జలాశయాల భద్రతకు ప్రాధాన్యమన్న సీఎం.
48 గంటల్లో పునరుద్ధరణ పనులు పూర్తి చేయండి.
తుపాను ముప్పుపై సమీక్ష, కలెక్టర్లకు ఆదేశాలు.
మురసు తుపాను ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. సోమవారం ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సమీక్షలో భారీ వర్షాలు, ఈదురుగాలుల నేపథ్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఏపీ తీరంపై మురసు ప్రభావం గతంలో వచ్చిన అర్ణబ్ తుపానుతో పోలిస్తే తక్కువగా ఉండొచ్చని అంచనాలు చెబుతున్నాయని తెలిపారు. దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో కురిసే వర్షాలను సమర్థంగా వినియోగించుకుని జలాశయాలు, చెరువులు, కుంటలను నింపాలని సూచించారు. నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల పరివాహక ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరే అవకాశం ఉందని అధికారులు వివరించారు. తుపాను ప్రభావితమయ్యే ఆరు జిల్లాల్లోని 6,800 చెరువుల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు.
విద్యుత్ వ్యవస్థకు ముందస్తు రక్షణ
తుపాను గాలులకు విద్యుత్ స్తంభాలు దెబ్బతినే ప్రమాదం ఉండటంతో ముందుగానే మరమ్మతు బృందాలను సిద్ధం చేయాలని చంద్రబాబు సూచించారు. శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు ఇప్పటికే 31 వేల విద్యుత్ స్తంభాలను క్షేత్రస్థాయికి పంపినట్లు అధికారులు తెలిపారు. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మరో 8 వేల స్తంభాలు దెబ్బతినే అవకాశం ఉందని అంచనా వేశారు. విద్యుత్ పునరుద్ధరణ కోసం చెన్నై నుంచి అదనంగా వెయ్యి మంది సిబ్బంది వస్తున్నారని వివరించారు. వారిని నెల్లూరు, ప్రకాశంతో పాటు అవసరమైన జిల్లాల్లో నియమించాలని సీఎం ఆదేశించారు. పల్నాడు జిల్లాలో అత్యధికంగా 30 సెంటీమీటర్లు, ప్రకాశంలో 24, మార్కాపురంలో 19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. కృష్ణా, గుంటూరు, ఏలూరు, నెల్లూరు జిల్లాల్లోనూ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని తెలిపారు.
చెరువులకు గండ్లు పడకుండా చర్యలు
జలధార కార్యక్రమం కింద చేపట్టిన పనులను వినియోగించుకోవాలని, వర్షపు నీటిని సాధ్యమైనంత ఎక్కువగా నిల్వ చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. నీటి వినియోగదారుల సంఘాలను క్రియాశీలం చేసి చెరువుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మురుగు కాలువల్లో పూడిక పేరుకుపోవడంతో పంట పొలాలు నీట మునిగే ప్రమాదం ఉందని, ముందుగానే అడ్డంకులు తొలగించాలని స్పష్టం చేశారు. అర్ణబ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో చాలావరకు సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని అధికారులు వివరించగా, మిగిలిన పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలని సీఎం సూచించారు. తుపాను అనంతర విద్యుత్, ఇతర అత్యవసర సేవలను 48 గంటల్లో పునరుద్ధరించాలని ఆదేశించారు. పంటల బీమా పరిహారం, ఇన్పుట్ సబ్సిడీ చెల్లింపులను కూడా వేగంగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
#CycloneMurasu #ChandrababuNaidu #AndhraPradesh #CycloneAlert #CyclonePreparedness #APGovernment #ReservoirSafety #ElectricityRestoration #HeavyRainfall #NagarjunaSagar #PulichintalaProject #APWeather











