Home Telangana కొండా సురేఖకు ఢిల్లీ పిలుపు!

కొండా సురేఖకు ఢిల్లీ పిలుపు!

అసంతృప్తి చల్లార్చే ప్రయత్నమా?

మంత్రి పదవి నుంచి బర్తరఫ్‌ అయిన కొండా సురేఖకు కాంగ్రెస్‌ అధిష్ఠానం నుంచి అత్యవసర ఢిల్లీ పిలుపు రావడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. మంత్రి పదవి కోల్పోయాక ఢిల్లీకి రావాలని పార్టీ పెద్దల నుంచి ఆమెకు సందేశం అందింది. శుక్రవారం తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌ స్వయంగా కొండా సురేఖతో ఫోన్‌లో మాట్లాడినట్లు సమాచారం. పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించాలని, అధిష్ఠానం ఆమెకు అండగా ఉంటుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఫోన్‌ సంభాషణ జరిగిన కొద్ది గంటల్లోనే ఢిల్లీ రావాలని పిలుపు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. పదవి నుంచి తొలగించిన వెంటనే అధిష్ఠానం నేరుగా జోక్యం చేసుకోవడంతో కాంగ్రెస్‌లో ఏం జరుగుతోందన్న ఆసక్తి పెరిగింది. కొండా సురేఖతో అధిష్ఠానం ఏం చర్చించనుంది? ఆమెకు ఎలాంటి హామీ ఇవ్వనుంది? అనే ప్రశ్నలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి.

కేబినెట్‌ హోదా పదవి ఇస్తారా?

మంత్రి పదవి కోల్పోయిన కొండా సురేఖలో నెలకొన్న అసంతృప్తిని చల్లార్చేందుకు కాంగ్రెస్‌ అధిష్ఠానం చర్యలు చేపట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఆమె రాజకీయ సేవలను గుర్తించి పార్టీలో తగిన ప్రాధాన్యత కల్పించడంతో పాటు కేబినెట్‌ హోదా కలిగిన కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ పదవి లేదా మరో కీలక బాధ్యత అప్పగించే ఆలోచనలో పార్టీ పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపైనే ఢిల్లీ సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్‌ వర్గాల్లో చర్చ సాగుతోంది. మంత్రి పదవి నుంచి తొలగించిన వెంటనే ఇలాంటి ప్రతిపాదన తెరపైకి రావడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. ఢిల్లీ పర్యటన తర్వాత కొండా సురేఖకు అధిష్ఠానం ఎలాంటి భరోసా ఇస్తుంది? కొత్త బాధ్యత ఏదైనా అప్పగిస్తుందా? అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. అధికారిక నిర్ణయం వెలువడితేనే ఈ ప్రచారానికి తెరపడనుంది.

 

#KondaSurekha #KondaSurekhaDelhi #KondaSurekhaMeeting #KondaSurekhaCabinetExit #TelanganaCongress #CongressHighCommand #MeenakshiNatarajan #RevanthReddy #TelanganaPolitics #CongressTelangana #KondaSurekhaNews #CabinetExit #CabinetRankPost #CorporationChairperson #TelanganaGovernment #CongressPolitics #TelanganaNews #PoliticalNews