Home AP ఘటనపై వైసీపీపై టీడీపీ ఎదురుదాడి! హింసకు పాల్పడితే సహించమన్న నేతలు

ఘటనపై వైసీపీపై టీడీపీ ఎదురుదాడి! హింసకు పాల్పడితే సహించమన్న నేతలు

పుంగనూరును శ్మశానంగా మార్చే కుట్ర.
టీడీపీ నేత అమర్‌నాథ్‌రెడ్డి ఆగ్రహం .

పుంగనూరు నియోజకవర్గాన్ని హింసకు కేంద్రంగా మార్చేందుకు పెద్దిరెడ్డి కుటుంబం ప్రయత్నిస్తోందని టీడీపీ మాజీ మంత్రి, ఎమ్మెల్యే అమర్‌నాథ్‌రెడ్డి ఆరోపించారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి ఘర్షణలు చోటుచేసుకోలేదని గుర్తుచేశారు. గత ఎన్నికల్లోనూ బయటి వ్యక్తులను తీసుకొచ్చి అల్లర్లు సృష్టించారని, గతంలో సుమారు 700 మందిపై కేసులు పెట్టి జైళ్లకు పంపినా, ఆస్తులు ధ్వంసం చేసినా టీడీపీ కార్యకర్తలు వెనక్కి తగ్గలేదని పేర్కొన్నారు. ప్రస్తుతం కూడా హింస ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని విమర్శిస్తూ, ఇలాంటి చర్యలను ప్రజలే తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

బొజ్జల సుధీర్‌రెడ్డి: దాడులను చూస్తూ ఊరుకోం

పుంగనూరులో టీడీపీ కార్యకర్తలపై దాడులు జరిగితే చూస్తూ ఊరుకోబోమని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి హెచ్చరించారు. వాహనాలను ప్రజలపైకి నడిపించారని ఆరోపిస్తూ, మిథున్‌రెడ్డి, అభినయ్‌రెడ్డి వ్యవహారాన్ని ఖండించారు. రాజకీయాల్లో ప్రజల మద్దతు పొందాలి కానీ, దాడులు, రౌడీయిజంతో ఆధిపత్యం చెలాయించకూడదని వ్యాఖ్యానించారు. గత ఐదేళ్లలో ఎన్నికల సమయంలో వైసీపీ హింసకు పాల్పడిందని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ సహనాన్ని చేతకానితనంగా భావించవద్దని హెచ్చరించారు.

వర్ల రామయ్య: ఎన్నికల సంఘానికి ఆధారాలతో ఫిర్యాదు

పుంగనూరు ఘటనపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫొటోలు, వీడియోలతో సహా ఆధారాలు అందించామని టీడీపీ ఎమ్మెల్సీ వర్ల రామయ్య తెలిపారు. ఎంపీ మిథున్‌రెడ్డి 32 కార్లతో నామినేషన్‌ కేంద్రానికి వెళ్లి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని ఆరోపించారు. నిబంధనల ప్రకారం నామినేషన్‌ కేంద్రం వద్ద పరిమిత సంఖ్యలోనే వ్యక్తులకు అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. తమ కార్యకర్తలపై దాడులు చేసి వాహనాలను ధ్వంసం చేశారని, తమిళనాడులోని తిరుత్తణి, కర్ణాటక నుంచి రౌడీషీటర్లను తీసుకొచ్చారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై ఎస్ఈసీ కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ, చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడితే ఉపేక్షించబోమని హెచ్చరించారు.

 

#PunganurClashes #TDP #YSRCP #AndhraPradeshPolitics #AmarnathReddy #BojjalaSudhirReddy #VarlaRamaiah #MithunReddy #MunicipalElections #StateElectionCommission #ElectionCode #ChittoorNews