Home Telangana వీరప్పన్‌ను అటవీశాఖ మంత్రిని చేస్తే

వీరప్పన్‌ను అటవీశాఖ మంత్రిని చేస్తే

సీఎం రేవంత్‌పై కేటీఆర్‌ నిప్పులు!
భూముల అమ్మకాల తీవ్ర ఆరోపణలు.

“వీరప్పన్‌ను అటవీశాఖ మంత్రిని చేస్తే ఎలా ఉంటుందో.. భూములు అమ్మే బ్రోకర్‌ రేవంత్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేస్తే అలా ఉంది” అంటూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని హైదర్‌నగర్‌ డివిజన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు దామోదర్‌రెడ్డి తన అనుచరులతో కలిసి బీఆర్‌ఎస్‌లో చేరిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కొత్తగా పార్టీలో చేరిన వారికి గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. మియాపూర్‌ భూముల వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ.. గతంలో కాంగ్రెస్‌ హయాంలో కబ్జాకు గురైన 550 ఎకరాల భూమిని న్యాయపోరాటం ద్వారా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కాపాడిందని తెలిపారు. ప్రముఖ న్యాయవాది వైద్యనాథన్‌ ద్వారా కేసు వాదించామని, ఇటీవల సుప్రీంకోర్టు ఆ భూములు ప్రభుత్వానివేనని తీర్పు ఇచ్చిందని గుర్తుచేశారు.

అమ్మకాలపై విమర్శలు.. అభివృద్ధిపై ప్రశ్నలు

సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించి ఆ భూములను అమ్ముతామని ప్రకటించారని కేటీఆర్‌ విమర్శించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో హైదరాబాద్‌లో ఒక్క నిర్మాణమైనా చేపట్టిందా అని ప్రశ్నించారు. కేసీఆర్‌ హయాంలో లక్షలాది డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు నిర్మించామని గుర్తుచేశారు. పదవుల కోసం ఢిల్లీ నాయకుల వద్ద తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారని కాంగ్రెస్‌, బీజేపీ నేతలను దుయ్యబట్టారు. కేంద్ర మంత్రి బండి సంజయ్‌ అమిత్‌ షా వద్ద బౌన్సర్‌లా వ్యవహరిస్తున్నారని, ప్రియాంక గాంధీ సమక్షంలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్‌రెడ్డిని సైతం పక్కకు నెట్టేశారని వ్యాఖ్యానించారు.

ప్రాజెక్టులపై రాజకీయ రగడ

తెలంగాణకు అమిత్‌ షా వచ్చి చేతులు ఊపి వెళ్లడం తప్ప ఏమిచ్చారని కేటీఆర్‌ ప్రశ్నించారు. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులపై కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఉన్న కక్షతో దాదాపు వెయ్యి టీఎంసీల నీటిని వృథాగా దిగువకు వదిలేశారని ఆరోపించారు. కరువు వచ్చినప్పుడే కాళేశ్వరం ప్రాజెక్టు విలువ తెలుస్తుందని కేసీఆర్‌ గతంలో చెప్పారని గుర్తుచేశారు. నీటిని ఎత్తిపోసి సాగుకు అందించాలని సూచించినా ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. ప్రస్తుతం తెలంగాణలో నెలకొన్న నీటి ఎద్దడి ప్రకృతి సృష్టించినది కాదని, కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యంతో వచ్చిన కరువని కేటీఆర్‌ ఆరోపించారు.

 

#KTR #KTRVsRevanthReddy #RevanthReddy #MiyapurLandIssue #MiyapurLands #BRS #TelanganaPolitics #CongressGovernment #SupremeCourt #KaleshwaramProject #PalamuruRangareddy #Hyderabad