ఇజ్రాయెల్‌పై గతంలో జరిగిన అక్టోబర్ 7 తరహా దాడికంటే మరింత విస్తృతమైన దాడికి ఇరాన్ ప్రణాళికలు సిద్ధం చేస్తోందన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. ఇజ్రాయెల్ నిఘా వర్గాల అంచనాల ప్రకారం.. ఇరాన్ తనకు అనుకూలంగా ఉన్న ప్రాంతీయ మిలిటెంట్ నెట్‌వర్క్‌లను ఒకే వ్యూహం కింద సమన్వయం చేసేందుకు ప్రయత్నిస్తోంది. హెజ్బొల్లా, హౌతీలు, హమాస్, ఇరాక్-సిరియాల్లోని ఇరాన్ అనుకూల మిలీషియాలను ఒకేసారి రంగంలోకి దించేలా ప్రణాళిక సాగుతున్నట్లు జెరూసలెం పోస్ట్ నివేదించింది. అక్టోబర్ 7 దాడి సమయంలో హమాస్ ఒంటరిగానే దాడి చేయగా.. హెజ్బొల్లా, ఇరాన్ ముందుగానే పూర్తి వివరాలు తెలుసుకోలేదని అమెరికా, ఇజ్రాయెల్ అంచనాలు పేర్కొన్నాయి. దీంతో ఆ దాడి సమయంలో ఊహించిన స్థాయిలో సమన్వయంతో కూడిన ప్రాంతీయ దాడి జరగలేదు.
అప్పటి లోపాలను సరిచేసే ప్రయత్నం
ఇప్పుడు ఆ లోపాలను అధిగమించేందుకు ఇరాన్ ప్రయత్నిస్తోందని ఇజ్రాయెల్ నిఘా వర్గాలు చెబుతున్నాయి. గతంలో ఒక ప్రాంతంలో జరిగే దాడి మిగతా మిత్ర బలగాలను యుద్ధంలోకి లాగుతుందన్న అంచనాకు భిన్నంగా.. అన్ని ప్రాంతాల్లో ఒకేసారి ఒత్తిడి పెంచే సమన్వయ వ్యూహాన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం. ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్కు చెందిన ఖుద్స్ ఫోర్స్ అధికారులు హెజ్బొల్లా, హౌతీలు, ఇరాక్ మిలీషియా కమాండర్లతో విస్తృత చర్చలు జరిపినట్లు నివేదికలు చెబుతున్నాయి. సమావేశాలు, కాన్ఫరెన్స్ కాల్స్ ద్వారా దాడి సామర్థ్యాలను పెంచడం, పరస్పర సమన్వయాన్ని బలోపేతం చేయడంపై చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ రక్షణ దళాలు కూడా హమాస్, హెజ్బొల్లా మధ్య ఇరాన్ సహకారంతో మళ్లీ సంబంధాలు బలపడుతున్న సంకేతాలను గుర్తించినట్లు సమాచారం.
మళ్లీ సైనిక శక్తిని పెంచుతున్న ఇరాన్
ఇదంతా జరుగుతున్న సమయంలో గత ఘర్షణల్లో దెబ్బతిన్న తన సైనిక సామర్థ్యాలను ఇరాన్ తిరిగి బలోపేతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇరాన్ అనుకూల వర్గాల మధ్య వ్యక్తిగత సంబంధాలు, సైనిక సహకారం, శిక్షణ కార్యక్రమాలు పెరిగినట్లు ఇజ్రాయెల్ నిఘా అంచనాలు చెబుతున్నాయి. దీని ద్వారా ఒకే ప్రాంతంలో పరిమిత ఘర్షణకు బదులుగా.. ఇజ్రాయెల్‌పై అనేక దిశల నుంచి ఒత్తిడి పెంచే సామర్థ్యాన్ని సిద్ధం చేయాలన్నది ఇరాన్ లక్ష్యంగా కనిపిస్తోంది. అయితే ఈ నివేదికల్లో పేర్కొన్న ప్రణాళికలు భవిష్యత్తులో అమలవుతాయా లేదా అన్నది స్పష్టంగా తెలియదు. నిజంగా ఇలాంటి సమన్వయ దాడి జరిగితే పశ్చిమాసియా సంక్షోభం మరింత విస్తరించే ప్రమాదం ఉందన్న ఆందోళన మాత్రం పెరుగుతోంది.
#Iran #Israel #IranIsraelConflict #IranAttackPlan #IsraelIranTensions #October7 #Hezbollah #Houthis #Hamas #QudsForce #IRGC #IranBackedMilitias #IsraeliIntelligence #IDF #MiddleEastCrisis #WestAsia #IranMilitary #RegionalConflict











