నర్సాపూర్‌లో ముగ్గురు ఎంపీల పోరుబాట.
అన్నదమ్ములు దోచుకుంటున్నారు.
మెదక్ ఎంపీ రఘునంనదన్ రావు ఫైర్.
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ కేంద్రంలో 22A నిషేధిత భూముల జాబితాను వ్యతిరేకిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావుతో పాటు మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ పాలనలో తండ్రి, కొడుకు, కూతురు, మేనల్లుడు కలిసి తెలంగాణను దోచుకున్నారని, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో అన్నదమ్ములు దోచుకుంటున్నారని ఆరోపించారు. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ కలిసి దొంగ పోలీస్ ఆట ఆడుతున్నాయని విమర్శించారు. గత బీఆర్ఎస్ పాలనలో వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క బీఆర్ఎస్ నాయకుడినైనా అరెస్ట్ చేసిందా అని ప్రశ్నించారు. ధరణి, భూ భారతి పేర్లు మార్చడం తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదని రఘునందన్ రావు విమర్శించారు.
ఈటల రాజేందర్ — పేదల భూములపై పోరాటం
మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ తెలంగాణలో భూముల వ్యవహారంపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. కేసీఆర్ కుటుంబంలో నలుగురు కలిసి తెలంగాణను దోచుకున్నారని, రేవంత్ రెడ్డి కుటుంబంలో ఏడుగురు ఉన్నారని ఆయన ఆరోపించారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రజలు గద్దె దించినట్లే ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా అదే పరిస్థితి రాకుండా ముందే జాగ్రత్త పడాలని సూచించారు. పేదల భూములపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఆయన తప్పుబట్టారు. రియల్ ఎస్టేట్ వ్యాపారిగా ఉన్న రేవంత్ రెడ్డి పేదల భూములు కొల్లగొట్టడంలో రీసెర్చ్ స్కాలర్‌గా మారారని ఈటల ఘాటు వ్యాఖ్యలు చేశారు. 22A నిషేధిత భూముల అంశంపై ప్రజలకు న్యాయం జరిగే వరకు బీజేపీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.
కొండా విశ్వేశ్వర్ రెడ్డి — రాజీనామాలకు డిమాండ్
చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి 22A నిషేధిత భూముల జాబితాలో జరిగిన తప్పిదాలకు బాధ్యత వహిస్తూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ధరణి సమస్యలకు పరిష్కారంగా తీసుకొచ్చిన భూ భారతి మరింత అధ్వాన్నంగా తయారైందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులతో కుమ్మక్కై లక్షల ఎకరాల భూములను కాజేస్తోందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. నర్సాపూర్‌లో 22A భూముల సమస్యతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు బీజేపీ అండగా ఉంటుందని తెలిపారు. ముగ్గురు ఎంపీలు ఒకే వేదికపై ప్రభుత్వ భూ విధానాలను తీవ్రంగా ప్రశ్నించడంతో నర్సాపూర్ మహాధర్నా రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
#22ALands #Narsapur #BJP #RaghunandanRao #EtelaRajender #KondaVishweshwarReddy #RevanthReddy #TelanganaPolitics #BJPProtest #BhoBharati #Dharani #LandIssue #PonguletiSrinivasReddy #TelanganaBJP #NarsapurProtest











