Home AP రాజధాని పనులకు పవన్‌కు ఆహ్వానం ఆహ్వానించిన మున్సిపల్ మంత్రి నారాయణ

రాజధాని పనులకు పవన్‌కు ఆహ్వానం ఆహ్వానించిన మున్సిపల్ మంత్రి నారాయణ



ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ బుధవారం మంగళగిరిలో కలిశారు. గురువారం అమరావతిలో జరగనున్న కీలక అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి పవన్‌ను ఆహ్వానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్-2, రెండు స్టీల్ బ్రిడ్జిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నివాస సముదాయాలకు సంబంధించిన పనులు ప్రారంభం కానున్నాయని నారాయణ వివరించారు. రాజధానిలో మౌలిక వసతుల పనులు వేగంగా సాగుతున్న తీరుపై పవన్‌ నారాయణను అభినందించారు.

విశాఖలో జాతీయ స్థాయి ఏనుగుల దినోత్సవం

అయితే గురువారం ముందుగా నిర్ణయించిన కార్యక్రమం కారణంగా అమరావతి ప్రారంభోత్సవానికి తాను హాజరు కాలేకపోవచ్చని పవన్ తెలిపారు. విశాఖపట్నంలో ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా జాతీయ స్థాయి కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉందని చెప్పారు. రాష్ట్ర అటవీ శాఖ ఆధ్వర్యంలో ఈ వేడుక నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో తొలిసారిగా జాతీయ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. తన ఆహ్వానం మేరకు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ కూడా కార్యక్రమానికి హాజరవుతున్నారని పవన్ పేర్కొన్నారు.

రాజధాని అభివృద్ధిపై పవన్ ఆకాంక్ష

అమరావతి అభివృద్ధిలో సీడ్ యాక్సెస్ రోడ్ కీలకమైన మౌలిక వసతి ప్రాజెక్టుగా మారుతుందని పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ ప్రాజెక్టుతో రాజధాని ప్రాంతంలో రాకపోకలు, అభివృద్ధి మరింత వేగం పుంజుకోవాలని ఆకాంక్షించారు. ఒకవైపు అమరావతిలో కీలక నిర్మాణాలకు శ్రీకారం చుడుతుండగా.. మరోవైపు విశాఖలో జాతీయ స్థాయి పర్యావరణ కార్యక్రమానికి పవన్ హాజరవుతున్నారు. రాజధాని నిర్మాణం, పర్యావరణ పరిరక్షణ.. రెండు అంశాలకు ఒకే రోజు ప్రాధాన్యం దక్కడం తాజా భేటీకి ప్రత్యేకతగా నిలిచింది.

 

#PawanKalyan #Amaravati #AmaravatiDevelopment #PonguruNarayana #APCapital #CapitalDevelopment #SeedAccessRoad #AmaravatiInfrastructure #ChandrababuNaidu #SteelBridges #APPolitics #AndhraPradesh #Visakhapatnam #WorldElephantDay #BhupenderYadav #APNews