Home Telangana ఎల్‌నినో దెబ్బ 20 శాతం వర్షపాతం లోటు

ఎల్‌నినో దెబ్బ 20 శాతం వర్షపాతం లోటు

తెలంగాణకు కరువు ముప్పు
వర్షాభావంపై కేంద్రానికి భట్టి విజ్ఞప్తి

2026 నైరుతి రుతుపవనాల సమయంలో ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. జూన్‌ 1 నుంచి సెప్టెంబర్‌ 16 వరకు సాధారణంగా 664.5 మి.మీ. వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 536.5 మి.మీ. మాత్రమే నమోదైంది. దీంతో 20 శాతం లోటు ఏర్పడింది. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 19 జిల్లాలు వర్షాభావ ప్రాంతాలుగా ఉన్నాయని వివరించారు. వర్షాల మధ్య ఎక్కువ విరామం రావడంతో పంటల సాగు విస్తీర్ణం తగ్గిందని, సాధారణంగా 139.29 లక్షల ఎకరాల్లో సాగు జరగాల్సి ఉండగా 88 శాతం మేరకే పంటలు సాగయ్యాయని చెప్పారు. వరి సాగు దాదాపు 18 శాతం తగ్గిందన్నారు. పలుమార్లు విత్తనాలు వేయడంతో రైతులు, కౌలు రైతులపై పెట్టుబడి భారం పెరిగిందని పేర్కొన్నారు.

తగ్గుతున్న నీటి నిల్వలు

సెప్టెంబర్‌ 15 నాటికి ప్రధాన జలాశయాల్లో 585 టీఎంసీల సామర్థ్యానికి కేవలం 241 టీఎంసీల లైవ్‌ స్టోరేజ్‌ మాత్రమే ఉందని భట్టి తెలిపారు. గత ఏడాది ఇదే సమయంలో 497 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయని గుర్తుచేశారు. ప్రస్తుత నిల్వలు యాసంగి పంటలకు సాగునీరు అందించేందుకు సరిపోవని, భూగర్భ జలాలు తగ్గడంతో తాగునీటి కొరత ముప్పు ఉందని వివరించారు. వర్షాభావ ప్రభావం రైతులు, వ్యవసాయ కార్మికులు, గ్రామీణ ఉపాధి, పశుసంపద, పశుగ్రాసంపై పడుతోందన్నారు. ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక సిద్ధం చేసి తాగునీరు, సాగునీరు, విద్యుత్‌ సరఫరా కోసం ఉపశమన చర్యలు చేపడుతోందని తెలిపారు.

కేంద్రం ముందు ఎనిమిది డిమాండ్లు

వర్షాభావ పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు కేంద్రం తక్షణ సాయం అందించాలని తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా కోరాలని ముసాయిదా తీర్మానంలో ప్రతిపాదించారు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నిధులు విడుదల చేయడం, పంట నష్టం పరిహారం, పశుగ్రాసం, తాగునీరు, జలవనరుల పునరుద్ధరణకు సహాయం అందించాలని కోరారు. గ్రామీణ ఉపాధి కోసం అదనంగా 50 రోజుల పని కల్పించి, ఖర్చును కేంద్రం భరించాలని ప్రతిపాదించారు. ఎరువులు, ప్రత్యామ్నాయ పంటల విత్తనాలు సకాలంలో ఇవ్వాలని, డ్రిప్‌ సాగుకు ప్రోత్సాహం పెంచాలని కోరారు. తెలంగాణకు 1,500 మెగావాట్ల అదనపు విద్యుత్‌, 5 మిలియన్‌ టన్నుల బొగ్గు లింకేజీ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. తాగు, సాగునీటి అవసరాలకు రూ.20 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ, ఎఫ్ఆర్‌బీఎం రుణ పరిమితిని 3 నుంచి 3.5 శాతానికి పెంచాలని తీర్మానంలో కోరారు.

#ElNino #TelanganaRainfall #RainfallDeficit #TelanganaDrought #BhattiVikramarka #Telangana #TelanganaFarmers #WaterShortage #DroughtRisk #TelanganaAssembly #CentralAssistance #DroughtRelief #NDRF #SDRF #TelanganaAgriculture