Home Telangana ప్రపంచ పెట్టుబడులకు వేదిక

ప్రపంచ పెట్టుబడులకు వేదిక

గ్లోబల్‌ సమ్మిట్‌తో తెలంగాణకు ప్రపంచ గుర్తింపు!
డిసెంబర్‌ 7 నుంచి ఫ్యూచర్‌ సిటీలో పెట్టుబడుల పండుగ.

తెలంగాణను ప్రపంచ పెట్టుబడులకు కీలక గమ్యస్థానంగా నిలిపే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న ‘ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌’ ఏర్పాట్లపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. డిసెంబర్‌ 7 నుంచి ఫ్యూచర్‌ సిటీలో జరగనున్న ఈ సదస్సుతో రాష్ట్ర ప్రతిష్ఠ అంతర్జాతీయ స్థాయిలో మరింత పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. వివిధ దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చే పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, ప్రముఖ సంస్థల ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. నవంబర్‌ మొదటి వారంలోగా సమగ్ర ప్రణాళికలను ఖరారు చేయాలని స్పష్టం చేశారు.

ఢిల్లీ కర్టెన్‌ రైజర్‌పై ప్రత్యేక దృష్టి

ఈ నెల 29న ఢిల్లీలో నిర్వహించనున్న కర్టెన్‌ రైజర్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. గ్లోబల్‌ సమ్మిట్‌ ప్రధాన కార్యక్రమాలతో పాటు ఔత్సాహిక పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలతో సమావేశాలు, రక్షా ఎక్స్‌పో, ఇండియా జాయ్‌ వంటి కార్యక్రమాల నిర్వహణపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. సదస్సుకు వచ్చే అంతర్జాతీయ ప్రతినిధులకు తెలంగాణలోని పారిశ్రామిక అవకాశాలు, పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం స్పష్టంగా తెలిసేలా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. క్లైమేట్‌ చేంజ్‌, కృత్రిమ మేధస్సు రంగాల్లో ప్రపంచస్థాయి ప్రముఖులను ఆహ్వానించాలని సూచించారు.

హైదరాబాద్‌ అంతటా ప్రచార హోరు

టెక్నాలజీ, ఫార్మా, ఏరోస్పేస్‌ రంగాల్లో తెలంగాణ సాధించిన విజయాలను ప్రపంచానికి చాటిచెప్పేలా హైదరాబాద్‌ నగరవ్యాప్తంగా ప్రచారం చేపట్టాలని సీఎం ఆదేశించారు. నగరంలోని కీలక ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. యానిమేషన్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌, గేమింగ్‌, కామిక్స్‌ రంగాలను ప్రతిబింబించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు వివరించారు. వివిధ రంగాల్లో రాష్ట్రం సాధించిన ప్రగతి, భవిష్యత్తు అవకాశాలను పెట్టుబడిదారులకు ఆకర్షణీయంగా పరిచయం చేయడంపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

తెలంగాణ సంస్కృతికి ప్రత్యేక ప్రాధాన్యం

గ్లోబల్‌ సమ్మిట్‌ ప్రాంగణంలో తెలంగాణ చరిత్ర, సంప్రదాయాలు ప్రతిబింబించేలా డిజైన్లు రూపొందించాలని రేవంత్‌రెడ్డి సూచించారు. కాకతీయ కళాతోరణం, రామప్ప ఆలయ రూపకల్పనలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని చాటిచెప్పే బతుకమ్మ పండుగ గురించి విదేశీ అతిథులకు పరిచయం చేసేలా ప్రత్యేక డిజైన్లు, కార్యక్రమాలు రూపొందించాలని చెప్పారు. ఈ సమీక్షలో సీఎస్‌ సంజయ్‌ జాజు, సీఎం ప్రిన్సిపల్‌ సెక్రటరీ శేషాద్రి, టీజీఐఐసీ ఎండీ శశాంక, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణాదిత్య, ఇన్వెస్ట్‌ తెలంగాణ సీఈఓ బి. అజిత్‌రెడ్డి, ఐటీ శాఖ డిప్యూటీ సెక్రటరీ డి. అనుదీప్‌ సహా పలువురు అధికారులు పాల్గొన్నారు.

 

#TelanganaGlobalSummit #InvestTelangana #RevanthReddy #TelanganaInvestments #FutureCity #GlobalInvestors #Hyderabad #TelanganaIT #PharmaIndustry #Aerospace