భక్తుల కోసం కొత్త అనుభూతి: చంద్రబాబు.
తిరుమలను ఆధ్యాత్మికతకు ప్రపంచ స్థాయి నమూనాగా తీర్చిదిద్దడమే లక్ష్యమని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. భక్తులకు మెరుగైన అనుభూతి కల్పించడంతో పాటు పర్యావరణ పరిరక్షణ, సేవాభావం, ఆధునిక సాంకేతికతను సమన్వయం చేస్తామని చెప్పారు. తిరుమల కొండల్లో ప్రస్తుతం 89.5 శాతం గ్రీన్ కవర్ ఉందని, దాన్ని మరింత కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. బుధవారం పలు అభివృద్ధి కార్యక్రమాలను సీఎం ప్రారంభించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1 వద్ద ఏర్పాటు చేసిన పిలిగ్రిమ్స్ ఎక్స్పీరియన్స్ సెంటర్లో త్రీడీ సాంకేతికత, వర్చువల్ రియాలిటీ ద్వారా శ్రీవారి కైంకర్యాలు, పూజలు, తిరుమల ప్రాంతాలను వీక్షించే అవకాశం కల్పించారు.
రూ.104 కోట్లతో ఎస్వీ మ్యూజియం
ఆధునీకరించిన ఎస్వీ మ్యూజియాన్ని రూ.104 కోట్లతో పునరుద్ధరించి భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. శ్రీవారి వైభవం, తిరుమల చరిత్ర, పురాణ గాథలు, స్వామివారి పరిణయం వంటి అంశాలను ఆధునిక సాంకేతికతతో ప్రదర్శిస్తున్నారు. వివిధ రాజులు సమర్పించిన ఆభరణాల నమూనాలు, చారిత్రక వస్తువులు, కిరీటాలు, ఆభరణాల త్రీడీ నమూనాలు మ్యూజియంలో ఏర్పాటు చేశారు. ఏఐ వీడియోలు, పనోరమిక్ స్క్రీన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. శ్రీవారి సేవలో ఉపయోగించిన పురాతన సంగీత వాయిద్యాలను కూడా ప్రదర్శనలో ఉంచారు.
32 ఈ-బస్సులు.. రూ.2 లక్షల బీమా
భక్తుల రాకపోకలకు రిలయన్స్ ఫౌండేషన్, భారత్ బయోటెక్ అందించిన 32 ఎలక్ట్రిక్ బస్సులను సీఎం ప్రారంభించారు. తిరుమలకు వచ్చే ప్రతి భక్తుడికీ ఆధార్ ఆధారిత ఆన్లైన్ బీమా కల్పించేందుకు ఎల్ఐసీతో కలిసి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. తిరుమలలో దురదృష్టవశాత్తూ భక్తుడు మరణిస్తే రూ.2 లక్షల ఆర్థిక సాయం అందేలా బీమా ఉంటుందని చెప్పారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా రాష్ట్రంలో 5 వేల శ్రీవారి ఆలయాలు నిర్మించడమే లక్ష్యమని తెలిపారు. మారిషస్, న్యూజిలాండ్ వంటి దేశాల్లోనూ శ్రీవారి ఆలయాల నిర్మాణంపై ఆలోచిస్తున్నామని చెప్పారు. శ్రీవారి సేవకులను విద్య, వైద్య రంగాల్లో వినియోగించేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని, టీటీడీ కార్యకలాపాలను ఆరు అంశాల్లో పునర్వ్యవస్థీకరిస్తామని చంద్రబాబు వెల్లడించారు.
#Tirumala #ChandrababuNaidu #TTD #Tirupati #TirumalaDevelopment #PilgrimExperience #SVMuseum #TirumalaTemple #ElectricBuses #SpiritualTourism #AndhraPradesh #TTDDevelopment #PilgrimWelfare #TirumalaNews











