Home National_news పూణె మర్డర్ కేసులో ట్విస్ట్ ప్రమాదం కాదు.. పక్కా ప్లాన్!

పూణె మర్డర్ కేసులో ట్విస్ట్ ప్రమాదం కాదు.. పక్కా ప్లాన్!

ప్రేమ వెనుక దాగిన హత్య కుట్ర.

ఒక ఫొటో కోసం పోజిచ్చాడు.. అదే చివరి క్షణమైంది. కాబోయే భార్యతో కలిసి సరదాగా లోహగఢ్‌ కోటకు వెళ్లిన కేతన్‌ అగర్వాల్‌.. కొద్ది సేపటికే లోయలో శవంగా కనిపించాడు. తొలుత పోలీసులు కూడా దాన్ని ప్రమాదంగానే భావించారు. కానీ ఒక్క అనుమానం మొత్తం కథనే మార్చేసింది. కేతన్‌ సోదరి ప్రశ్నలు వేయడం మొదలుపెట్టింది. సియా చెప్పిన సమాధానాల్లో తేడాలు కనిపించాయి. దర్యాప్తు ముందుకు వెళ్లేకొద్దీ ప్రేమకథ వెనుక మరో కథ బయటపడింది. కాబోయే భార్య సియా గోయల్‌.. ఆమె ప్రియుడు చేతన్‌ చౌదరి.. ఇప్పుడు వారి స్నేహితుడు రితేష్‌ హంగే. ముగ్గురి పేర్లు హత్య కేసులో వినిపిస్తున్నాయి. కేతన్‌ను తొలగించేందుకు ముందే ప్లాన్‌ చేశారా? లోహగఢ్‌ పర్యటన ప్రమాదం కాదా? బాలి ప్రయాణంలో పాస్‌పోర్ట్‌ మాయం కావడం కూడా అదే కుట్రలో భాగమా? ఫోన్‌ చాట్స్‌, వేలాది కాల్స్‌, సీసీటీవీ దృశ్యాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. అసలు ఈ ప్రేమ వ్యవహారం ఎక్కడ మొదలైంది? కేతన్‌ అడ్డంకిగా ఎలా మారాడు? చివరకు అతడిని లోహగఢ్‌ లోయలోకి నెట్టేంత దారుణ నిర్ణయానికి ఎలా వచ్చారు? ఈ కేసులో బయటపడుతున్న ప్రతి ఆధారం.. ఇది ప్రమాదం కాదని, పక్కా కుట్రేనన్న అనుమానాలను మరింత బలపరుస్తోంది.


పుణెలోని లోహగఢ్‌ కోట వద్ద కేతన్‌ అగర్వాల్‌ హత్య కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. కాబోయే భార్య సియా గోయల్‌ తన ప్రియుడు చేతన్‌ చౌదరితో కలిసి కేతన్‌ను హత్య చేసినట్లు ఇప్పటికే పోలీసులు ఆరోపిస్తున్నారు. తాజాగా చేతన్‌ స్నేహితుడు రితేష్‌ హంగేను కూడా అరెస్టు చేయడంతో కుట్ర మరింత విస్తరించినట్లు తెలుస్తోంది. జూన్‌ 18న కేతన్‌ తన కాబోయే భార్య సియాతో కలిసి లోహగఢ్‌ కోటకు ట్రెక్కింగ్‌కు వెళ్లాడు. అక్కడి నుంచి లోయలో పడి చనిపోయినట్లు తొలుత కేసు నమోదైంది. అయితే కేతన్‌ సోదరికి ఈ ఘటనపై మొదటి నుంచే అనుమానాలు ఉన్నాయి. అంత్యక్రియల తర్వాత నాలుగు రోజులకు సియా కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చినప్పుడు ఆమె చెప్పిన వివరాల్లో పొంతన లేకపోవడం అనుమానాలను మరింత పెంచింది. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించి ప్రమాదం కథపై సమగ్ర దర్యాప్తు చేయాలని కోరారు.

మొబైల్‌ చాట్స్‌తో బయటపడిన రితేష్‌ పాత్ర

దర్యాప్తులో సియా, చేతన్‌ మధ్య ఉన్న సంబంధం బయటపడింది. పోలీసులు సేకరించిన సీసీటీవీ ఫుటేజీ, సాంకేతిక ఆధారాలను పరిశీలించగా వేసవి వేడిలోనూ హుడీ ధరించి కేతన్‌ కదలికలను అనుసరిస్తున్న వ్యక్తి కనిపించాడు. ఆ వ్యక్తే చేతన్‌గా పోలీసులు గుర్తించారు. జనవరి నుంచి జూన్‌ మధ్య సియా, చేతన్‌ 2,000కుపైగా సార్లు మాట్లాడినట్లు, మొత్తం 238 గంటలపాటు ఫోన్‌ సంభాషణలు జరిగినట్లు దర్యాప్తులో తేలింది. తాజాగా రితేష్‌ ఫోన్‌ను ఫోరెన్సిక్‌గా పరిశీలించగా కీలక చాట్స్‌ బయటపడ్డాయి. కేతన్‌ను కోటపై నుంచి తోసేయడం, హత్య తర్వాత ఆధారాలను ఎలా నాశనం చేయాలన్న అంశాలపై చర్చలు జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. కేతన్‌ను తొలుత గాయపరిచి చేతులు, కాళ్లు విరగ్గొట్టి అనంతరం చంపాలన్న ప్రణాళిక గురించి కూడా రితేష్‌కు తెలుసని అధికారులు తెలిపారు. హత్య అనంతరం చేతన్‌ రితేష్‌కు ఫోన్‌ చేసి ఘటన గురించి చెప్పినట్లు పోలీసులు పేర్కొన్నారు. సెప్టెంబర్‌ 12 వరకు రితేష్‌ను పోలీస్‌ కస్టడీకి కోర్టు అనుమతించింది.

బాలి ప్రయాణం రద్దు.. 12 రోజుల్లోనే హత్య

కేతన్‌ హత్యకు ముందు జరిగిన మరో ఘటనపైనా పోలీసులు దృష్టి సారించారు. జూన్‌ 6న సియా, కేతన్‌ ప్రీ వెడ్డింగ్‌ ఫొటోషూట్‌ కోసం బాలి వెళ్లాల్సి ఉంది. అయితే ముంబై విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత కేతన్‌ పాస్‌పోర్ట్‌ మాత్రమే కనిపించకుండా పోయింది. మిగతా అందరి పాస్‌పోర్టులు, నగదు, కార్డులు సురక్షితంగా ఉన్నాయని కేతన్‌ తండ్రి తెలిపారు. అంతకుముందు ఫుడ్‌ మాల్‌ వద్ద సియా తన మొబైల్‌ తీసుకునేందుకు కారులోకి తిరిగి వెళ్లిందని ఆయన చెప్పారు. దీంతో పాస్‌పోర్ట్‌ అదృశ్యం కావడం వెనుక కూడా కుట్ర ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆ ప్రయాణం రద్దైన కేవలం 12 రోజులకే లోహగఢ్‌లో కేతన్‌ మృతి చెందడం కేసులో ఈ ఘటనకు ప్రాధాన్యం పెంచింది. కేతన్‌ సియాతో కలిసి మే 31, జూన్‌ 14, జూన్‌ 18 తేదీల్లో మూడుసార్లు లోహగఢ్‌కు వెళ్లాడు. చివరి పర్యటనలోనే అతడు ప్రాణాలు కోల్పోయాడు. ప్రేమ సంబంధానికి అడ్డుగా మారాడనే కారణంతో కేతన్‌ను తొలగించేందుకు కుట్ర జరిగిందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

 

#KetanAgarwal #LohagadMurderCase #PuneMurderCase #LohagadFort #SiyaGoyal #ChetanChaudhary #RiteshHange #MurderConspiracy #PuneCrimeNews #KetanAgarwalDeath #BaliTrip #PassportMystery #CCTVEvidence #CrimeNews