సుప్రీంకోర్టును ఆశ్రయించిన 2,500 మంది .
పూర్వీకుల భూముల కోసం న్యాయపోరాటం.
ఏజెన్సీ ప్రాంతాల్లోని తమ పూర్వీకుల భూములను అక్రమ ఆక్రమణలు, చట్టవిరుద్ధ బదలాయింపుల నుంచి కాపాడుకునేందుకు 2,500 మంది షెడ్యూల్డ్ ప్రాంత గిరిజన రైతులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 1/70 చట్టం రాజ్యాంగబద్ధమైనదని స్పష్టం చేస్తూ, దానిని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టివేయాలని కోరారు. సీనియర్ న్యాయవాది అల్లంకి రమేష్ ఈ న్యాయపోరాట వివరాలను వెల్లడించారు. గిరిజనులకు భూమి కేవలం ఆస్తి కాదని, జీవనాధారం, సంస్కృతి, సంప్రదాయాలతో ముడిపడిన హక్కు అని పిటిషనర్లు పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 244, ఆర్టికల్ 19(5), ఐదో షెడ్యూల్ ద్వారా కల్పించిన ప్రత్యేక రక్షణలను కొనసాగించాలని కోరారు.
1/70 చట్టానికి చారిత్రక రక్షణ
ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ ప్రాంతాల భూ బదలాయింపు నియంత్రణ చట్టం, 1/70 రెగ్యులేషన్ గిరిజన భూముల రక్షణకు కీలకమని పిటిషనర్లు తెలిపారు. పి. రామిరెడ్డి వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసులో 1988లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం గిరిజన ప్రాంతాల్లో గిరిజనేతరులకు భూముల బదలాయింపుపై నియంత్రణ అవసరమని పేర్కొన్నారు. నిరక్షరాస్యత, పేదరికం, చట్టాలపై అవగాహన లేకపోవడం వల్ల గతంలో గిరిజనులు భూస్వాములు, వడ్డీ వ్యాపారుల చేతిలో భూములు కోల్పోయారని వివరించారు. ఈ పరిస్థితులను అడ్డుకునేందుకే 1/1959 తర్వాత 1/70 నిబంధనలు అమల్లోకి వచ్చాయని గుర్తుచేశారు. 1970కు ముందు ఏజెన్సీలో ఉన్న గిరిజనేతరులకు కొన్ని వారసత్వ భూముల బదలాయింపుల్లో కలెక్టర్ అనుమతితో వెసులుబాటు ఉన్న విషయాన్ని కూడా ప్రస్తావించారు.
చట్టాన్ని బలహీనపర్చొద్దన్న డిమాండ్
1970 తర్వాత ఏజెన్సీ ప్రాంతాలకు వచ్చిన కొందరు గిరిజనేతరులు గిరిజన పట్టా భూములు, అసైన్‌మెంట్ భూములు, మిగులు భూములను ఆక్రమించారని పిటిషనర్లు ఆరోపించారు. యారంశెట్టి సత్యనారాయణ దాఖలు చేసిన డబ్ల్యూపీ నంబర్ 696/2026, సూరిరెడ్డి రమణారెడ్డి దాఖలు చేసిన సివిల్ అప్పీల్ నంబర్ 394/2023లో రద్దయిన ఆర్టికల్ 19(1)(ఎఫ్)ను ప్రస్తావిస్తూ 1/70 చట్టంలోని సెక్షన్ 3(1)(ఎ)ను సవాలు చేయడాన్ని వారు వ్యతిరేకించారు. ఈ పిటిషన్లను కొట్టివేసి గిరిజన భూములకు సంపూర్ణ రక్షణ కల్పించాలని 2,500 మంది ఆదివాసీలు సుప్రీంకోర్టును కోరారు.
#1Over70Regulation #TribalLandRights #SupremeCourt #TribalFarmers #AndhraPradesh #ScheduledAreas #TribalRights #AncestralLands #FifthSchedule #Article244 #Article19 #LandProtection #AgencyAreas #TribalLand #LegalBattle











