బద్వేలులో టీడీపీకి కొత్త ఊపు
ఇంఛార్జిగా మంచూరు నియామకం
కడప జిల్లా బద్వేలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంఛార్జిగా మంచూరు సూర్యనారాయణ రెడ్డి నియామకం జరిగినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసి నియోజకవర్గ రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం. బద్వేలులో పార్టీని మరింత బలోపేతం చేసి కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని సీఎం సూచించినట్లు తెలుస్తోంది. మంత్రి నారా లోకేశ్ కూడా స్థానిక నాయకులు, కార్యకర్తలు మంచూరు సూర్యనారాయణ రెడ్డి నాయకత్వంలో సమష్టిగా పనిచేయాలని సూచించినట్లు సమాచారం. ఏపీ టీడీపీ అధ్యక్షుడు కూడా బద్వేలు నియోజకవర్గంలో పార్టీకి మళ్లీ పూర్వవైభవం తీసుకురావడంలో మంచూరు కీలక పాత్ర పోషిస్తారనే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. వైఎస్సార్‌సీపీకి బలమైన కంచుకోటగా భావించే బద్వేలు నియోజకవర్గంలో మంచూరు సూర్యనారాయణ రెడ్డి రాకతో రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. కొత్త నాయకత్వంతో కార్యకర్తల్లో ఉత్సాహం పెరిగిందని, రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ మరింత దూకుడుగా పనిచేసే అవకాశాలు కనిపిస్తున్నాయని స్థానిక నాయకులు అభిప్రాయపడుతున్నారు.












