తెలంగాణ సచివాలయంలో మాజీ మంత్రి కొండా సురేఖకు కేటాయించిన కార్యాలయాలను అధికారులు సీజ్ చేశారు. సచివాలయంలోని నాలుగో అంతస్తు 4ఎఫ్ విభాగంలోని 10, 11, 12 నంబర్ గదులకు తాళాలు వేసి సీల్ చేశారు. మంత్రిగా ఉన్న సమయంలో ఈ గదులను ప్రభుత్వం ఆమెకు కేటాయించింది. ఇటీవల రాజకీయ పరిణామాల నేపథ్యంలో క్రమశిక్షణ చర్యల్లో భాగంగా కొండా సురేఖను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆమెకు కేటాయించిన ఛాంబర్లను అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మంగళవారం ఈ ప్రక్రియ చేపట్టారు. మంత్రి పదవి కోల్పోయిన కొద్దిరోజులకే కార్యాలయాలను సీజ్ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
పేషీల్లో సిబ్బందికీ మార్పులు
ఛాంబర్‌తో పాటు కొండా సురేఖకు చెందిన మూడు పేషీలకు కూడా అధికారులు తాళాలు వేశారు. ఆమె పేషీలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని తొలగించి, పలువురిని తిరిగి వారి సొంత శాఖలకు పంపించారు. దీంతో మాజీ మంత్రి కార్యాలయ వ్యవస్థ పూర్తిగా ముగిసినట్లైంది. పదవి నుంచి బర్తరఫ్ తర్వాత వెంటనే ఛాంబర్ల సీజ్, సిబ్బంది బదిలీ జరగడం తాజా పరిణామంగా నిలిచింది. కొండా సురేఖపై కాంగ్రెస్ అధిష్ఠానం తీసుకున్న క్రమశిక్షణ చర్యల నేపథ్యంలోనే ఈ పరిణామాలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.
#KondaSurekha #KondaSurekhaChamber #TelanganaSecretariat #TelanganaGovernment #KondaSurekhaDismissal #KondaSurekhaOffice #SecretariatNews #KondaSurekhaStaff #StaffTransfers #TelanganaPolitics #CongressTelangana #TelanganaNews #PoliticalNews #KondaSurekhaLatestNews











