు హక్కు కోల్పోయే ప్రమాదంలో ఉన్న ప్రతి పౌరుడి తరఫున పోరాడుతున్నామని చెప్పారు. ప్రతి అర్హుడైన పౌరుడికి ఓటు హక్కు కల్పించడమే ఎన్నికల సంఘం, ప్రభుత్వాల బాధ్యత అని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మాజీ కేంద్ర మంత్రి సల్మాన్ ఖుర్షీద్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, గురుదీప్ సింగ్ సప్పల్ తదితరులు పాల్గొన్నారు.
#BharatSummit2026 #BharatSummit2 #Hyderabad #Telangana #BhattiVikramarka #GlobalDemocracy #InternationalSummit #Democracy #VotingRights #SIR #Gandhi #Nehru











