Home AP బ్రహ్మంగారి మఠం పీఠంపై పీటముడి.. అసలు వివాదమేమిటి? హైకోర్టు ఏం తేల్చింది? మూడు నెలల్లో ఏం...

బ్రహ్మంగారి మఠం పీఠంపై పీటముడి.. అసలు వివాదమేమిటి? హైకోర్టు ఏం తేల్చింది? మూడు నెలల్లో ఏం జరగబోతోంది?

Succession Battle Intensifies

బ్రహ్మంగారి మఠం పీఠంపై పీటముడి.. అసలు వివాదమేమిటి?
వారసత్వ పోరు.. సంప్రదాయాల ప్రశ్న.. కోర్టు కీలక తీర్పు!
ఎందుకు వివాదం? ఎవరి వాదనలో ఎంత బలం?
చట్టం ఏం చెబుతోంది? హైకోర్టు ఏం తేల్చింది? మూడు నెలల్లో ఏం జరగబోతోంది?
వందల ఏళ్ల చరిత్ర.. పీఠాధిపతి వారసత్వమే వివాదానికి కేంద్రం

ఆంధ్రప్రదేశ్‌లో ప్రసిద్ధి చెందిన శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామివారి మఠం ఇప్పుడు వారసత్వ వివాదంతో వార్తల్లో నిలిచింది. బ్రహ్మంగారిగా ప్రసిద్ధి చెందిన పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామివారు స్థాపించిన ఈ మఠానికి ఆధ్యాత్మికంగా, చారిత్రకంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. కాలజ్ఞాన రచనతో ప్రజల్లో విశేష ప్రాచుర్యం పొందిన బ్రహ్మంగారు స్థాపించిన ఈ పీఠానికి దాదాపు 315 ఏళ్ల చరిత్ర ఉందని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. ఇంతటి చారిత్రక నేపథ్యం ఉన్న మఠంలో ఇప్పుడు ప్రధానంగా తలెత్తిన ప్రశ్న ఒక్కటే. మఠాధిపతి వారసుడు ఎవరు? కుటుంబంలో పెద్ద కుమారుడికే ఆ పదవి దక్కాలా? గత మఠాధిపతి ఎవరినైనా వారసుడిగా నామినేట్ చేస్తే ఆ నిర్ణయానికి ప్రాధాన్యత ఇవ్వాలా? లేక మఠ సంప్రదాయాలు, శిష్యుల అభిప్రాయాలు, చట్టబద్ధమైన అర్హతలను పరిగణనలోకి తీసుకుని కొత్త మఠాధిపతిని ఎంపిక చేయాలా? ఈ ప్రశ్నల చుట్టూనే వివాదం కొనసాగుతోంది. మఠానికి 11వ పీఠాధిపతిగా వ్యవహరించిన శ్రీశ్రీశ్రీ వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామివారు 1969 నుంచి 2021 మే 8న మరణించే వరకు బాధ్యతలు నిర్వహించారు. ఆయన మరణం తర్వాత వారసత్వంపై కుటుంబంలో విభేదాలు మొదలయ్యాయి. మొదటి భార్య చంద్రావతమ్మ ద్వారా నలుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. వారిలో పెద్ద కుమారుడు నొస్సం వెంకటాద్రిస్వామి, రెండో కుమారుడు నొస్సం వీరభద్రస్వామి. రెండో భార్య మారుతి మహాలక్ష్మి ద్వారా నొస్సం గోవిందస్వామి, నొస్సం వరదరాజస్వామి జన్మించారు. ఇలా ఒకే కుటుంబంలో వేర్వేరు వారసత్వ వాదనలు తెరపైకి రావడంతో మఠాధిపతి పదవి వివాదాస్పదమైంది. ఇది కేవలం కుటుంబ ఆస్తులు లేదా వ్యక్తిగత ఆధిపత్యానికి సంబంధించిన వివాదం మాత్రమే కాదు. మఠ సంప్రదాయాల కొనసాగింపు, పీఠాధిపతి ఎంపికలో శిష్యుల పాత్ర, ప్రభుత్వ అధికారుల బాధ్యత, చట్టబద్ధమైన నియామక విధానం వంటి కీలక అంశాలు ఇందులో ముడిపడ్డాయి. అందుకే ఈ వ్యవహారం కుటుంబ పరిధిని దాటి దేవాదాయ శాఖ నుంచి హైకోర్టు వరకు చేరింది.

ముగ్గురు వారసులు.. మూడు వాదనలు.. వీలునామాల నుంచి పెద్ద కుమారుడి హక్కు వరకు

మఠాధిపతి పదవిపై ప్రధానంగా ముగ్గురు వ్యక్తుల వాదనలు వివాదానికి కేంద్రంగా మారాయి. మొదటి భార్యకు జన్మించిన రెండో కుమారుడు నొస్సం వీరభద్రస్వామి తన తండ్రి 2018 నవంబర్ 10న వీలునామా రాసి తనను తదుపరి మఠాధిపతిగా నామినేట్ చేశారని వాదించారు. ఈ విషయాన్ని తన తల్లి 2018 నవంబర్ 28న ధార్మిక పరిషత్‌కు లేఖ ద్వారా తెలియజేశారని, డిసెంబర్ 1న కొరియర్ ద్వారా కూడా సమాచారం పంపించారని పేర్కొన్నారు. చట్టంలోని సెక్షన్ 54(1) ప్రకారం నిర్ణీత గడువులోనే ఈ సమాచారాన్ని అందించినందున తన నామినేషన్‌ను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. మరోవైపు రెండో భార్య కుమారుడు నొస్సం గోవిందస్వామి కూడా తన తండ్రి తననే వారసుడిగా ఎంపిక చేశారని చెబుతున్నారు. 2006లో ప్రత్యేక కాగితంపై తండ్రి స్వయంగా నామినేషన్ రాసి తనను తదుపరి మఠాధిపతిగా ఎంపిక చేశారని, ఆ విషయాన్ని వ్యక్తిగత డైరీలో కూడా నమోదు చేశారని ఆయన తరఫు వాదన. ఆ పత్రాలను తండ్రి వ్యక్తిగత గదిలోని ఇనుప బీరువాలో భద్రపరిచారని, అధికారులు ఆ బీరువాను స్వాధీనం చేసుకున్నారని పేర్కొన్నారు. ఈ ఆధారాలను పరిశీలించకుండా తన వాదనను తిరస్కరించారని ఆరోపించారు. తన తల్లి 2021 జూన్ 25, 26 తేదీల్లో ధార్మిక పరిషత్‌కు వినతిపత్రాలు సమర్పించి గోవిందస్వామిని మఠాధిపతిగా గుర్తించాలని కోరినట్లు కోర్టుకు వివరించారు. ఇక పెద్ద కుమారుడు నొస్సం వెంకటాద్రిస్వామి వాదన మరోలా ఉంది. మఠం స్థాపించినప్పటి నుంచి చివరి పీఠాధిపతి కుటుంబంలో పెద్ద సభ్యుడిని మఠాధిపతిగా నియమించడం సంప్రదాయంగా కొనసాగుతోందని, ఆ ఆనవాయితీ ప్రకారం తనకే ఆ పదవి దక్కాలని పేర్కొన్నారు. తండ్రి మరణించిన 13వ రోజున సంప్రదాయం ప్రకారం తన పట్టాభిషేకం నిర్వహించారని కూడా తెలిపారు. అయితే ఈ వాదనలకు భిన్నంగా పిటిషనర్లు చట్టంలోని అర్హతలు, నియామక విధానమే ప్రధానమని స్పష్టం చేశారు. పెద్ద కుమారుడనే కారణం ఒక్కటే మఠాధిపతి పదవికి సరిపోదని, మఠ సంప్రదాయాన్ని నిర్ధారించడంతో పాటు చట్టం నిర్దేశించిన ప్రక్రియను కూడా పాటించాల్సిందేనని వాదించారు. ఇక్కడే ఈ వివాదం కీలక మలుపు తిరిగింది. ఒకవైపు కుటుంబ సభ్యులు తమ తమ నామినేషన్లు, వారసత్వ హక్కులను ప్రస్తావిస్తుంటే, మరోవైపు మఠాధిపతి ఎంపికలో చట్టానికి ఉన్న ప్రాధాన్యతను ప్రశ్నిస్తూ న్యాయపోరాటం మొదలైంది. ఒకరి వాదనను మరొకరు అంగీకరించకపోవడంతో వివాదం మరింత తీవ్రరూపం దాల్చింది.

2021 నుంచి 2025 వరకు.. అధికారుల నిర్ణయాలు, న్యాయస్థానాల జోక్యం

11వ మఠాధిపతి మరణం తర్వాత కుటుంబంలో విభేదాలు పెరగడంతో 2021 జూన్ 12న దేవాదాయ శాఖ కమిషనర్ మఠం నిర్వహణ బాధ్యతలను చూసేందుకు సహాయ కమిషనర్‌ను ఫిట్ పర్సన్‌గా నియమించారు. జూన్ 13న మఠంలోని చరాస్తులు, స్థిరాస్తులకు సంబంధించిన రికార్డులన్నీ అప్పగించాలని మేనేజర్‌ను ఆదేశించారు. ఈ నియామకాన్ని గోవిందస్వామి, ఆయన తల్లి హైకోర్టులో సవాలు చేశారు. W.P. No.12609 of 2021 దాఖలు చేశారు. అనంతరం W.A. No.535 of 2021 రూపంలో అప్పీల్ దాఖలైంది. 2021 సెప్టెంబర్ 23న డివిజన్ బెంచ్ ఈ అప్పీల్‌ను పరిష్కరిస్తూ గోవిందస్వామి వారసత్వ వాదనను సంబంధిత వ్యక్తులందరికీ న్యాయమైన అవకాశం కల్పించి మెరిట్స్ ఆధారంగా పరిశీలించాలని దేవాదాయ శాఖ కమిషనర్‌ను ఆదేశించింది. అయితే 2021 నవంబర్ 28న కమిషనర్ గోవిందస్వామి వాదనను తిరస్కరించారు. మఠం రోజువారీ వ్యవహారాల నిర్వహణకు సహాయ కమిషనర్‌ను తాత్కాలిక ఫిట్ పర్సన్‌గా కొనసాగించారు. సమావేశాల నిర్వహణ కోసం నవంబర్ 29న జాయింట్ కమిషనర్‌ను అధికారిగా నియమించారు. ఈ నిర్ణయాలపై గోవిందస్వామి, ఆయన తల్లి W.P. No.29071 of 2021 దాఖలు చేయగా, వీరభద్రస్వామి W.P. No.42248 of 2022 దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లను సింగిల్ బెంచ్ కొట్టివేసింది. అయితే తమ అభ్యంతరాలను సంబంధిత సివిల్ కోర్టులో చట్టప్రకారం వినిపించుకునే అవకాశం కల్పించింది. అనంతరం ఈ వ్యవహారం డివిజన్ బెంచ్‌కు చేరింది. W.A. No.1066 of 2024, W.A. No.3 of 2025 కేసుల్లో 2025 మే 1న హైకోర్టు కీలకమైన ఉమ్మడి ఉత్తర్వులు ఇచ్చింది. వారసత్వ హక్కు కోరుతున్నవారు తమ వద్ద ఉన్న పత్రాలను సంబంధిత సివిల్ కోర్టులో సమర్పించి అర్హతను నిరూపించుకోవాలని మొదటి ఆదేశం ఇచ్చింది. అదే సమయంలో మఠాధిపతి నియామకం కోసం చట్టంలోని సెక్షన్ 54(2) ప్రకారం ధార్మిక పరిషత్ ముందు తమ వాదనలు వినిపించుకోవచ్చని రెండో ఆదేశం ఇచ్చింది. సెక్షన్ 53(2) ప్రకారం అధికారులు తగిన వ్యక్తిని నామినేట్ చేయాలని, సివిల్ కోర్టుల్లో దాఖలయ్యే కేసుల తుది ఫలితాలకు ఆ నియామకం లోబడి ఉండాలని స్పష్టం చేసింది. అయినప్పటికీ 2025 ఫిబ్రవరి 16న ఫిట్ పర్సన్ నియామకం జరగడంతో మరోసారి న్యాయపోరాటం మొదలైంది. దీనిపై W.P. No.11857 of 2025 దాఖలైంది. 2025 ఆగస్టు 7న హైకోర్టు ఆ పిటిషన్‌ను పరిష్కరిస్తూ గతంలో డివిజన్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా మఠాధిపతి నియామకంపై తగిన నిర్ణయం తీసుకోవాలని ధార్మిక పరిషత్‌ను ఆదేశించింది. దీంతో వివాదం పరిష్కారమవుతుందని భావించినప్పటికీ, తదుపరి నియామక ప్రక్రియే మరోసారి హైకోర్టు ముందుకు వచ్చింది.

2026 జనవరి నియామకం.. అసలు తప్పు ఎక్కడ జరిగింది?

హైకోర్టు గత ఆదేశాల నేపథ్యంలో 2026 జనవరి 13న దేవాదాయ శాఖ కమిషనర్ నొస్సం వెంకటాద్రిస్వామిని తాత్కాలిక మఠాధిపతిగా నియమించారు. DP1/25030/12/2025 నంబరుతో జారీ చేసిన ఈ ఉత్తర్వుల ప్రకారం మఠంలోని మతపరమైన, లౌకిక వ్యవహారాలను ఆయన తాత్కాలికంగా నిర్వహించాల్సి ఉంది. చివరి పీఠాధిపతి కుటుంబంలో పెద్ద కుమారుడిని మఠాధిపతిగా నియమించడం సంప్రదాయంగా వస్తోందనే వాదనను అధికారులు పరిగణనలోకి తీసుకున్నారు. అయితే ఈ నియామకం చట్టబద్ధంగా జరిగిందా? సంబంధిత మఠాధిపతులకు, శిష్యులకు సమాచారం ఇచ్చారా? ఎంపిక సమావేశం నిబంధనల ప్రకారం నిర్వహించారా? అనే ప్రశ్నలు తలెత్తాయి. వీరభద్రస్వామి, గోవిందస్వామి తరఫున వచ్చిన అభ్యంతరాలతో పాటు మఠానికి చెందిన శిష్యుడిగా తుర్లపాటి సాంబశివరావు కూడా న్యాయపోరాటం చేశారు. ఆయన ప్రకాశం జిల్లా చిరాలకు చెందినవారు. W.P. No.2404 of 2026లో నియామక ప్రక్రియ చట్టవిరుద్ధమని వాదించారు. అంతేకాకుండా 2025లో జరిగిన సమావేశం ఆధారంగా నియామక ప్రక్రియ చేపట్టడాన్ని సవాలు చేస్తూ W.P. No.33169 of 2025 కూడా దాఖలైంది. ఈ నాలుగు పిటిషన్లలో ప్రధానంగా ప్రస్తావించిన అంశం 1987 చట్టం, మఠాల పరిపాలన నిబంధనలు, 1987లోని రూల్ 8. ఈ నిబంధన ప్రకారం ఒకే సంప్రదాయానికి చెందిన ఇతర మఠాల మఠాధిపతులతో సమావేశం నిర్వహించాలి. సంబంధిత మఠానికి చెందిన శిష్యులను కూడా ఆహ్వానించాలి. సమావేశం తేదీ, సమయం, ప్రదేశం గురించి కనీసం నెల రోజుల ముందుగా నోటీసులు ఇవ్వాలి. మఠం ఖర్చుతో వార్తాపత్రికల్లో ప్రకటన ప్రచురించాలి. మఠం నోటీసు బోర్డుతో పాటు కమిషనర్, ప్రాంతీయ సంయుక్త కమిషనర్, డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయాల నోటీసు బోర్డులపై కూడా ప్రకటనలు ప్రదర్శించాలి. రూల్ 9 ప్రకారం సమావేశానికి వచ్చే మఠాధిపతులు, శిష్యులను మఠ సంప్రదాయాలకు అనుగుణంగా గౌరవంగా స్వీకరించాలి. కానీ ఈ విధానాన్ని అధికారులు అనుసరించలేదని పిటిషనర్లు ఆరోపించారు. మరో ముఖ్యమైన అంశం సెక్షన్ 53(2). దీని ప్రకారం మఠాధిపతికి హిందూ మతం, తత్వశాస్త్రంపై ప్రాథమిక పరిజ్ఞానం ఉండాలి. సంబంధిత మఠ సంప్రదాయాలు, శాస్త్రాలపై అవగాహన ఉండాలి. శిష్యులకు మఠ సిద్ధాంతాలను బోధించే సామర్థ్యం, మతపరమైన నిబద్ధత, క్రమశిక్షణ, నిస్సందేహమైన నైతిక ప్రవర్తన ఉండాలి. ఈ అర్హతలను పరిశీలించకుండా పెద్ద కుమారుడనే కారణంతో నియామకం చేయడం సరైన విధానం కాదని పిటిషనర్లు వాదించారు. వెంకటాద్రిస్వామి తరఫున మాత్రం తమ నియామకం మఠ సంప్రదాయాలకు అనుగుణంగానే జరిగిందని, గత మఠాధిపతికి సేవలు అందించిన వ్యక్తిగా తనకు అనుభవం ఉందని, పిటిషనర్ల వాదనలకు చట్టపరమైన ఆధారాలు లేవని సమాధానం ఇచ్చారు. దీంతో వివాదం వ్యక్తిగత వారసత్వ హక్కుల నుంచి చట్టబద్ధమైన నియామక ప్రక్రియ వైపు మళ్లింది.

హైకోర్టు ఏం తేల్చింది? నాలుగు పిటిషన్లపై కీలక తీర్పు

ఈ నాలుగు రిట్ పిటిషన్లను జస్టిస్ తర్లాడ రాజశేఖరరావు విచారించారు. అన్ని పిటిషన్లలోని అంశాలు ఒకే విధంగా ఉన్నందున ఉమ్మడిగా విచారించి ఒకే తీర్పు వెలువరించారు. విచారణలో ప్రధానంగా సెక్షన్ 54(2), మఠాల పరిపాలన నిబంధనల అమలుపై దృష్టి సారించారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన Sri Sri Sri Lakshmana Yatendrulu and others v. State of Andhra Pradesh and another తీర్పును కూడా పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ప్రస్తావించారు. మఠాధిపతి నియామకంలో మతం, తత్వశాస్త్రం, సంప్రదాయాలపై పరిజ్ఞానం ఉన్న ప్రముఖుల అభిప్రాయాలను కమిషనర్ తీసుకోవాలనే న్యాయసూత్రాన్ని వివరించారు. మరోవైపు వెంకటాద్రిస్వామి తరఫు న్యాయవాదులు హైకోర్టు అప్పీల్ కోర్టులా వ్యవహరించి సాక్ష్యాలను తిరిగి పరిశీలించలేదని వాదించారు. ఇందుకు సుప్రీంకోర్టు ఇచ్చిన Central Council for Research in Ayurvedic Sciences v. Bikartan Das తీర్పును ప్రస్తావించారు. అయితే విచారణలో హైకోర్టు ముందున్న కీలకమైన అంశం మాత్రం ఎంపిక ప్రక్రియలో చట్టబద్ధమైన నోటీసులు ఇచ్చారా? అవసరమైన వ్యక్తులను సమావేశానికి ఆహ్వానించారా? అన్నదే. మఠానికి శిష్యులు ఉన్నప్పటికీ వారికి నోటీసులు ఇవ్వలేదని కోర్టు గుర్తించింది. అదే సంప్రదాయానికి చెందిన ఇతర మఠాల మఠాధిపతులు కూడా సమావేశానికి హాజరుకాలేదని పేర్కొంది. సమావేశానికి శిష్యుడిగా తనకు ఎలాంటి సమాచారం అందలేదని తుర్లపాటి సాంబశివరావు చేసిన వాదనను ప్రతివాదులు స్పష్టంగా ఖండించలేదని తెలిపింది. సమావేశానికి మఠాధిపతులు, శిష్యులు ఆహ్వానించబడకపోవడంతో మొత్తం ఎంపిక ప్రక్రియ చట్టపరంగా లోపభూయిష్టంగా మారిందని తేల్చింది. పెద్ద కుమారుడిని మఠాధిపతిగా నియమించాలనుకున్నా చట్టం నిర్దేశించిన విధానాన్ని తప్పనిసరిగా పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. అంతేకాదు, గత మఠాధిపతి పెద్ద కుమారుడినే తదుపరి మఠాధిపతిగా నియమించాలని చెప్పే ప్రత్యేక నిబంధన ఏదీ లేదని పేర్కొంది. అధికారుల బాధ్యతను నిర్వర్తించడంలో వైఫల్యం ఉన్నప్పుడు హైకోర్టు ఆర్టికల్ 226 కింద మాండమస్ రిట్ జారీ చేయవచ్చని Comptroller and Auditor General of India Vs K.S. Jagganathan కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా ప్రస్తావించింది. చివరకు 2026 నవంబర్ 4న నాలుగు రిట్ పిటిషన్లను అనుమతిస్తూ కీలక తీర్పు వెలువరించింది. 2026 జనవరి 13న వెంకటాద్రిస్వామిని తాత్కాలిక మఠాధిపతిగా నియమిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది. ఈ వ్యవహారాన్ని తిరిగి దేవాదాయ శాఖ కమిషనర్‌కు పంపించింది. సెక్షన్లు 53, 54(2), 1987 మఠాల పరిపాలన నిబంధనల ప్రకారం కొత్త నియామక ప్రక్రియను పూర్తిగా, కచ్చితంగా నిర్వహించాలని ఆదేశించింది. అవసరమైతే మతం, తత్వశాస్త్రం, మఠ సంప్రదాయాలపై అవగాహన ఉన్న ప్రముఖుల అభిప్రాయాలను తీసుకుని అభ్యర్థి అర్హతలను పరిశీలించాలని స్పష్టం చేసింది. కోర్టు తీర్పులో అత్యంత ముఖ్యమైన అంశం ఏమిటంటే, పెద్ద కుమారుడనే కారణంతోనే మఠాధిపతి పదవిపై స్వయంచాలక హక్కు ఏర్పడదని స్పష్టంచేయడం.

మూడు నెలల గడువు.. అప్పటివరకు వెంకటాద్రిస్వామే మఠాధిపతి!

హైకోర్టు తీర్పు వెలువడటంతో మఠాధిపతి నియామకంపై తదుపరి బాధ్యత పూర్తిగా దేవాదాయ శాఖ కమిషనర్‌పై పడింది. కోర్టు ఉత్తర్వుల ప్రతిని అందుకున్న తేదీ నుంచి మూడు నెలల్లోగా కొత్త మఠాధిపతి నియామక ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టమైన గడువు విధించింది. అంటే అధికారులు ఇకపై కేవలం కుటుంబంలో పెద్ద కుమారుడనే అంశాన్ని మాత్రమే ప్రాతిపదికగా తీసుకోలేరు. మఠానికి చెందిన శిష్యులకు, అదే సంప్రదాయానికి చెందిన ఇతర మఠాల మఠాధిపతులకు నిబంధనల ప్రకారం అవకాశం కల్పించాలి. ముందస్తు నోటీసులు ఇవ్వాలి. సమావేశాన్ని చట్టబద్ధంగా నిర్వహించాలి. ప్రతిపాదిత అభ్యర్థికి సెక్షన్ 53(2)లో పేర్కొన్న అర్హతలు ఉన్నాయా లేదా పరిశీలించాలి. వీరభద్రస్వామి సమర్పించినట్లు చెబుతున్న 2018 వీలునామా, గోవిందస్వామి ప్రస్తావించిన 2006 నామినేషన్ పత్రం వంటి అంశాలపై కూడా సంబంధిత వాదనలు, ఆధారాలు చట్టపరమైన పరిధిలో పరిశీలనకు రావచ్చు. అయితే ఈ తీర్పు ఆ ఇద్దరిలో ఎవరికైనా మఠాధిపతి పదవిని ఖరారు చేయలేదు. వారి వారసత్వ హక్కులపై తుది నిర్ణయం కూడా ఇవ్వలేదు. డివిజన్ బెంచ్ గతంలో సూచించినట్లుగా పత్రాల ఆధారంగా వారసత్వ హక్కును నిరూపించుకోవాల్సిన అంశం సివిల్ కోర్టు పరిధిలో ఉంటుంది. మరో కీలకమైన పరిణామం కూడా ఈ తీర్పులో ఉంది. తీర్పు వెలువడిన అనంతరం వెంకటాద్రిస్వామి తరఫు న్యాయవాది కొత్త మఠాధిపతి నియామకం జరిగే వరకు ప్రస్తుతం ఉన్న ఆయననే కొనసాగించాలని కోర్టును అభ్యర్థించారు. ఈ అభ్యర్థనను అంగీకరించిన న్యాయమూర్తి, కొత్త నియామకంపై నిర్ణయం తీసుకునే వరకు వెంకటాద్రిస్వామిని మఠాధిపతిగా కొనసాగించాలని దేవాదాయ శాఖ కమిషనర్‌ను ఆదేశించారు. అంటే నియామక ఉత్తర్వులు రద్దయినా ఆయన తక్షణమే పదవి నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి లేదన్నమాట. కొత్త నియామకం జరిగే వరకు తాత్కాలిక కొనసాగింపునకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ తీర్పుతో మఠాధిపతి పదవిపై కొనసాగుతున్న వివాదం పూర్తిగా ముగిసినట్లు కాదు. అసలు నిర్ణయాత్మక దశ ఇప్పుడు మొదలైంది. దేవాదాయ శాఖ కమిషనర్ ఎవరిని అర్హుడిగా గుర్తిస్తారు? మఠ శిష్యులు, ఇతర మఠాధిపతుల అభిప్రాయాలు ఎలా ఉంటాయి? వీరభద్రస్వామి, గోవిందస్వామి సమర్పించే ఆధారాలపై ఎలాంటి పరిశీలన జరుగుతుంది? వెంకటాద్రిస్వామి వాదనకు ఎంత ప్రాధాన్యత లభిస్తుంది? అన్న ప్రశ్నలకు రాబోయే మూడు నెలల్లో సమాధానాలు లభించే అవకాశం ఉంది. ఈ వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు ఒక వ్యక్తికి పీఠాన్ని అప్పగించడం కాదు; పీఠాధిపతి ఎంపికను చట్టబద్ధమైన మార్గంలో నిర్వహించాలని అధికారులకు ఇచ్చిన స్పష్టమైన ఆదేశం. అందువల్ల ఇప్పుడు అందరి దృష్టి దేవాదాయ శాఖ తదుపరి చర్యలపైనే ఉంది. వందల ఏళ్ల చరిత్ర కలిగిన బ్రహ్మంగారి మఠానికి తదుపరి పీఠాధిపతి ఎవరు? కుటుంబ వారసత్వమా? మఠ సంప్రదాయమా? చట్టబద్ధమైన అర్హతలా? ఈ మూడింటి మధ్య సమతుల్యతను పాటిస్తూ అధికారులు తీసుకునే నిర్ణయమే ఈ వివాదానికి తదుపరి దిశను నిర్దేశించనుంది.