నేతలకు జగన్ ఫుల్ క్లారిటీ .
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ శ్రేణులను సమరానికి సిద్ధం చేశారు. తాడేపల్లిలో నిర్వహించిన కీలక సమావేశంలో ప్రతి స్థానిక సంస్థ సీటులో పార్టీ అభ్యర్థి ఉండాల్సిందే అని నేతలకు స్పష్టం చేశారు. బలమైన అభ్యర్థులను వెంటనే గుర్తించి రంగంలోకి దించాలని సూచించారు. ఏ ప్రాంతంలోనైనా పార్టీ అభ్యర్థి లేకుండా ఎన్నిక జరిగితే సంబంధిత నాయకులనే బాధ్యులుగా చేస్తామని హెచ్చరించారు. ఏకగ్రీవాల పేరుతో పోటీ నుంచి తప్పుకోవద్దని సూచిస్తూ, అవసరమైతే పార్టీ కార్యకర్తలకు అండగా కుటుంబ సభ్యులను కూడా బరిలోకి దించాలని చెప్పారు. వ్యక్తిగత ఇగోలకు తావివ్వకుండా అభ్యర్థుల ఎంపిక జరగాలని సూచించారు.
60 రోజులు నియోజకవర్గాల్లోనే
దాదాపు 30 నెలలుగా ప్రతిపక్షంలో ఉన్న సమయంలో గ్రామస్థాయి కమిటీల వరకు పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేశామని జగన్ తెలిపారు. వచ్చే 60 నుంచి 70 రోజులు నేతలు నియోజకవర్గాలను వదలకుండా ఎన్నికలపైనే దృష్టి పెట్టాలని ఆదేశించారు. సెప్టెంబర్ 5 నుంచి 7 వరకు జిల్లా సమావేశాలు, 8 నుంచి 11 వరకు అసెంబ్లీ నియోజకవర్గ సమావేశాలు, 12 నుంచి 22 వరకు మండల, వార్డు స్థాయి సమావేశాలు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 23 నుంచి ఇంటింటి ప్రచారం ప్రారంభించాలని నిర్ణయించారు. వైసీపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సంస్కరణలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు కూటమి ప్రభుత్వ వైఫల్యాలను వివరించేలా ప్రచార ప్రణాళిక రూపొందించారు.
15 లక్షల కార్డులతో కేడర్‌కు బలం
ప్రతి నియోజకవర్గంలో లీగల్, మీడియా సెల్స్‌తో పాటు సోషల్ మీడియా వ్యవస్థను బలోపేతం చేయాలని జగన్ ఆదేశించారు. సుమారు 14 నుంచి 15 లక్షల క్యూఆర్ కోడ్ గుర్తింపు కార్డులను పార్టీ కార్యకర్తలకు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసుల వేధింపులకు గురయ్యే కార్యకర్తలకు న్యాయ సహాయం అందించే వ్యవస్థను కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగితే వైసీపీ విజయం సాధిస్తుందని జగన్ ధీమా వ్యక్తం చేశారు. అదే సమయంలో అధికార పక్షం ప్రలోభాలు, హింసకు పాల్పడే అవకాశం ఉందని ఆరోపిస్తూ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. స్థానిక ఎన్నికలను పార్టీ పునర్నిర్మాణానికి కీలక అవకాశంగా జగన్ భావిస్తున్నట్లు తాజా సమావేశం స్పష్టం చేసింది.
#YSJagan #JaganMohanReddy #YSRCP #LocalBodyElections #APLocalElections #AndhraPradeshPolitics #YSRCPCandidates #JaganElectionStrategy #Tadepalli #YSRCPNews #YSRCPCadre #LocalElections #APElections #PoliticalNews #AndhraPradesh











