Home National_news జర్నలిస్ట్‌తో సీఎం రెండో పెళ్లి కొత్త జీవితంలోకి ఒమర్ అబ్దుల్లా!

జర్నలిస్ట్‌తో సీఎం రెండో పెళ్లి కొత్త జీవితంలోకి ఒమర్ అబ్దుల్లా!

నిధి రజ్దాన్‌తో వైవాహిక బంధం.
ఢిల్లీలో నిరాడంబరంగా వివాహ వేడుక.

జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా (56) జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ప్రముఖ జర్నలిస్ట్ నిధి రజ్దాన్‌ను ఆయన రెండో వివాహం చేసుకున్నారు. అక్టోబర్ 30న న్యూఢిల్లీలో అత్యంత నిరాడంబరంగా జరిగిన వేడుకలో ఇద్దరూ ఒక్కటయ్యారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. వివాహానికి సంబంధించిన ఫొటోలను ఎక్స్‌లో పంచుకున్న ఒమర్ అబ్దుల్లా ‘నిన్న కొత్త ప్రయాణం ప్రారంభమైంది’ అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. నిధి రజ్దాన్ సైతం పెళ్లి ఫొటోలను పంచుకుంటూ ‘ఇట్స్ డన్ బ్రో’ అంటూ ఉంగరం గుర్తుతో సరదాగా స్పందించారు. వీరి వివాహ వార్త వెలువడటంతో అభిమానులు, రాజకీయ నాయకులు, నెటిజన్ల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.

కుటుంబాల సమక్షంలో వేడుక

కుటుంబ వర్గాల సమాచారం ప్రకారం, ఈ నెలలోనే శ్రీనగర్‌లో అబ్దుల్లా, రజ్దాన్ కుటుంబాలు ప్రత్యేకంగా సమావేశమై వేడుక నిర్వహించాయి. అనంతరం ఢిల్లీలో వివాహాన్ని అధికారికంగా నమోదు చేయించారు. జమ్మూకశ్మీర్‌లో అధికారిక కార్యక్రమాలతో పాటు పలుచోట్ల ఒమర్ అబ్దుల్లా, నిధి రజ్దాన్ కలిసి కనిపించడంతో వీరి పరిచయం గురించి గతంలోనే చర్చ జరిగింది. నేషనల్ కాన్ఫరెన్స్ అధికార ప్రతినిధి ఇమ్రాన్ నబీ దార్ ఈ జంటకు అభినందనలు తెలిపారు. కొత్త జీవితంలో అడుగుపెట్టిన ఇద్దరికీ జీవితాంతం సంతోషం, అనుబంధం ఉండాలని ఆకాంక్షించారు. వ్యక్తిగత జీవితంలో కొత్త మలుపు తీసుకున్న ముఖ్యమంత్రికి రాజకీయ వర్గాల నుంచి కూడా శుభాకాంక్షలు అందుతున్నాయి.

విడాకులతో వివాదానికి తెర

ఒమర్ అబ్దుల్లా రెండో వివాహం వెనుక ఆయన వ్యక్తిగత జీవితంలో జరిగిన పరిణామాలు కూడా చర్చకు వస్తున్నాయి. 1994లో మేజర్ జనరల్ రామ్ నాథ్ కుమార్తె పాయల్ నాథ్‌ను ఆయన వివాహం చేసుకున్నారు. రాజకీయాల్లోకి రాకముందే జరిగిన ఈ పెళ్లి బంధానికి 2011లో ఇద్దరూ విడిపోయారు. విడాకుల వ్యవహారంపై సుదీర్ఘ న్యాయపోరాటం కొనసాగింది. చివరకు 2026 జూలై 31న సుప్రీంకోర్టులో పరస్పర అంగీకారంతో విడాకుల పరిష్కారం కుదిరింది. ఆ పరిణామం జరిగిన మూడు నెలలకే నిధి రజ్దాన్‌తో ఒమర్ కొత్త వైవాహిక జీవితాన్ని ప్రారంభించారు. రాజకీయ బాధ్యతల మధ్య వ్యక్తిగత జీవితంలోనూ కొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టారు.

 

#OmarAbdullah #NidhiRazdan #OmarAbdullahMarriage #NidhiRazdanWedding #JammuAndKashmir #JandKNews #SpecialMarriageAct #PayalAbdullah #FarooqAbdullah #IndianPolitics