సుప్రీం కోర్టుకు ముందుకు పిటిషన్ .
సాధారణ నిందితుడిలా విచారించాలి.
రాజ్యాంగ రక్షణ వర్తించదంటూ లాయర్ .
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై పోలీసు దర్యాప్తు, ఆధారాల సేకరణ, సాధారణ న్యాయ విచారణ జరపాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. సుప్రీంకోర్టు న్యాయవాది శైలేంద్ర మణి త్రిపాఠి ఈ పిటిషన్ దాఖలు చేశారు. న్యాయవాది చాంద్ ఖురేషీ ద్వారా దాఖలైన పిటిషన్లో, ఎన్నికల ఓటర్ల జాబితా విషయంలో వచ్చిన ఆరోపణలకు అధికారిక విధులతో నేరుగా సంబంధం లేదని వాదించారు. ఇవి నిర్ధారణ అయితే ప్రజాప్రాతినిధ్య చట్టం, భారతీయ న్యాయ సంహిత కింద నేరాలుగా పరిగణించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
అధికారిక విధుల పేరుతో రక్షణ కాదని
పిటిషన్ ప్రకారం రికార్డులను ఉద్దేశపూర్వకంగా మార్చడం, నకిలీ పత్రాలు సృష్టించడం, ఎన్నికల ప్రక్రియను దెబ్బతీయడం వంటి చర్యలను అధికారిక విధుల్లో భాగంగా పరిగణించలేం. అలాంటి చర్యలకు పాల్పడితే ప్రభుత్వ అధికారి అనే హోదా చట్టపరమైన రక్షణ ఇవ్వదని పిటిషనర్ వాదించారు. 2023 చట్టంలోని సెక్షన్ 16ను కూడా ఇదే నేపథ్యంలో ప్రస్తావించారు. ఆ నిబంధన ఆధారంగా పోలీసు దర్యాప్తు, అరెస్టు నుంచి సంపూర్ణ రక్షణ ఉందని చెప్పలేమని పిటిషన్లో పేర్కొన్నారు.
14 అభ్యంతరాలపై దృష్టి
ఈ పిటిషన్ వెనుక ఎన్నికల సంఘంలో అంతర్గత విభేదాలపై వచ్చిన నివేదికలు కీలకంగా మారాయి. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి గత పది నెలల్లో కనీసం 14 సార్లు పలు నిర్ణయాలపై లిఖితపూర్వక అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కొత్త ఓటర్ల నమోదు, పేర్ల తొలగింపు, ఓటర్ల డేటాబేస్ నిర్వహణ, సర్ ప్రక్రియ వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. ఇద్దరు కమిషనర్లు తమకు తెలియకుండా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారని అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు ఆ నివేదిక తెలిపింది.
ఎన్నికల వ్యవస్థపైనే కీలక ప్రశ్న
పిటిషన్లో స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలు రాజ్యాంగ ప్రజాస్వామ్యానికి పునాది అని పేర్కొన్నారు. ఫామ్-6లో మార్పులు, ఓటర్ల డేటాబేస్ కేంద్రీకరణ, పశ్చిమ బెంగాల్లో ఓటర్లపై దాఖలైన అప్పీళ్లు, సాఫ్ట్వేర్ సమస్యల కారణంగా అర్హులైన ఓటర్ల పేర్లు నమోదు కాకపోవడం వంటి అంశాలను కూడా ప్రస్తావించారు. ముఖ్యంగా గోవాలో 97 మంది అర్హులైన ఓటర్ల విషయంలో సాఫ్ట్వేర్ సమస్య కారణంగా వారి నిర్ణయాలను నమోదు చేయలేకపోయారని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక పేర్కొంది. ఈ నేపథ్యంలో గ్యానేశ్ కుమార్‌కు వ్యక్తిగత క్రిమినల్ బాధ్యత నుంచి సంపూర్ణ మినహాయింపు లేదని పిటిషన్ వాదిస్తోంది.
#GyaneshKumar #CEC #SupremeCourt #SupremeCourtPlea #ShailendraManiTripathi #ElectionCommission #ECI #SIR #SpecialIntensiveRevision #Form6 #VoterList #SukhbirSinghSandhu #VivekJoshi #ElectoralRoll #ElectionNews











