చంద్రబాబుపై ఘాటు విమర్శలు
పురుషోత్తపట్నం నీళ్లకు పోలవరం పేరు?
పోలవరం ప్రాజెక్టు విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఇప్పటికే ఉన్న పురుషోత్తపట్నం పంపులతో గోదావరి నీటిని ఎత్తిపోసి, ఇప్పటికే ఉన్న పోలవరం ఎడమ కాలువలో విడుదల చేసి.. దానిని పోలవరం నీళ్లుగా ప్రచారం చేసుకోవడం ఏంటని ప్రశ్నించారు. పోలవరం రిజర్వాయర్ నుంచి గ్రావిటీ ద్వారా వస్తున్న నీరు కాదని అందరికీ తెలుసన్నారు. పురుషోత్తపట్నం నీళ్లు, వైఎస్సార్ హయాంలో నిర్మించిన కాలువకు ఇప్పుడు చంద్రబాబు క్రెడిట్ తీసుకోవడం చీప్ పబ్లిసిటీగా అభివర్ణించారు. 3,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడానికి ఉపయోగిస్తున్న పంపులు కొత్తవి కాదని, ఇప్పటికే ఉన్నవేనని చెప్పారు. సాగునీటి ప్రాజెక్టుల పేరుతో వరుసగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని జగన్ ఆరోపించారు.
పోలవరం ఆలస్యానికి ఎవరు కారణం?
పోలవరం ఎడమ కాలువకు సంబంధించిన ప్రధాన పనుల్లో 79 శాతం పనులు వైఎస్సార్ హయాంలోనే పూర్తయ్యాయని జగన్ పేర్కొన్నారు. 2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం పోలవరం పనుల్లో సరైన ప్రణాళిక లేకుండా వ్యవహరించిందని ఆరోపించారు. స్పిల్‌వే, కాఫర్ డ్యాం పనులను అరకొరగా చేపట్టి, నదీ ప్రవాహాన్ని పూర్తిగా మళ్లించకుండానే డయాఫ్రం వాల్ నిర్మాణం చేపట్టారని విమర్శించారు. వరదల సమయంలో పాక్షికంగా ఉన్న స్పిల్‌వే ద్వారా నీరు మళ్లకపోవడం, కాఫర్ డ్యాంలోని గ్యాప్‌ల ద్వారా నీరు చొచ్చుకురావడంతో డయాఫ్రం వాల్ దెబ్బతిని ప్రాజెక్టుకు నష్టం జరిగిందని అన్నారు. తమ ఐదేళ్ల పాలనలో అప్రోచ్ ఛానల్, స్పిల్ ఛానల్, స్పిల్‌వే, కాఫర్ డ్యాంలను పూర్తి చేసి, మెయిన్ డ్యాం పనులను ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్లామని చెప్పారు. ఇప్పుడు కూడా ప్రభుత్వం ప్రాజెక్టును మరోసారి సమస్యల్లోకి నెడుతోందని ఆరోపించారు.
45.72 మీటర్ల ఎత్తుపై తేల్చాలి
పోలవరం విషయంలో అసలు కీలకమైన అంశం ప్రాజెక్టు ఎత్తు అని జగన్ స్పష్టం చేశారు. పోలవరం పూర్తి స్థాయి ఎఫ్‌ఆర్‌ఎల్ 45.72 మీటర్లు కాగా.. 41.15 మీటర్లకే నీటి నిల్వను పరిమితం చేయడంపై చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రం 41.15 మీటర్ల వరకు మాత్రమే నిధులు ఇస్తామని చెబుతున్న పరిస్థితిలో పూర్తి సామర్థ్యంతో నీటిని ఎలా నిల్వ చేస్తారని ప్రశ్నించారు. నిర్వాసితులకు పునరావాస ప్యాకేజీ ఎప్పుడు అందిస్తారో చెప్పాలన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. 2009లో వైఎస్సార్ రూ.7,214.10 కోట్లతో ఇచ్చిన పరిపాలనా అనుమతిని.. 2022లో తమ ప్రభుత్వం రూ.17,050.20 కోట్లకు సవరించి, ప్యాకేజీ-1, ప్యాకేజీ-2 పనులను టెండర్లు, అగ్రిమెంట్ల దశకు తీసుకెళ్లిందని గుర్తుచేశారు. భూసేకరణ కోసం ప్రత్యేక యూనిట్లు ఏర్పాటు చేశామని చెప్పారు. చివరగా చంద్రబాబు డ్రామాలు పక్కనపెట్టి పనులపై దృష్టి పెట్టాలని, పోలవరాన్ని నిర్దేశిత 45.72 మీటర్ల ఎత్తులో పూర్తిచేయాలని జగన్ డిమాండ్ చేశారు. అలా చేస్తే పూర్తి స్థాయి నీటి నిల్వ సాధ్యమై, కుడి, ఎడమ కాలువలకు గ్రావిటీ ద్వారా నీరు అందుతుందని స్పష్టం చేశారు.
#JaganMohanReddy #Polavaram #PolavaramProject #ChandrababuNaidu #PolavaramWater #Purushothapatnam #PolavaramLeftCanal #AndhraPradeshPolitics #IrrigationProjects #PolavaramControversy #NorthAndhra #YSRCP #APPolitics #JaganVsChandrababu











