కర్ణాటక పర్యటన రద్దు
ఫుడ్ పాయిజనింగే కారణం
కోలుకున్నారన్న ప్రహ్లాద్ జోషి
కర్ణాటక పర్యటనలో ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజనింగ్ కారణంగా వాంతులు, నీరసంతో ఆయన కొన్ని కార్యక్రమాలకు హాజరు కాలేకపోయారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. హుబ్బళ్లిలోని కేఎల్ఈ జగద్గురు గంగాధర మహాస్వామిగళు మూరుసవిరమఠ మెడికల్ కాలేజీ కొత్త అకడమిక్ భవనం, 1,200 పడకల కేఎల్ఈ ఆస్పత్రి ప్రారంభోత్సవానికి షా హాజరు కావాల్సి ఉంది. అయితే వైద్యుల సూచనతో హోటల్లోనే విశ్రాంతి తీసుకున్నట్లు కేఎల్ఈ సొసైటీ చైర్మన్ ప్రభాకర్ కోరే తెలిపారు.
బెళగావి కార్యక్రమం కూడా రద్దు
షా అనారోగ్యం కారణంగా బెళగావి జిల్లా చిక్కోడి తాలూకా ఎక్సాంబాలో శ్రీ బీరేశ్వర కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ కొత్త ప్రధాన కార్యాలయ భవనం ప్రారంభ కార్యక్రమం కూడా రద్దయింది. అక్కడ షా తరఫున ప్రహ్లాద్ జోషి, మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ షెట్టర్ తదితరులు పాల్గొన్నారు. వాంతుల కారణంగా కొంత నీరసం ఉన్నప్పటికీ ప్రస్తుతం షా పూర్తిగా కోలుకున్నారని జోషి తెలిపారు. షా గైర్హాజరీలో కేఎల్ఈ క్యాంపస్ల ప్రారంభోత్సవాలను ప్రహ్లాద్ జోషి, కర్ణాటక వైద్య విద్యాశాఖ మంత్రి శరణ్ ప్రకాశ్ పాటిల్, మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై, జగదీశ్ షెట్టర్ తదితరులు నిర్వహించారు. వైద్యుల సలహా మేరకు షా హోటల్లోనే ఉండాలని నిర్ణయించుకున్నారని కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంపై ఎలాంటి తీవ్రమైన సమస్య లేదని జోషి వెల్లడించడంతో పర్యటనకు సంబంధించి నెలకొన్న ఆందోళనకు తెరపడింది.
#AmitShah #AmitShahHealth #AmitShahNews #FoodPoisoning #KarnatakaVisit #Karnataka #PralhadJoshi #Hubballi #Belagavi #KLEHospital #KLEMedicalCollege #BJP #AmitShahRecovery #HealthUpdate #KarnatakaNews











