Home National_news అరెస్ట్ అంటే అదుపులోకి తీసుకున్న క్షణమే!

అరెస్ట్ అంటే అదుపులోకి తీసుకున్న క్షణమే!

24 గంటల నిబంధనపై సుప్రీంకోర్టు సంచలనం.

పోలీసుల అదుపులోకి వచ్చిన క్షణం నుంచే 24 గంటల గడువు ప్రారంభమవుతుందని సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. నిందితుడి శరీరాన్ని తాకి, అతడి స్వేచ్ఛను నిరోధించిన క్షణమే దానిని అరెస్ట్‌గా పరిగణించాలని స్పష్టం చేసింది. అధికారికంగా అరెస్ట్ నమోదు చేసిన సమయం నుంచి కాకుండా, తొలిసారి అదుపులోకి తీసుకున్న సమయం నుంచే న్యాయమూర్తి ముందు హాజరుపరిచే గడువు లెక్కించాలని తేల్చిచెప్పింది. జస్టిస్ ఉజ్జల్ భుయాన్ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం కీలక తీర్పు ఇచ్చింది. ఇప్పటివరకు పోలీసులు విచారణ, సోదాలు, స్వాధీన ప్రక్రియల పేరుతో వ్యక్తులను ముందుగానే అదుపులో ఉంచి, ఆ తర్వాత అధికారిక అరెస్ట్ నమోదు చేస్తున్నారని కోర్టు గుర్తించింది. ఈ విధానం వల్ల అక్రమ నిర్బంధం, చిత్రహింసలు, బలవంతపు వాంగ్మూలాల సేకరణకు అవకాశం ఏర్పడుతోందని తీవ్రంగా వ్యాఖ్యానించింది.

హక్కులకు ప్రత్యేక చట్టాల మినహాయింపు లేదు

రాజ్యాంగంలోని ఆర్టికల్ 22(2) ప్రకారం అరెస్టయిన వ్యక్తిని 24 గంటల్లోగా న్యాయమూర్తి ముందు హాజరుపరచాలి. ఈ గడువు వ్యక్తి స్వేచ్ఛను కోల్పోయిన సమయం నుంచే ప్రారంభమవుతుందని ధర్మాసనం స్పష్టం చేసింది. అరెస్ట్, నిర్బంధం మధ్య తేడా చూపిస్తూ ప్రత్యేక సమయాన్ని సృష్టించడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛకు రక్షణ కల్పించే ఆర్టికల్ 21 హక్కులను ఏ ప్రభుత్వ యంత్రాంగం కూడా తేలిగ్గా తీసుకోరాదని స్పష్టం చేసింది. యూఏపీఏ, పీఎంఎల్ఏ, ఎన్డీపీఎస్ వంటి ప్రత్యేక చట్టాల కింద కూడా ఈ ప్రాథమిక హక్కులను కాలరాయడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. అరెస్ట్ చేసిన ప్రదేశం నుంచి న్యాయమూర్తి ఎదుటకు తీసుకెళ్లేందుకు పట్టే ప్రయాణ సమయం మినహా, మిగిలిన సమయమంతా 24 గంటల గడువులోనే లెక్కించాలని ఆదేశించింది.

అక్రమ నిర్బంధం తేలితే తక్షణ విడుదల!

24 గంటలకు మించి నిర్బంధంలో ఉంచిన వ్యక్తిని న్యాయమూర్తి ముందు హాజరుపరిస్తే వెంటనే విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. నిర్బంధ సమయం వాస్తవ పరిస్థితులకు మించి అసమంజసంగా ఉన్నప్పటికీ, 24 గంటలు పూర్తికాకపోయినా విడుదల చేసే అధికారం న్యాయమూర్తులకు కల్పించింది. నిర్బంధానికి సంబంధించిన అసలు తేదీ, సమయాన్ని న్యాయమూర్తి తప్పనిసరిగా నమోదు చేయాలని స్పష్టం చేసింది. నార్కోటిక్స్ కేసులో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న 18 గంటల తర్వాత అధికారికంగా అరెస్ట్ చేసిన వ్యవహారంపై విచారణ సందర్భంగా ఈ తీర్పు వెలువడింది. త్రిపుర హైకోర్టు బెయిల్ నిరాకరించినప్పటికీ, సుప్రీంకోర్టు నలుగురినీ తక్షణమే విడుదల చేయాలని ఆదేశించింది. పోలీసుల విచారణాధికారానికి హద్దులు విధిస్తూ, పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛకు రాజ్యాంగమే కవచమని ఈ తీర్పు మరోసారి చాటిచెప్పింది.

 

#SupremeCourt #ArrestRules #24HourRule #Article22 #Article21 #PersonalLiberty #IllegalDetention #NDPSAct #BNSS #IndianJudiciary #SupremeCourtJudgment