Home AP ఆరోగ్య ఆంధ్ర, ఆనంద ఆంధ్ర!

ఆరోగ్య ఆంధ్ర, ఆనంద ఆంధ్ర!

2035 నాటి లక్ష్యమిదేనన్న మంత్రి.
ఉపాసన ప్రశ్నలు.. లోకేశ్ సమాధానాలు.

2035 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను హెల్తీ, వెల్దీ, హ్యాపీ స్టేట్‌గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. యువతకు ఉద్యోగాలు కల్పించడంతోనే ప్రభుత్వ బాధ్యత పూర్తికాదని, వారు ఆరోగ్యంగా, సంతోషంగా, ఆత్మవిశ్వాసంతో జీవించే వాతావరణం కల్పించాలని స్పష్టం చేశారు. విశాఖపట్నంలో 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సులో భాగంగా నిర్వహించిన ‘యంగ్ ఆంధ్ర.. థ్రైవింగ్ ఆంధ్ర’ ముఖాముఖి కార్యక్రమంలో అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్‌పర్సన్, యూఆర్ లైఫ్ వ్యవస్థాపకురాలు ఉపాసన కొణిదెల వ్యాఖ్యాతగా వ్యవహరించారు. మహిళల ఆరోగ్యం, ఉపాధి, ఆర్థిక స్వావలంబన, కుటుంబ బాధ్యతలు, యువత భవిష్యత్తుపై ఆమె సంధించిన ప్రశ్నలు చర్చకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములం కావడం గర్వంగా ఉందని ఉపాసన పేర్కొనగా, ప్రజల ఆరోగ్యంపై ముందస్తు అవగాహన పెంచడం, షుగర్, బీపీ వంటి సమస్యలను ప్రారంభంలోనే గుర్తించడం అవసరమని లోకేశ్ వివరించారు.

మహిళల ఆరోగ్యం.. ఉపాసన ప్రత్యేక దృష్టి

మహిళలు పిల్లల సంరక్షణ కోసం ఉద్యోగాలు మానేయాల్సిన పరిస్థితి మారాలని ఉపాసన బలంగా ప్రస్తావించారు. మహిళలకు సొంత ఆదాయం ఉంటే ఆర్థిక భద్రతతో పాటు నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ లభిస్తుందని ఆమె వివరించారు. దీనిపై లోకేశ్ స్పందిస్తూ పరిశ్రమల్లో మహిళలకు మరిన్ని ఉద్యోగాలు కల్పించాలని, పనిచేసే చోటే పిల్లల సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. అంగన్‌వాడీల సేవలను కూడా వినియోగించుకోవచ్చన్నారు. కుటుంబంలో ఇంటి పనులు, పిల్లల పెంపకం భార్యాభర్తలు సమానంగా పంచుకోవాలని చెప్పారు. మహిళల రక్తహీనత, ఆరోగ్య సమస్యలపై ఉపాసన ప్రత్యేకంగా ప్రస్తావించారు. కళాశాల విద్య పూర్తిచేసిన యువతులు తమ శరీరం, ఆరోగ్యం, ఫెర్టిలిటీ పరీక్షలపై అవగాహన పెంచుకోవాలని ఆమె సూచించారు. ప్రపంచవ్యాప్తంగా 58 లక్షల మంది నర్సుల అవసరం ఉందని, ఏపీ యువతకు విదేశాల్లోనూ ఉపాధి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. జపనీస్, జర్మన్ భాషల్లో శిక్షణ పొందితే అంతర్జాతీయ ఉద్యోగాలకు మార్గం సుగమమవుతుందని లోకేశ్ చెప్పారు. మహిళా సాధికారతపై ఉపాసన సూచనలు తమకు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

లక్షలాది మంది పారిశ్రామికవేత్తలే లక్ష్యం

ఆంధ్రప్రదేశ్‌లో వంద యూనికార్న్ కంపెనీల కంటే లక్షలాది మంది సొంతంగా వ్యాపారాలు చేసుకునే పారిశ్రామికవేత్తలు తయారుకావడమే తన లక్ష్యమని లోకేశ్ వెల్లడించారు. 1.30 కోట్ల మందికి సొంతంగా ఉపాధి కల్పించే అవకాశాలు సృష్టించాలని, ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలని ఆకాంక్షించారు. పీ4 కార్యక్రమం ద్వారా సహాయం పొందిన ఓ మహిళ సొంతంగా ఇటుకల ఫ్యాక్టరీ ఏర్పాటు చేసుకుని నెలకు దాదాపు రూ.లక్ష సంపాదిస్తున్న ఉదాహరణను వివరించారు. ఏఐని ఉపయోగించుకోవాలని, అయితే తుది నిర్ణయాలు మనమే తీసుకోవాలని యువతకు సూచించారు. మహిళలను గౌరవించడం, క్రమశిక్షణ, పని పట్ల తపన ప్రతి యువకుడికి అవసరమైన లక్షణాలని చెప్పారు. ఉపాసన కూడా యువతకు గౌరవప్రదమైన ఉపాధి, మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించడమే నిజమైన అభివృద్ధి అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులు, పరిశ్రమలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని లోకేశ్ పేర్కొంటూ, 2035 నాటికి దేశంలోనే అత్యంత సంతోషకరమైన రాష్ట్రంగా ఏపీని నిలబెడతామని ధీమా వ్యక్తం చేశారు. లక్ష్యంపై నమ్మకం, సాధించాలనే తపన ఉంటే యువత ఏదైనా సాధించగలరని పిలుపునిచ్చారు.

 

#NaraLokesh #UpasanaKonidela #AndhraPradesh #Vision2035 #HealthyAndhra #HappyAndhra #CIIPartnershipSummit2026 #WomenEmpowerment #WomensHealth #YouthEmployment #Entrepreneurship #FinancialIndependence #P4Initiative #YouthDevelopment