ఇదే డబ్బింగ్ జబ్బు
ఒక సినిమా వస్తుంది.. థియేటర్లు దద్దరిల్లాలి.. టికెట్ కౌంటర్ల దగ్గర క్యూ కట్టాలి.. ప్రేక్షకుడు తన జేబులో ఉన్న డబ్బు తీసి హీరోపై ప్రేమతో సినిమా చూడాలి. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. తెలుగు సినిమాలకు టికెట్ రేట్లు పెంచండి.. ఓకే. భారీ బడ్జెట్ అంటూ పది రోజులు హైక్ ఇవ్వండి.. అదీ ఓకే. మరి డబ్బింగ్ సినిమాలకు కూడా అదే బెనిఫిట్ ఎందుకు? ఇదే ఇప్పుడు అసలు పంచ్. సినిమా భాషలో చెప్పాలంటే.. ఇది కేవలం టికెట్ రేట్ల సమస్య కాదు.. ఇదే డబ్బింగ్ జబ్బు! ఒక ఇండస్ట్రీని కాపాడటానికి తీసుకున్న నిర్ణయం.. మరో ఇండస్ట్రీ నుంచి దిగుమతి అయ్యే సినిమాలకు కూడా వర్తిస్తే, స్థానిక సినిమాకు దక్కాల్సిన స్పేస్ ఎక్కడ? హీరో ఎవరైనా.. సినిమా ఏ భాషదైనా.. ప్రేక్షకుడి జేబే టార్గెట్ అయితే ఎలా? థియేటర్ ఒకటే.. స్క్రీన్ ఒకటే.. కానీ రూల్ మాత్రం వేరుగా ఉండాలి కదా! లేకపోతే తెలుగు సినిమా కోసం తీసుకున్న పాలసీ.. చివరికి డబ్బింగ్ సినిమాలకే భారీ ఆయుధంగా మారే ప్రమాదం ఉంది.

పది రోజుల ధరల పెంపు
తెలుగు సినిమాల టికెట్ ధరలు పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతిస్తే.. మరి అదే నిబంధనలను డబ్బింగ్ సినిమాలకు కూడా వర్తింపజేయడమేంటి? తెలుగు సినీ పరిశ్రమను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయం బాగానే ఉన్నా.. ఇతర భాషల నుంచి డబ్బింగ్ అయి వస్తున్న సినిమాలకు కూడా భారీ టికెట్ ధరల పెంపునకు అవకాశం ఇవ్వడం ఎంతవరకు సమంజసం? ఇప్పుడు ఇదే ప్రశ్న సినీ అభిమానుల నుంచి వినిపిస్తోంది. సినిమా టికెట్ ధర పెరిగితే మొదటగా భారం పడేది సామాన్య ప్రేక్షకుడిపైనే. భారీ బడ్జెట్ సినిమాలకు పది రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పించింది. ప్రతి థియేటర్లో కనీసం 25 శాతం సీట్లను నాన్-ప్రీమియం కేటగిరీలో సాధారణ ధరలకు విక్రయించాలని షరతు పెట్టింది. రోజుకు ఐదు షోలు ప్రదర్శించుకునే అవకాశం ఇచ్చింది. చిన్న సినిమాల కోసం కనీసం ఒక షో కేటాయించాలని స్పష్టం చేసింది. టికెట్ ధరల పెంపుతో వచ్చే అదనపు ఆదాయంలో 20 శాతాన్ని తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, సినీ కార్మికుల సంక్షేమ నిధికి ఇవ్వాలనే నిబంధన కూడా ఉంది.

తెలుగు సినిమాకు ఓ న్యాయం.. డబ్బింగ్‌కు మరో న్యాయమా?
నిబంధనలు ఉన్నా.. అసలు సమస్య సామాన్య ప్రేక్షకుడిదే. నలుగురు సభ్యుల కుటుంబం మల్టీప్లెక్స్‌కు వెళ్లి సినిమా చూడాలంటే టికెట్లతో పాటు పార్కింగ్, స్నాక్స్ ఖర్చులు కలిపితే వందలు కాదు.. వేల రూపాయలు ఖర్చవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మరోసారి టికెట్ ధరలు పెంచడం మధ్యతరగతి కుటుంబాలకు భారమే. 25 శాతం సీట్లు సాధారణ ధరలకు అందుబాటులో ఉన్నా.. మిగిలిన సీట్లపై పెరిగిన ధరల ప్రభావం మొత్తం థియేటర్ మార్కెట్‌పైనే పడుతుంది. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతోంది. తెలుగు నిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణులు, కార్మికుల ఉపాధి కోసం ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వడం అర్థం చేసుకోవచ్చు. కానీ ఇతర భాషల్లో తెరకెక్కి తెలంగాణలోకి డబ్బింగ్ అయి వస్తున్న సినిమాలకు కూడా అదే స్థాయిలో టికెట్ ధరల పెంపునకు అనుమతిస్తే.. స్థానిక చిత్ర పరిశ్రమకు ఇచ్చే రక్షణ ఎక్కడ ఉంటుంది? తెలుగు సినిమా మనుగడ కోసం తీసుకున్న నిర్ణయం.. డబ్బింగ్ సినిమాల విషయంలో మాత్రం వివాదానికి దారితీస్తోంది.

ఇరుముడికి థియేటర్లు తగ్గాయంటూ రగడ
ఇక ‘ఇరుముడి’ సినిమా విషయంలోనూ ఇదే అసంతృప్తి సోషల్ మీడియాలో కనిపిస్తోంది. తమ సినిమాకు థియేటర్లు తగ్గించి ‘టాక్సిక్’ వంటి సినిమాలకు థియేటర్లు కేటాయించడంపై రవితేజ అభిమానుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. దిల్ రాజు పంపిణీ వ్యవహారంపై అభిమానులు తీవ్రంగా స్పందిస్తున్నారు. తమ హీరో సినిమాకు అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తూ సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు. సినీ పరిశ్రమను ప్రభుత్వం ఆదుకోవాలి. నిర్మాతలు భారీ పెట్టుబడులు పెట్టే పరిస్థితుల్లో వారికి అవసరమైన ప్రోత్సాహం ఇవ్వాలి. అదే సమయంలో ప్రేక్షకుడి జేబును కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలి. ముఖ్యంగా తెలుగు సినిమాలకు ప్రత్యేకంగా కల్పిస్తున్న వెసులుబాట్లను డబ్బింగ్ సినిమాలకు కూడా యథాతథంగా వర్తింపజేయడం కంటే.. స్థానిక పరిశ్రమ ప్రయోజనాలు, ప్రేక్షకుల భారం రెండింటినీ పరిగణనలోకి తీసుకుని స్పష్టమైన విధానం రూపొందించాల్సిన అవసరం ఉంది. లేదంటే టికెట్ ధరల పెంపు సినీ పరిశ్రమకు వరంగా మారినా.. సామాన్య ప్రేక్షకుడికి మాత్రం సినిమా మరింత దూరమయ్యే ప్రమాదం ఉంది.











