Home National_news ఓట్ల తొలగింపు దందాపై గురి!

ఓట్ల తొలగింపు దందాపై గురి!

ఫారం-7 దుర్వినియోగంపై న్యాయస్థానం ఆరా.
నివేదిక సమర్పించాలని ఈసీకి ఆదేశాలు.
ఫేక్‌ దరఖాస్తులపై సుప్రీం కోర్టు ఆగ్రహం .

ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో ఓట్ల తొలగింపునకు ఉపయోగించే ఫారం-7 దరఖాస్తుల దుర్వినియోగం ఆరోపణలపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఉత్తరప్రదేశ్‌లో నకిలీ దరఖాస్తులు పెద్దఎత్తున సమర్పించారన్న కాంగ్రెస్‌ ఎంపీ తనూజ్‌ పునియా పిటిషన్‌పై విచారణ చేపట్టిన సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని ధర్మాసనం, ఈ వ్యవహారంపై పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఫారం-7 దుర్వినియోగంపై అవసరమైన చర్యలు తీసుకుని, అనుసరణ నివేదిక సమర్పించాలని (కంప్లయన్స్‌ రిపోర్ట్‌) స్పష్టం చేసింది. నకిలీ దరఖాస్తులు, తప్పుడు వివరాలు, సంతకాల ఫోర్జరీతో ఓటర్ల పేర్లు తొలగించే ప్రయత్నాలు ప్రజాస్వామ్య ప్రక్రియపై అనుమానాలు పెంచుతున్నాయని పిటిషనర్‌ తరఫు న్యాయవాదులు వాదించారు.

తప్పుగా వచ్చిన దరఖాస్తులు తిరస్కరించాం

ఉత్తరప్రదేశ్‌ సర్ సమయంలో తప్పుడు ఫారం-7 దరఖాస్తులు గుర్తించినప్పటికీ, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఒక్క దరఖాస్తును కూడా ఆమోదించలేదని ఎన్నికల సంఘం సుప్రీంకోర్టుకు తెలిపింది. వాటిని గుర్తించిన వెంటనే అధికారులు సరిదిద్దే చర్యలు చేపట్టారని ఈసీ తరఫు సీనియర్‌ న్యాయవాది దామ శేషాద్రి నాయుడు వివరించారు. హటా అసెంబ్లీ నియోజకవర్గంలో 32 మంది ఓటర్ల పేర్లు తొలగించేందుకు ఫారాలు సమర్పించగా, వాటిలో రెండు ఫారాలపై బూత్‌ స్థాయి అధికారి సంతకం ఉన్నట్లు పిటిషనర్‌ తరఫు న్యాయవాది ప్రస్తావించారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన ఓటర్లను లక్ష్యంగా చేసుకున్నారనే ఆరోపణలపైనా విచారణ జరగాలని కోరారు. కలిలాబాద్‌లో భారీ సంఖ్యలో ఫారాలు సమర్పించే ప్రయత్నాన్ని అధికారులు అడ్డుకున్నారని ఈసీ గతంలో వెల్లడించింది. BLOలు సరైన పరిశీలన లేకుండా ఫారాలను స్వీకరించవద్దని ఆదేశించినట్లు తెలిపింది.

రెండు కోట్ల పేర్ల తొలగింపుపై ఆందోళన

ఉత్తరప్రదేశ్‌లో ఏప్రిల్‌లో ముగిసిన ఓటర్ల జాబితా సవరణ అనంతరం మొత్తం ఓటర్ల సంఖ్య 13.39 కోట్లకు చేరింది. గత జాబితాతో పోలిస్తే 84 లక్షల మంది పెరిగినా, సవరణ ప్రక్రియలో రెండు కోట్లకు పైగా పేర్లు తొలగించబడ్డాయి. తప్పుడు గుర్తింపు వివరాలు, నకిలీ సంతకాలు, ఇతరుల పేర్లతో అభ్యంతరాలు దాఖలు చేసినట్లు పిటిషన్‌లో ఆరోపించారు. కొందరు BLOల ఇళ్ల వద్ద కూడా ఫారం-7లు లభించాయని, తమ పేర్లతో దరఖాస్తులు సమర్పించలేదని సంబంధిత వ్యక్తులు చెప్పినట్లు ఈసీ అఫిడవిట్‌లో పేర్కొంది. ఓటుహక్కు కోల్పోయే ప్రమాదం ఉన్నందున ఈ వ్యవహారాన్ని తక్షణమే పరిశీలించాలని కాంగ్రెస్‌ కోరుతోంది. డిసెంబరు లేదా జనవరి నుంచి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉండటంతో విచారణలో జాప్యం చేయవద్దని పిటిషనర్‌ తరఫు న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు.

 

#SupremeCourt #Form7 #Form7Misuse #UttarPradeshSIR #VoterListRevision #ElectionCommission #FakeApplications #VoterDeletion #VoterRights #CJI #IndianPolitics #ElectoralProcess