స్వదేశీ రక్షణ శక్తికి మరో పదును.
హైదరాబాద్‌లో రూపకల్పన.
శత్రువులకు సవాల్.. భారత అమ్ములపొదిలోకి మరో అత్యాధునిక అస్త్రం! దేశ రక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా భారత్ మరో కీలక విజయం సాధించింది. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ‘ప్రళయ్’ క్వాసీ బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. గురువారం ఉదయం 11.10 గంటలకు ఒడిశా తీరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి ఈ ప్రయోగం నిర్వహించారు. సైన్యంలో ప్రవేశపెట్టే ముందు చేపట్టిన వినియోగదారుల మూల్యాంకన పరీక్షల్లో భాగంగా ఈ ప్రయోగం జరిగింది. క్షిపణికి నిర్దేశించిన అన్ని లక్ష్యాలు విజయవంతంగా పూర్తయ్యాయని రక్షణ శాఖ ప్రకటించింది. చండీపూర్‌లోని సమగ్ర పరీక్షా కేంద్రం (ఐటీఆర్) ఏర్పాటు చేసిన వివిధ రేంజ్ పరికరాల ద్వారా సేకరించిన సమాచారం పరీక్ష విజయాన్ని ధ్రువీకరించింది. ఈ విజయంతో ప్రళయ్ క్షిపణిని భారత సాయుధ దళాల్లో ప్రవేశపెట్టేందుకు మార్గం సుగమమైంది.
హైదరాబాద్‌లో రూపకల్పన.. స్వదేశీ తయారీ!
ప్రళయ్ క్షిపణిని హైదరాబాద్‌లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్సీఐ), డీఆర్డీఓకు చెందిన ఇతర ప్రయోగశాలలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. అభివృద్ధి, ఉత్పత్తి భాగస్వాముల్లో ఒకటైన భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) ఈ క్షిపణి వ్యవస్థను తయారు చేసింది. ప్రయోగాన్ని డీఆర్డీఓ ఉన్నతాధికారులు, సైనిక దళాల ప్రతినిధులు, రక్షణ రంగ పరిశ్రమల ప్రతినిధులు ప్రత్యక్షంగా పరిశీలించారు. వినియోగదారుల మూల్యాంకన ప్రక్రియలో భాగంగా ఈ పరీక్ష నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. పరీక్షలో అన్ని నిర్దేశిత లక్ష్యాలు చేరుకోవడంతో సైన్యంలోకి ప్రళయ్ ప్రవేశం మరింత దగ్గరైంది. పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో రూపొందిన ఈ క్షిపణి భారత రక్షణ రంగంలో దేశీయ తయారీ సామర్థ్యానికి నిదర్శనంగా నిలిచింది.
సైనిక పాటవానికి మరింత బలం!
ప్రళయ్ విజయవంతమైన ప్రయోగంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. డీఆర్డీఓ శాస్త్రవేత్తలు, సాయుధ దళాలు, పరిశ్రమల భాగస్వాములను అభినందించారు. అత్యాధునిక సాంకేతికతతో రూపొందిన ఈ క్షిపణి వల్ల భారత సైన్యం సాంకేతిక సామర్థ్యం మరింత పెరుగుతుందని, మారుతున్న ముప్పులను ఎదుర్కొనేందుకు సైనిక దళాల సంసిద్ధత బలోపేతమవుతుందని పేర్కొన్నారు. రక్షణ శాఖ కార్యదర్శి, డీఆర్డీఓ ఛైర్మన్ రాజేశ్ కుమార్ సింగ్ కూడా ఈ విజయానికి కృషిచేసిన బృందాలను అభినందించారు. స్వదేశీ పరిజ్ఞానం.. అత్యాధునిక సాంకేతికత.. విజయవంతమైన పరీక్ష వెరసి భారత రక్షణ వ్యవస్థకు ప్రళయ్ మరో కీలక ఆయుధంగా మారనుంది. దేశ భద్రతకు అవసరమైన క్షిపణి సాంకేతికతలో స్వయం సమృద్ధి సాధించే లక్ష్యానికి ఈ విజయం మరింత ఊతమివ్వనుంది.
#DRDO #PralayMissile #MissileTest #IndianDefence #Hyderabad #ResearchCentreImarat #BDL #IndigenousTechnology #RajnathSingh #DefenceNews











