తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ అంతర్గత వ్యవహారాలు మరోసారి హాట్‌టాపిక్‌గా మారాయి. తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కవిత తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. పార్టీ నేతలపై తీవ్ర విమర్శలు చేసిన ఆమె, తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సందర్భాన్ని ప్రస్తావిస్తూ పలు ప్రశ్నలు సంధించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలతో సన్నిహితంగా ఉంటూ, మరోవైపు పార్టీ అధినేత కేసీఆర్‌ను బహిరంగంగా విమర్శించడం ఏ విధంగా పార్టీ ప్రయోజనాలకు అనుకూలమని ప్రశ్నించారు. గతంలో తీసుకున్న నిర్ణయాలు, పార్టీ వైఫల్యాలు, నేతల వ్యవహారశైలిపై కవిత ఘాటుగా స్పందించారు. ఇటీవల బీఆర్ఎస్ సమావేశంలో రైతు, మహిళల పట్ల జరిగినట్టు చెబుతున్న అవమానకర వ్యాఖ్యలను కూడా ఆమె ప్రస్తావించారు. పార్టీని కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని, వ్యక్తిగత వైఫల్యాలను అధినేతపై నెట్టడం సరికాదని కవిత స్పష్టం చేశారు. తాను ఆధారాలు లేకుండా మాట్లాడనని చెబుతూ ప్రత్యర్థులకు సవాల్ విసిరారు.
కవిత సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కవిత బీఆర్ఎస్ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పార్టీలో అవినీతిపై ప్రశ్నించినందుకే తనను గంటల్లో సస్పెండ్ చేశారని ఆమె వ్యాఖ్యానించారు. అదే సమయంలో పార్టీకి నష్టం కలిగించిన వ్యక్తితో కలిసి పనిచేస్తూ, ఇప్పుడు పార్టీ అధినేత తీరును తప్పుబట్టడం ఎలా సమర్థనీయమని ప్రశ్నించారు. పార్టీ నిర్ణయాలు, అధినేత కేసీఆర్‌పై బహిరంగ విమర్శలు చేయడం కూడా పార్టీ వ్యతిరేక చర్య కాదా అని నిలదీశారు.
కేసీఆర్‌పై విమర్శలేంటి?
కేసీఆర్ విధానపరమైన నిర్ణయాలను బహిరంగంగా తప్పుబడుతున్న నేతలు ఇప్పుడు పార్టీ ప్రయోజనాల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని కవిత అన్నారు. ఫామ్‌హౌస్‌లు, అక్రమ అనుమతులు, ఆంధ్రా దోస్తులకు ఇచ్చిన నజరానాలు, క్విడ్ ప్రోకో వ్యవహారాలు బీఆర్ఎస్ను పాతాళానికి నెట్టాయని చేస్తున్న ఆరోపణలను ఆమె ప్రస్తావించారు. పార్టీలో జరిగిన వైఫల్యాలకు బాధ్యత వహించకుండా ఆ భారాన్ని బీఆర్ఎస్ అధినేతపై మోపడం సరికాదని వ్యాఖ్యానించారు.
రైతు, మహిళ అవమానంపై ఫైర్
ఇటీవల జరిగిన బీఆర్ఎస్ సమావేశంలో చోటుచేసుకున్న ఘటనలను కూడా కవిత ప్రస్తావించారు. ఫోన్లో మాట్లాడుతున్న రైతును ఉద్దేశించి అతని భార్యను అవమానించేలా మాట్లాడారని, సాయం కోరుతూ వచ్చిన మహిళను తల్లిని ప్రస్తావిస్తూ అవమానించారని ఆమె ఆరోపించారు. ఇలాంటి వ్యవహారశైలి పార్టీకి ప్రజల్లో మరింత నష్టం కలిగిస్తుందని అన్నారు. గుంటనక్క మైండ్‌గేమ్‌లో చిక్కుకుని పెద్ద మనిషినే తప్పుబడుతున్నారని విమర్శించారు.
ఆధారాలతోనే మాట్లాడతానన్న కవిత
పార్టీలోని వైఫల్యాలను అధినేతపై మోపడం కూర్చున్న కొమ్మనే నరుక్కోవడం లాంటిదని కవిత వ్యాఖ్యానించారు. ప్రత్యక్ష రాజకీయాల్లో తమ స్థానం ఏంటో ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. నిమజ్జనోత్సవంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించారని చేసిన ఆరోపణలను కూడా ప్రస్తావించారు. “నేను విషనాగుల మాటలు విని మాట్లాడను.. నిర్దిష్టమైన ఆధారాలతోనే మాట్లాడుతాను.. నాతో పెట్టుకోకు” అంటూ కవిత ఘాటైన హెచ్చరిక చేశారు.











