ఐదు రోజుల పనివారాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బ్యాంకు ఉద్యోగులు దేశవ్యాప్త సమ్మెకు దిగడంతో శుక్రవారం బ్యాంకింగ్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) పిలుపుతో ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులు, అధికారులు సమ్మెలో పాల్గొన్నారు. దీంతో దేశవ్యాప్తంగా చాలా ప్రభుత్వ బ్యాంకుల శాఖలు పూర్తిగా లేదా పాక్షికంగా మూతపడ్డాయి. నగదు జమ, నగదు ఉపసంహరణ, చెక్ క్లియరెన్స్, శాఖల పరిపాలనా పనులు ప్రభావితమయ్యాయి. ప్రైవేట్ బ్యాంకుల కార్యకలాపాలపై సమ్మె ప్రభావం పెద్దగా కనిపించలేదు. అయితే UPI, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ సేవలు సాధారణంగానే కొనసాగాయి. ప్రస్తుతం నెలలో మొదటి, మూడో, ఐదో శనివారాల్లో బ్యాంకులు పనిచేస్తున్నాయి. 2024 మార్చిలో జరిగిన 12వ ద్వైపాక్షిక ఒప్పందంలో అన్ని శనివారాలను సెలవు దినాలుగా ప్రకటించాలన్న అంశం అంగీకారానికి వచ్చినప్పటికీ, కేంద్ర ప్రభుత్వ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నామని యూనియన్లు చెబుతున్నాయి. ప్రభుత్వం తమ డిమాండ్లపై సానుకూల నిర్ణయం తీసుకోకపోవడంతోనే సమ్మెకు దిగాల్సి వచ్చిందని బ్యాంకు ఉద్యోగ సంఘాలు పేర్కొన్నాయి.
పెన్షన్ సమస్యలపై ఆగ్రహం
ఐదు రోజుల పనివారంతో పాటు పెన్షన్ నవీకరణ, మెరుగుదల, అన్ని పెన్షనర్లకు ఒకే విధమైన డియర్నెస్ అలవెన్స్ విధానం అమలు చేయాలని యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. నేషనల్ పెన్షన్ సిస్టమ్ పరిధిలో ఉన్న ఉద్యోగులకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (ఓపీఎస్)కు మారే అవకాశం కల్పించాలని కోరుతున్నాయి. సమ్మె ప్రభావం పలు రాష్ట్రాల్లో స్పష్టంగా కనిపించింది. మధ్యప్రదేశ్‌లోనే సుమారు 7,000 బ్యాంకు శాఖల్లో కార్యకలాపాలు నిలిచిపోయాయి. రాష్ట్రంలోని 8,707 శాఖల్లో దాదాపు 7,000 శాఖలకు చెందిన 42 వేల మంది ఉద్యోగులు, అధికారులు సమ్మెలో పాల్గొన్నట్లు ఉద్యోగ సంఘాలు తెలిపాయి. 12 ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకుల సిబ్బంది కూడా సమ్మెలో పాల్గొన్నారు. దీంతో మధ్యప్రదేశ్‌లో ఒక్కరోజులో దాదాపు రూ.5,500 కోట్ల విలువైన బ్యాంకింగ్ కార్యకలాపాలు ప్రభావితమైనట్లు సంఘాలు వెల్లడించాయి. సమ్మె నేపథ్యంలో పలు ప్రభుత్వ బ్యాంకులు ముందుగానే ఖాతాదారులను అప్రమత్తం చేశాయి. శాఖల్లో సేవలు ప్రభావితమయ్యే అవకాశం ఉన్నందున అత్యవసర లావాదేవీలకు డిజిటల్ బ్యాంకింగ్ సేవలను వినియోగించుకోవాలని సూచించాయి.
#BankStrike #BankStrikeIndia #BankEmployeesStrike #FiveDayWorkweek #FiveDayBanking #UFBU #BankEmployees #PublicSectorBanks #BankingServices #BankStrikeToday #BankingNews #PensionRevision #OldPensionScheme #OPS #NPS #BankEmployeesUnion #IndiaBankStrike #DigitalBanking #BankingSector #IndiaNews











