Home AP సంక్షేమ పథకాలకు ఓటరు కార్డే ఆధారం!

సంక్షేమ పథకాలకు ఓటరు కార్డే ఆధారం!


ఆధార్‌కు స్వస్తి.. ఇక ఈపీఐసీతోనే లబ్ధిదారుల గుర్తింపు.

సంక్షేమ పథకాల లబ్ధిదారుల గుర్తింపులో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పునకు సిద్ధమవుతోంది. ఇప్పటివరకు ఆధార్‌ ఆధారంగా జరుగుతున్న నగదు చెల్లింపులకు బదులుగా ఇకపై ఓటరు గుర్తింపు కార్డు (ఈపీఐసీ)ను ప్రామాణికంగా తీసుకోవాలని భావిస్తోంది. ఓటరు కార్డుతో పాటు బయోమెట్రిక్‌ ధ్రువీకరణను తప్పనిసరి చేయాలని నిర్ణయించింది. నకిలీ లబ్ధిదారులను ఏరివేసి, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అర్హులకే అందించడమే లక్ష్యమని కేంద్ర మంత్రి లల్లన్‌ సింగ్‌ చెబుతున్నారు. అయితే ఓటరు జాబితాలపై రాజకీయ వివాదాలు కొనసాగుతున్న వేళ ఈ ప్రతిపాదన కొత్త చర్చకు తెరలేపుతోంది.



కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల గుర్తింపు విధానంలో కీలక మార్పు రానుంది. ఇకపై ఆధార్‌ కార్డుకు బదులుగా ఓటరు గుర్తింపు కార్డు (ఈపీఐసీ) నంబర్‌ను ప్రామాణికంగా తీసుకోవాలని కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి రాజీవ్‌ రంజన్‌ సింగ్‌ అలియాస్‌ లల్లన్‌ సింగ్‌ వెల్లడించారు. ఓటరు కార్డుతో పాటు బయోమెట్రిక్‌ ధ్రువీకరణ తప్పనిసరి చేసి, దాని ఆధారంగానే సంక్షేమ పథకాల నగదు చెల్లింపులు చేపడతామని నవంబర్‌ 3న స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆధార్‌ ఆధారంగా లబ్ధిదారులకు చెల్లింపులు జరుగుతున్నాయని, ఇకపై అది ప్రధాన గుర్తింపు పత్రంగా ఉండబోదని తెలిపారు. గ్యాంగ్‌టక్‌లో సిక్కిం కోఆపరేటివ్‌ మిల్క్‌ ప్రొడ్యూసర్స్‌ యూనియన్‌ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన ఈ విషయాలు వెల్లడించారు. గత శుక్రవారం ఢిల్లీలో జరిగిన మంత్రిత్వ శాఖ వర్క్‌షాప్‌లోనూ ఇదే ప్రతిపాదనను ప్రస్తావించారు.

అనర్హులకు చెక్‌.. పారదర్శకతే లక్ష్యం..

ఆధార్‌ కార్డులను సులభంగా పొందే అవకాశం ఉండటంతో నకిలీ లబ్ధిదారులు చేరే ప్రమాదం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు. కొన్ని ప్రాంతాల్లో ఐదు నిమిషాల్లోనే ఆధార్‌ కార్డు పొందవచ్చంటూ వ్యాఖ్యానించారు. ఈపీఐసీ నంబర్‌తో బయోమెట్రిక్‌ వివరాలను జతచేయడం ద్వారా నిజమైన లబ్ధిదారులను గుర్తించవచ్చని, అనర్హుల పేర్లను తొలగించి ప్రభుత్వ సాయం అర్హులకే అందించవచ్చని పేర్కొన్నారు. మరోవైపు, ఓటరు జాబితాల్లో పేర్ల తొలగింపుపై ప్రతిపక్షాలు చేస్తున్న ‘ఓటు చోరీ’ ఆరోపణల నేపథ్యంలో ఈ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. 2026–31 కాలానికి 16వ ఆర్థిక సంఘం దేశవ్యాప్తంగా 2.55 లక్షల పంచాయతీలు, సంప్రదాయ స్థానిక సంస్థలకు మొత్తం రూ.4,35,236 కోట్ల నిధుల మంజూరును సిఫారసు చేసింది.

 

#VoterID #EPIC #Aadhaar #WelfareSchemes #LallanSingh #BiometricVerification #BeneficiaryIdentification #DBT #CentralGovernment #PanchayatFunding