కేసీఆర్ ఎర్రవల్లి నివాసం ముట్టడికి కాంగ్రెస్ నేతలు ఇచ్చిన పిలుపు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కేసీఆర్ ఇంటి వైపు వెళ్తున్న కాంగ్రెస్ నేతలను బీఆర్‌ఎస్ శ్రేణులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట, రాళ్లదాడి జరిగింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎర్రవల్లికి వస్తున్నారన్న సమాచారంతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అప్రమత్తమై అసెంబ్లీ నుంచి అక్కడికి బయల్దేరారు. అయితే బొల్లారం వద్ద భారీగా మోహరించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. కేటీఆర్, హరీశ్‌రావుతో పాటు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు బొల్లారం చౌరస్తా నుంచి ఎర్రవల్లి వైపు నడుచుకుంటూ వెళ్లారు. హకీంపేట్ దాటిన తర్వాత పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. కేటీఆర్‌ను బోయిన్‌పల్లి పీఎస్‌కు, హరీశ్‌రావును జవహర్‌నగర్ పీఎస్‌కు తరలించారు. ఇద్దరినీ విడుదల చేసిన తర్వాత వారు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
కేటీఆర్ ఫైర్.. కాంగ్రెస్‌పై తీవ్ర ఆరోపణలు
బోయిన్‌పల్లి పీఎస్ నుంచి విడుదలైన కేటీఆర్.. కాంగ్రెస్ గుండాలను కేసీఆర్ ఇంటిపైకి పంపించారని ఆరోపించారు. మహిళా ఎమ్మెల్యేలపై హేయంగా దాడి చేశారని విమర్శించారు. 600కు పైగా హామీలు ఇచ్చి వెయ్యి రోజులు దాటినా వాటిని నెరవేర్చలేదని రేవంత్ సర్కారుపై ధ్వజమెత్తారు. “స్కూటీలు ఇస్తామన్నారు.. లూటీలు చేశారు” అంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణ దశాబ్దాల కలను కేసీఆర్ నెరవేర్చారని, హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో విశ్వనగరంగా నిలబెట్టారని కొనియాడారు. మరోవైపు హరీశ్‌రావు.. ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని ఆరోపించారు. “డైవర్షన్ పాలిటిక్స్‌తో హెడ్‌లైన్లు మారుతాయి.. ప్రజల జీవితాలు మారవు” అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో క్రాప్ హాలిడే పరిస్థితి వచ్చిందని, యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఉద్యోగులు ధర్నాలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని, ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపులు నిలిచిపోయాయని విమర్శించారు.
పీఎస్‌ల ఎదుట పోటాపోటీ నినాదాలు
కేటీఆర్‌ను బోయిన్‌పల్లి పీఎస్‌కు తరలించిన విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్ కార్యకర్తలు భారీగా అక్కడికి చేరుకున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు కూడా చేరడంతో ఇరువర్గాల మధ్య నినాదాలు, తోపులాటతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బీఆర్‌ఎస్ నేతలకు పోలీస్‌స్టేషన్‌లోనే రక్షణ లేదంటూ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కొందరు పీఎస్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. పలువురు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జవహర్‌నగర్ పీఎస్ వద్ద కూడా ఇదే తరహా పరిస్థితి నెలకొంది. హరీశ్‌రావు విడుదల కోరుతూ బీఆర్‌ఎస్ శ్రేణులు స్టేషన్ ఎదుట బైఠాయించాయి. పోలీసులు, కార్యకర్తల మధ్య తోపులాటతో ఉద్రిక్తత మరింత పెరిగింది. ఈ పరిణామాల ప్రభావంతో హైదరాబాద్-సిద్దిపేట రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. శామీర్‌పేట వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కేసీఆర్ ఇంటి ముట్టడి పిలుపు మొదలైన వివాదం.. చివరకు అరెస్టులు, ఘర్షణలు, రహదారుల దిగ్బంధానికి దారితీయడం తెలంగాణ రాజకీయ వేడిని మరో స్థాయికి తీసుకెళ్లింది.
#KCR #KCRHouseSiege #Erravalli #KCRResidence #Congress #BRS #CongressVsBRS #TelanganaPolitics #KTR #KTRArrest #HarishRao #HarishRaoArrest #BRSProtest #CongressProtest #ErravalliProtest #RevanthReddy #PoliticalClash #PoliceDetention #TelanganaAssembly #HyderabadTraffic #Shamirpet #TelanganaNews











