తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల అంశం మళ్లీ రాజకీయంగా వేడెక్కింది. విద్యార్థుల ఫీజులు చెల్లించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు తీవ్రంగా మండిపడ్డారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అనుసరించిన విధానాలనే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తోందని ఆరోపించారు. విద్యార్థులు, కాలేజీ యాజమాన్యాలు తమ బకాయిల కోసం ఆందోళన చేస్తుంటే.. సమస్యను పరిష్కరించాల్సిన ప్రభుత్వం వారిపై ఒత్తిడి తెస్తోందని విమర్శించారు. ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు.
వెయ్యి కోట్ల హామీ ఏమైంది?
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి రూ.1,000 కోట్లు కేటాయిస్తామని ఇచ్చిన హామీని రాంచందర్‌రావు ప్రశ్నించారు. ఇప్పటివరకు ఆ నిధులు విడుదల చేయలేదని అన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై హైకోర్టు ప్రశ్నించిన తర్వాత ప్రభుత్వం కొంత మొత్తం చెల్లిస్తామని చెప్పినా.. ఆ హామీ కూడా అమలుకు నోచుకోలేదని ఆరోపించారు. కాలేజీలకు డబ్బులు ఇవ్వకుండా విద్యార్థుల చదువులను ఇబ్బందుల్లోకి నెట్టడం సరికాదన్నారు. బకాయిల కోసం విద్యార్థులు రోడ్డెక్కే పరిస్థితి రావడం కాంగ్రెస్ పాలనా వైఫల్యానికి నిదర్శనమని రాంచందర్‌రావు వ్యాఖ్యానించారు.
రాహుల్‌కు తెలంగాణ నుంచే సవాల్
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీకి రాంచందర్‌రావు నేరుగా సవాల్ విసిరారు. “దమ్ముంటే తెలంగాణకు వచ్చి విద్యార్థుల ఫీజు బకాయిలపై మాట్లాడాలి” అని అన్నారు. యువత సమస్యలపై కేంద్రాన్ని ప్రశ్నించే కాంగ్రెస్ నేతలు.. తెలంగాణలో అధికారంలో ఉన్న తమ ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్న ప్రభుత్వానికి ప్రజలు సరైన సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రజలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
#FeeReimbursement #FeeDues #TelanganaStudents #BJP #BJPTelangana #RamchanderRao #TelanganaCongress #CongressGovernment #RevanthReddy #StudentIssues #StudentProtest #TelanganaEducation #OsmaniaUniversity #RahulGandhi #TelanganaPolitics #CollegeFeeDues #StudentRights #TelanganaNews











