Home AP 2027 గోదావరి పుష్కరాలకు భారీ ఏర్పాట్లు!

2027 గోదావరి పుష్కరాలకు భారీ ఏర్పాట్లు!

10 కోట్ల మంది భక్తుల రాకపై అంచనా.
రూ.3,723 కోట్లతో అభివృద్ధి పనులు.

2027 గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ కార్యాచరణ సిద్ధం చేస్తోంది. జూన్‌ 26 నుంచి జూలై 7 వరకు జరిగే పుష్కరాలకు సుమారు 10 కోట్ల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించి ఏర్పాట్లపై కీలక ఆదేశాలు జారీ చేశారు. 22 శాఖల పరిధిలో రూ.3,723.69 కోట్ల అంచనా వ్యయంతో 4,862 పనులు ప్రతిపాదించారు. వీటిలో రూ.2,051.70 కోట్ల విలువైన 2,260 పనులకు ఇప్పటికే పరిపాలనా అనుమతులు లభించాయి. రూ.649.70 కోట్లతో 659 పనులు ప్రారంభం కాగా, రూ.25.53 కోట్ల విలువైన 69 పనులు పూర్తయ్యాయి. గోదావరి పరివాహక ప్రాంతంలోని 440 ఘాట్ల వద్ద తాగునీరు, విద్యుత్‌, పారిశుధ్యం, మరుగుదొడ్లు, వసతి సదుపాయాలు కల్పించనున్నారు. వీటి కోసం రూ.464 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

రవాణాకు ప్రత్యేక బస్సులు, రైళ్లు

భక్తుల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ రహదారులను అభివృద్ధి చేయడంతో పాటు 268.12 కిలోమీటర్ల మేర బారికేడ్లు ఏర్పాటు చేయనున్నారు. 4,000 ప్రత్యేక బస్సులు, 649 గ్రీన్‌ బస్సులు నడిపేందుకు ప్రణాళిక రూపొందించారు. రైల్వే శాఖ 1,560 ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకురానుంది. రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్‌లో అదనపు ప్లాట్‌ఫారం, ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నారు. పుష్కరాల నిర్వహణను పర్యవేక్షించేందుకు ఆధునిక కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఏర్పాటు చేయనున్నారు. దేశవిదేశాల నుంచి వచ్చే భక్తులకు సమాచారం అందించేందుకు 135 భాషల్లో సేవలందించే ఏఐ చాట్‌బాట్‌ తీసుకురానున్నారు. వైద్య సేవల కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో అదనంగా 100 పడకలు ఏర్పాటు చేసి, అంబులెన్సులు, వైద్య బృందాలను సిద్ధం చేయనున్నారు.

పోలవరం, ధవళేశ్వరం పనులకు గడువు

సర్‌ ఆర్థర్‌ కాటన్‌ బ్యారేజీ ఆధునికీకరణ పనులను 2027 ఏప్రిల్‌ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పోలవరం ప్రాజెక్టు పనులను కూడా పుష్కరాలకు ముందే పూర్తి చేసి ప్రారంభించేలా చర్యలు చేపడుతున్నారు. రాజమహేంద్రవరం నుంచి పోలవరం వరకు 40 కిలోమీటర్ల జలమార్గంలో ఆరు ఫ్లోటింగ్‌ పంటూన్లు ఏర్పాటు చేయనున్నారు. పుష్కరాల నిర్వహణలో యువత, మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. విధుల్లో పాల్గొనే సిబ్బందికి ముందుగానే శిక్షణ ఇవ్వాలని, శాఖల మధ్య సమన్వయం పెంచాలని ఆదేశించారు. పనుల పురోగతి, నిధుల వినియోగ వివరాలను జిల్లాల వారీగా ప్రత్యేక పోర్టల్‌లో నమోదు చేయాలని స్పష్టం చేశారు.

పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యం

గోదావరి జలాల నాణ్యతను కాపాడటంతో పాటు ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించాలని, వ్యర్థాలను శాస్త్రీయంగా నిర్వహించాలని సీఎం సూచించారు. పునరుత్పాదక ఇంధన వినియోగంపైనా దృష్టి పెట్టాలని తెలిపారు. పుష్కరాల సందర్భంగా గోదావరి నదీ హారతి, సామూహిక కూచిపూడి నృత్య ప్రదర్శనలు, భారీ దీపాలంకరణ, గోదావరి ముగ్గు, సామూహిక యోగా వంటి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతితో పాటు మెరుగైన రవాణా, భద్రత, వైద్య సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఏర్పాట్లను ముందుకు తీసుకెళ్తోంది.

 

#GodavariPushkaralu2027 #GodavariPushkaralu #AndhraPradesh #ChandrababuNaidu #Rajahmundry #GodavariRiver #PushkaraluArrangements #PolavaramProject #DowleswaramBarrage #Pilgrims