Home National_news లోక్‌సభ ప్రొరోగేషన్‌పై కాంగ్రెస్ ప్రశ్నలు

లోక్‌సభ ప్రొరోగేషన్‌పై కాంగ్రెస్ ప్రశ్నలు

అసాధారణ జాప్యం అంటూ అభ్యంతరం.
డీలిమిటేషన్ బిల్లు కోసమేనని అనుమానం.
పది రోజులైనా కాకపోవడంపై జైరాం రమేశ్ ఫైర్.

ఆగస్టు 13న వర్షాకాల సమావేశాలు సైన్ డైగా ముగిసినా.. పది రోజులు గడిచినా లోక్‌సభ ప్రొరోగ్ కాకపోవడంపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. సాధారణంగా సభ సైన్ డై వాయిదా పడిన రెండు నుంచి నాలుగు రోజుల్లో ప్రొరోగేషన్ జరుగుతుందని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ పేర్కొన్నారు. కొన్ని సందర్భాల్లో అదే రోజున కూడా ఈ ప్రక్రియ పూర్తయిన ఉదాహరణలు ఉన్నాయని తెలిపారు. 2015లో 28 రోజులు, 2021లో 20 రోజుల పాటు ఆలస్యం జరిగిన సందర్భాలను ఆయన ప్రస్తావించారు. అయితే ప్రస్తుతం నెలకొన్న అసాధారణ జాప్యానికి కారణమేంటని ప్రశ్నించారు.

డీలిమిటేషన్ బిల్లుపై అనుమానం

లోక్‌సభ ప్రొరోగేషన్ ఆలస్యం వెనుక కేంద్ర ప్రభుత్వ రాజకీయ వ్యూహం ఉందా అన్న అనుమానాన్ని జైరాం రమేశ్ వ్యక్తం చేశారు. ముఖ్యంగా డీలిమిటేషన్‌కు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదింపజేసేందుకు అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీని సమీకరించే ప్రయత్నాలు ఇంకా కొనసాగుతున్నాయా? అని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను ఉద్దేశించి ప్రశ్నించారు. అవసరమైన సంఖ్యాబలాన్ని కూడగట్టే ప్రయత్నంలో భాగంగానే ప్రొరోగేషన్‌ను ఆలస్యం చేస్తున్నారా అని నిలదీశారు. అయితే ఈ ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక వివరణ వెలువడలేదు.

ప్రొరోగేషన్ అంటే ఏంటి?

పార్లమెంటరీ నిబంధనల ప్రకారం సైన్ డై వాయిదా సభ కార్యకలాపాలను ముగిస్తే.. ప్రొరోగేషన్‌ ద్వారా ఆ సెషన్‌ అధికారికంగా ముగుస్తుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 85(2) ప్రకారం రాష్ట్రపతి ప్రధానమంత్రి సలహాతో సభా సమావేశాన్ని ప్రొరోగ్ చేస్తారు. సాధారణంగా సైన్ డై తర్వాత ఈ ప్రక్రియ జరుగుతుంది. ప్రొరోగేషన్‌ తర్వాతి సమావేశం ప్రారంభమయ్యే వరకు ఉండే కాలాన్ని ఇంటర్‌-సెషన్‌ పీరియడ్‌గా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత జాప్యం రాజకీయంగా చర్చకు దారితీసింది.

 

#LokSabha #LokSabhaProrogation #Congress #JairamRamesh #Parliament #MonsoonSession2026 #DelimitationBill #AmitShah #IndianParliament #Article85 #Delimitation #ParliamentSession #PoliticalControversy #CongressParty #IndiaPolitics