ప్రధాని నరేంద్ర మోదీ ముంబై పర్యటనకు ముందు బాంద్రా-కుర్లా కాంప్లెక్స్‌లో భద్రతా కలకలం చోటుచేసుకుంది. ప్రధాని పాల్గొననున్న కార్యక్రమ ప్రాంగణంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒకరు తాను ప్రధాని కార్యాలయం (పీఎంవో) అధికారినంటూ చెప్పుకున్నట్లు సమాచారం. అతని వద్ద నకిలీ గుర్తింపు కార్డును పోలీసులు గుర్తించారు. ముంబైలోని నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ ప్రాంగణంలో వీరిని గుర్తించినట్లు అధికారిక వివరాలు వెల్లడించాయి. నకిలీ ఐడీ కార్డుతో పట్టుబడిన వ్యక్తిని 24 ఏళ్ల రోహన్ పరేఖ్‌గా గుర్తించారు. అతనితో ఉన్న అంగరక్షకుడి వద్ద తుపాకీ ఉన్నట్లు భద్రతా సిబ్బంది గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల సమయంలో ఐడీ కార్డు అనుమానాస్పదంగా కనిపించడంతో మరింత లోతుగా పరిశీలించగా అది నకిలీదని తేలింది. పీఎంవో అధికారినంటూ చెప్పుకోవడం వెనుక కారణమేంటి? తుపాకీతో ఉన్న బాడీగార్డుతో కలిసి ప్రధాని కార్యక్రమ ప్రాంగణంలోకి ఎందుకు రావాలనుకున్నారు? అనే ప్రశ్నలకు సమాధానాల కోసం ముంబై క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు చేస్తోంది.
అసలు టార్గెట్ ఎవరు? దర్యాప్తు ముమ్మరం
ప్రస్తుతం ఈ ఇద్దరూ ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకునే ఉద్దేశంతోనే అక్కడికి వచ్చినట్లు ఎలాంటి అధికారిక సమాచారం లేదు. అయినప్పటికీ నకిలీ గుర్తింపు కార్డు, తుపాకీతో ప్రధాని కార్యక్రమానికి చేరుకునే ప్రయత్నం చేయడం భద్రతా వర్గాలను అప్రమత్తం చేసింది. ఇదే సమయంలో సెప్టెంబర్ 8న సాయంత్రం 5:45 గంటలకు ముంబైలో ప్రధాని మోదీ గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2026ను ప్రారంభించనున్నారు. సెప్టెంబర్ 8 నుంచి 11 వరకు జరిగే ఏడో ఎడిషన్‌లో ఫైనాన్స్ భవిష్యత్తు, ఏజెంటిక్ టెక్నాలజీ, టోకెనైజేషన్, క్వాంటమ్ టెక్నాలజీ, డిజిటల్ చెల్లింపులు, ఆర్థిక సమ్మిళితంపై చర్చలు జరగనున్నాయి. అంతకుముందు గుజరాత్‌లోని వడోదరలో రూ.35 వేల కోట్లకుపైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, జాతికి అంకిత కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొంటారు. ఇందులో రూ.20,700 కోట్లకుపైగా వ్యయంతో నిర్మించిన వెస్ట్రన్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్‌లోని 326 రూట్ కిలోమీటర్ల మూడు కీలక విభాగాలు ఉన్నాయి. అయితే ముంబైలో జరిగిన ఘటన వెనుక అసలు ఉద్దేశం ఏమిటన్నదే ఇప్పుడు కీలక ప్రశ్నగా మారింది.
#PMModi #NarendraModi #ModiMumbaiVisit #PMModiSecurity #SecurityScare #SecurityBreach #FakePMOID #FakeIdentityCard #PMOSecurity #RohanParekh #MumbaiPolice #MumbaiCrimeBranch #GunRecovery #Bodyguard #BKC #NMACC #GlobalFintechFest2026 #FintechFest #MumbaiNews #ModiNews #IndiaNews











