మాక్ పార్లమెంట్‌పై బీజేపీ వ్యంగ్యాస్త్రాలు.
ప్రజాస్వామ్యానికి అవమానమంటూ ధ్వజం .
ప్రతిపక్ష ఇండియా కూటమి నిర్వహించిన మాక్ పార్లమెంట్‌పై బీజేపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ప్రజాస్వామ్య సంస్థలను అపహాస్యం చేసేలా కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలు వ్యవహరిస్తున్నాయని బీజేపీ ఎంపీ సంబిత్ పాత్ర విమర్శించారు. పాత పార్లమెంట్ భవనాన్ని పోలిన నమూనాలో సమావేశం నిర్వహించడాన్ని ప్రస్తావిస్తూ.. అంతగా పాత బ్రిటిష్ కాలం నాటి నిర్మాణాలపై ప్రేమ ఉంటే, అదే భవనంలో రాహుల్ గాంధీని మాక్ ప్రధానిగా కూర్చోబెట్టుకోవాలని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో జరిగిన ఈ మాక్ పార్లమెంట్లో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై ప్రతీకాత్మక ప్రజాభిశంసన చేపట్టడాన్ని ఆయన తప్పుబట్టారు. నిజమైన పార్లమెంట్లో చర్చలకు అడ్డుపడుతూ, బయట మాత్రం ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
ఓట్ల చోరీ కాదు.. అక్రమాల ఏరివేత!
ఓట్ల చోరీ ఆరోపణలను సంబిత్ పాత్ర తోసిపుచ్చారు. కాంగ్రెస్‌కు చెందిన 38 లక్షల బూత్ స్థాయి ఏజెంట్లు సక్రమంగా పనిచేసి ఉంటే ఈ నాటకాలు అవసరమయ్యేవి కావని అన్నారు. 13 కోట్ల మంది ఓటు హక్కులు కోల్పోయారన్న ఆరోపణల్లో నిజం లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పాలనలోనే పదిసార్లు ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) జరిగిందని గుర్తుచేశారు. దేశవ్యాప్తంగా సుమారు 12 కోట్ల మంది శాశ్వతంగా వలస వెళ్లారని, వారిలో ఆరు కోట్ల మంది ఫారం-6 ద్వారా ఓటరు జాబితాలో చేరేందుకు దరఖాస్తు చేశారని వివరించారు. మరణించిన వారి పేర్లతో 2.8 కోట్ల ఎంట్రీలు, దాదాపు కోటి నకిలీ పేర్లను తొలగించినట్లు తెలిపారు. ఫారం-6లో కేవలం ప్రకటన మాత్రమే జోడించారని, సుప్రీంకోర్టు తీర్పు దీనిపై స్పష్టత ఇచ్చిందని పేర్కొన్నారు.
ఎన్నికల కమిషన్‌కు రక్షణపై వివరణ
ఎన్నికల కమిషనర్లకు రక్షణ కల్పించేందుకు 2023లో బీజేపీ చట్టం తెచ్చిందన్న విమర్శనూ సంబిత్ పాత్ర ఖండించారు. రాజ్యాంగపరమైన రక్షణ ఇప్పటికే ఉందని, కొత్త చట్టం కేవలం విధివిధానాలను మాత్రమే నిర్దేశించిందని చెప్పారు. ఎస్ఐఆర్పై నిర్ణయాలు ఏకగ్రీవంగానే తీసుకున్నట్లు ఎన్నికల సంఘం స్పష్టం చేసిందని వెల్లడించారు. మరోవైపు బీజేపీ ఎంపీ సుధాంశు త్రివేది ప్రపంచ బ్యాంకు 2025 నివేదికను ప్రస్తావిస్తూ, 2011లో 27.6 శాతంగా ఉన్న తీవ్ర పేదరికం 2023 నాటికి 2.6 శాతానికి తగ్గిందన్నారు. పేదరిక నిర్మూలనకు ఎన్డీఏ కట్టుబడి ఉంటే, రాహుల్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ దేశంలో అరాచక పరిస్థితులు సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు.
#BJP #SambitPatra #RahulGandhi #INDIABloc #MockParliament #MallikarjunKharge #GyaneshKumar #ElectionCommission #SIR #VoterList #Form6 #SudhanshuTrivedi #IndianPolitics











